బారామతిలో కూలిన ప్రయివేట్ జెట్…మరో నలుగురు మృతి
విజిబిలిటీ లేకపోవడమే కారణమా?
ప్రధాని సహా పలువురు ప్రముఖుల సంతాపం
నేడు అంత్యక్రియలు
విచారణ జరుపుతున్న ఏఏఐబీ, డీజీసీఏ
పూనే : మహారాష్ట్రలో బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు విమానంలో ప్రయాణించిన మరో నలుగురు వ్యక్తులు కూడా చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న వీఎస్‌ఆర్ వెంచర్స్ సంస్థ (ఢిల్లీ)కు చెందిన లియర్‌జెట్-46 విమానం పూనే జిల్లాలోని బారామతి సమీపంలో కుప్పకూలిపోయింది. విమాన రాడార్ అందించిన డేటా ప్రకారం…ఉదయం 8.10 గంటలకు ఈ విమానం ముంబయిలో బయలుదేరింది. ఆ తర్వాత 8.45 గంటలకు రాడార్ నుంచి అదృశ్యమైంది. దట్టంగా మంచు కమ్ముకోవడంతో రన్‌వే సమీపంలో వెలుతురు తక్కువగా ఉన్నదని పైలట్ తొలుత సమాచారం ఇచ్చాడు. బారామతి విమానాశ్రయంలో విమానాన్ని దింపేందుకు పైలట్ ప్రయత్నించగా అది కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. నాలుగైదు పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ప్రమాద వార్త తెలియగానే ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే, అజిత్ సతీమణి సునేత్ర, కుమారుడు పార్థ్ భౌతికకాయాన్ని తరలించిన ఆస్పత్రికి వెళ్లారు.
ప్రత్యక్షసాక్షి కథనం
‘చాలా బాధాకరం. విమానం కిందికి దిగుతున్న సమయంలోనే కూలిపోతుందని అనుకున్నాను. అలాగే జరిగింది. ఆ తర్వాత పేలిపోయింది. పెద్ద ఎత్తున పేలుడు జరిగిం ది. ఆ తర్వాత మేమంతా అక్కడికి చేరుకున్నాం. విమానం కాలిపోతూ కన్పించింది. మరోసారి విమానం నుంచి నాలుగైదు పేలుడు శబ్దాలు వినిపించాయి. విమానంలో ఉన్న వారిని బయటికి లాగేందుకు ప్రయత్నించాం. అయితే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఏమీ చేయలేకపోయాం. విమానంలో అజిత్ పవార్ ఉండడం చాలా బాధ కలిగించింది. నేను దానిని మాటల్లో చెప్పలేను’ అని ఓ ప్రత్యక్షసాక్షి చెప్పాడు. ప్రమాద తీవ్రతకు రెండు మృతదేహా లు ఎగిరి బయటపడ్డాయని తెలిపాడు. గాగుల్స్, చేతి గడియారాన్ని చూసి అజిత్ పవార్‌ను గుర్తించి బయటకు లాగామని, అయితే అప్పటికే నష్టం జరిగిపోయిందని వివరించాడు.
నేడు అంత్యక్రియలు
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయిన విషయాన్ని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ధృవీకరించింది. విమానంలో ఇద్దరు వ్యక్తులు (ఒక పీఎస్‌ఓ, ఒక అటెండెంట్), ఇద్దరు విమాన సిబ్బంది (పైలట్, ఫస్ట్ ఆఫీసర్) ఉన్నారని తెలిపింది. విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందం విచారణ జరుపుతోంది. కాగా విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ భౌతికకాయానికి గురువారం ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలుస్తోంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు కూడా వస్తారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అజిత్ పవార్ మృతికి సంతాప సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకూ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఈ సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. అధికారిక కార్యక్రమాలను నిర్వహించరు.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే….
ప్రమాద సమయంలో బారామతి విమానాశ్రయంలో వెలుతురు తక్కువగా ఉన్నదని పైలట్ సమాచారం ఇచ్చారని, రన్‌వే కనిపించడం లేదని చెప్పారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానం గాలిలో కొంతసేపు చక్కర్లు కొట్టిందని, ఆ తర్వాత రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు రన్‌వే కన్పిస్తుందా అని ఏటీసీ అడిగిందని, పైలట్ సానుకూలంగా స్పందించడంతో అనుమతి ఇచ్చిందని వివరించారు. అయితే ఆ వెంటనే విమానం కూలిపోయిందని అన్నారు. సమగ్ర దర్యాప్తు కోసం డీజీసీఏ, ఏఏఐబీ బృందాలు ఇప్పటికే పూనే చేరుకున్నాయని చెప్పారు. కాగా తాము ఆపదలో ఉన్నామని తెలియజేసే మేడే కాల్స్ ఏమీ పైలట్ల నుంచి రాలేదని డీసీసీఏ అధికారులు తెలిపారు.
పలువురి సంతాపం
అజిత్ పవార్ మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసి సంతాపాన్ని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి అజిత్ ఎంతో కృషి చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఈ సమయంలో తన ఆలోచనలు ఆయన కుటుంబంతోనే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అట్టడుగు స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన ప్రజా నాయకుడిగా అజిత్ పవార్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉండిపోతారని అన్నారు. మృతుల కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల నేతలు అజిత్ పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి షిండే, పలువురు రాష్ట్ర నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణ జరుపుతామని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
సాంకేతిక సమస్యలు లేవు : వీఎస్‌ఆర్ వెంచర్స్ వివరణ
ప్రమాదానికి గురైన విమానంలో సాంకేతిక సమస్యలేవీ తలెత్తలేదని వీఎస్‌ఆర్ వెంచర్స్ సంస్థ యజమాని వీకే సింగ్ తెలిపారు. విమానాల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తామని ఆయన చెప్పారు. విమానాన్ని నడిపిన పైలట్లు అనుభవజ్ఞులని అంటూ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్‌కు 16 వేల గంటలు, కో పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్‌కు 1500 గంటల అనుభవం ఉన్నదని వివరించారు.
‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ : అజిత్ చివరి మాటలు
ప్రమాదానికి గురవడానికి ముందు చివరిసారిగా అజిత్ పవార్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ఆ పోస్టులో వివరించారు. ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు.
కుట్ర లేదు : శరద్ పవార్
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కేవలం ఒక ప్రమాదమేనని, అందులో ఎలాంటి కుట్ర లేదని, ఈ ఘటనను రాజకీయాల్లోకి లాగవద్దని ఎన్‌సిపినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. ఆయన మృతి మహారాష్ట్రకు పెద్ద షాక్ అని వ్యాఖ్యానించారు.
ఒక్కసారిగా ఎడమవైపునకు వంగి
ప్రమాదానికి సంబంధించి కొత్తగా బయటకు వచ్చిన సిసిటివి ఫుటేజ్ ప్రకారం కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు విమానం పూర్తిగా ఎడమవైపునకు వంగిపోవడం కనిపిస్తోంది. చాలా వేగంతో కిందకు దిగుతున్న విమానం ఇలా ల్యాండింగ్ సమయంలో ఎడమవైపునకు వంగడం అసాధారణమని విమానరంగ నిపుణులు భావిస్తున్నారు. బహుశా సాంకేతిక వైఫల్యం వుండొచ్చునని అనుమానిస్తున్నారు.
యువ పైలట్ శాంభవి పాఠక్ మరణం
కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ ఉన్నా..వెంటాడిన మృత్యువు
మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో యువ పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్ కూడా కన్నుమూశారు. చిన్న వయసులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ పొందిన ఆమె.. ప్రస్తుతం ప్రమాదం జరిగిన విమానంలో ఫస్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు.శాంభవి పాఠక్ ఎయిర్‌ఫోర్స్ బాలభారతి స్కూల్‌లో చదువుకున్నారు. 2016-18 మధ్య సెకండరీ విద్యను పూర్తిచేసుకున్న ఆమె.. ముంబయి యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కమర్షియల్ పైలట్ శిక్షణ తీసుకుని లైసెన్స్ పొందారు.
ఆ తర్వాత భారత్‌కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తో పాటు ఫ్రోజెన్ ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గానూ పనిచేశారు. 2022 ఆగస్టు నుంచి వీఎస్‌ఆర్ వెంచర్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలో ఫుల్ టైమ్ ఫస్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలు, బిజినెస్ ప్రముఖులు ప్రయాణించే లియర్‌జెట్-45 లాంటి విమానాలను నడుపుతున్నారు. బుధవారం అజిత్ పవార్ ప్రయాణించిన లియర్‌జెట్-45 విమానంలో పైలట్ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్? వ్యవహరించగా.. శాంభవి ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈ ప్రమాదంలో సుమిత్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ సుమిత్‌కు 16,500 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది.



