Magazines

గిగ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు..జీవోలో 10 అంశాలు

3 గంటల క్రితం

gig-workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆన్ లైన్ వేదికగా యాప్ ఆధారంగా రాష్ట్రంలో పలు సంస్థలు విస్తృతంగా సేవలు అందిస్తున్నా విషయం తెలిసిందే. ఆయా( స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ తదితర) సంస్థల్లో యాప్ ఆధారిత సేవల్లో పనిచేసే గిగ్ వర్కర్ల సంక్ష‍ేమం, సామాజిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల జీవిత బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రకటించారు. గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు అందజేస్తామని చెప్పారు.


ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని 10 ముఖ్యమైన అంశాలు:


1. గిగ్ వర్కర్లకు ప్రత్యేక గుర్తింపు: స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సేవల్లో పనిచేసే గిగ్ వర్కర్ల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ. ప్రతి కార్మికుడికి ఆధార్ అనుసంధానిత ప్రత్యేక గుర్తింపు సంఖ్య (GID) కేటాయింపు.


2. సంక్షేమ బోర్డు ఏర్పాటు: గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాల అమలు, ప్రయోజనాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బోర్డు.


3. సంక్షేమ నిధికి కంపెనీల వాటా: గిగ్ వర్కర్లకు చెల్లించే ప్రతి లావాదేవీ మొత్తంపై ప్రభుత్వం నిర్ణయించే రేటుతో కంపెనీలు సంక్షేమ నిధికి చెల్లింపులు చేయాలి. ఈ రేటు గరిష్ఠంగా 2 శాతం వరకు ఉండవచ్చు.


4. బీమా, వైద్య ప్రయోజనాలు: అర్హులైన గిగ్ వర్కర్లకు జీవిత బీమా, ప్రమాద బీమా, వైద్య సహాయం, వైకల్య ప్రయోజనాలు, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య రక్షణ వంటి పథకాలను బోర్డు రూపొందించవచ్చు.


5. ఏడు రోజుల్లో చెల్లింపులు: గిగ్ వర్కర్లు చేసిన పనికి సంబంధించిన డబ్బులను కంపెనీలు నిర్ణీత చెల్లింపు గడువులో లేదా పేమెంట్ సైకిల్ ముగిసిన ఏడు రోజుల్లోగా చెల్లించాలి.


6. కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించరాదు: గిగ్ వర్కర్ ఖాతాను నిలిపివేయడం లేదా పని నుంచి తొలగించడంపై నిబంధనలు. సాధారణంగా 14 రోజుల ముందస్తు నోటీసు, కారణాల వివరణ అవసరం. కొన్ని తీవ్రమైన ఉల్లంఘనలకు మినహాయింపులు ఉన్నాయి.


7. పనిచేసే సమయంలో భద్రత: గిగ్ వర్కర్లకు భద్రతా నిబంధనలు, అత్యవసర హెల్ప్‌లైన్, ప్రమాదాల నివారణ చర్యలు, యాప్‌లో పానిక్ బటన్ వంటి సౌకర్యాలు కల్పించాలి.


8. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ: కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అంతర్గత వివాద పరిష్కార కమిటీ (IDRC), గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ వ్యవస్థ. నిర్ణయాలపై అప్పీల్ చేసుకునే అవకాశం.


9. కంపెనీలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్: తెలంగాణలో పనిచేసే గిగ్ ప్లాట్‌ఫామ్ కంపెనీలు బోర్డులో నమోదు కావాలి. కార్మికుల సంఖ్య, చెల్లింపులు, సంక్షేమ నిధి వివరాలను క్రమం తప్పకుండా సమర్పించాలి.

మ్యాప్‌లుచూడండి


10. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు: సంక్షేమ నిధి చెల్లించని కంపెనీలకు మొదటి ఉల్లంఘనపై రూ.50 వేల జరిమానా. రెండోసారి రూ.లక్ష, మూడోసారి రూ.లక్షా 50వేలు. నాలుగోసారి నుంచి చెల్లించాల్సిన బకాయి మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధించే నిబంధన.
 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్