Thursday, May 29, 2025
Homeఅంతర్జాతీయంవెనిజులాలో మదురో

వెనిజులాలో మదురో

- Advertisement -

– 82శాతం ఓట్లతో ఘన విజయం
కారకస్‌:
వెనిజులా ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్‌ మదురో నేతృత్వంలోని యునైటెడ్‌ సోషలిస్టు పార్టీ ఆఫ్‌ వెనిజులా (పీఎస్‌యూవీ) ఘనవిజయం సాధించింది. నేషనల్‌ ఎలక్టోరల్‌ కౌన్సిల్‌ (సీఎన్‌ఈ) సోమవారం ప్రాధమిక ఫలితాలను విడుదల చేయగా… పాలక పీఎస్‌యూవీ, దాని మిత్రపక్షాలు 82.68శాతం ఓట్లను గెలుచుకున్నాయి. ఈ ఫలితాలతో అటార్నీ జనరల్‌ కార్యాలయంతో సహా దేశంలోని కీలకమైన అధికార స్థానాలపై నియంత్రణ పాలక పార్టీకే కొనసాగనుంది. 24 రాష్ట్ర గవర్నర్ల స్థానాలకుగానూ 23 స్థానాలను ప్రభుత్వమే గెలుచుకుంది. ఇది ప్రతిపక్షానికి తీవ్రమైన ఎదురు దెబ్బే.
మొత్తంగా 2.1కోట్ల మంది ఓటర్లకు గానూ ఆదివారం జరిగిన పార్లమెంట్‌, ప్రాంతీయ ఎన్నికల్లో 42శాతం మంది ఓటర్లు (89లక్షలు) పాల్గొన్నారు. ఈ ఎన్నికలను ప్రతిపక్షం బహిష్కరించింది. గతంలో నాలుగు రాష్ట్రాలపై ప్రతిపక్షాలకు పట్టు ఉండేది. గతేడాది జులైలో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్ష నేతలు ఓటర్లను కోరారు. ప్రతిపక్ష నేత మరియా కొరినా మచడొ ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎక్స్‌లో పోస్టు పెడుతూ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 85శాతం మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారని ఆరోపించారు.
ప్రతిపక్షాల చర్యను తోసిపుచ్చిన మదురో
ప్రతిపక్షాల బహిష్కరణను మదురో తోసిపుచ్చారు. ఎన్నికల బరి నుంచి ప్రత్యర్థి వైదొలగినపుడు తాము ముందుకు చొచ్చుకుపోతామని వ్యాఖ్యానించారు. ఆదివారం నాటి పోలింగ్‌లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. 70మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఓటింగ్‌ను అడ్డుకోవడానికి ఉగ్రవాద నెట్‌వర్క్‌తో విధ్వంసం సృష్టించడానికి ప్రతిపక్ష సభ్యుడు జువాన్‌ పాబ్లో గుయానిపా ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు. విదేశాలతో కలిసి వెనిజులాలో కుట్రలు పన్నేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందంటూ ప్రభుత్వం హెచ్చరిస్తూనే వస్తోంది. డజన్ల సంఖ్యలో కిరాయి మూకలు కొలంబియా నుంచి దేశంలోకి ప్రవేశించాయనీ, పొరుగుదేశంతో బిజీగా వుండే సరిహద్దును మూసివేయడానికి ప్రయత్నించాయని ప్రభుత్వం విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -