Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

- Advertisement -

10 మంది మావోయిస్టులు మృతి
మనోజ్‌ అలియాస్‌ మోడెమ్‌ బాలకృష్ణ హతం
అతనిపై రూ. కోటి రివార్డు

గరియాబంద్‌ : అడవుల్లో రక్తపుటేరులు పారుతున్నా యి. కేంద్రహౌంశాఖ విధించిన గడువు సమీపిస్తున్న కొద్దీ దండకారణ్యాలు కాల్పుల మోతలతో దద్దరిల్లుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో జరిగిన ఆపరేషన్‌లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత మనోజ్‌ అలియాస్‌ మోడెమ్‌ బాలకృష్ణ కూడా ఉన్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. మోడెమ్‌ మృతి తమ విజయమని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. గరియాబంద్‌ ప్రాంతంలో అగ్రశ్రేణి మావోయిస్టు నేత బాలకృష్ణ ఉన్నట్టు నిర్ధారించాక..ఆపరేషన్‌ నిర్వహించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి.ఈ ఆపరేషన్‌లో రూ.కోటి రివార్డు ఉన్న బాలకృష్ణతో సహా పదిమంది మావోయిస్టులను మట్టుబెట్టినట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టునేత మనోజ్‌ అలియాస్‌ మోడెమ్‌ బాలకృష్ణను కేంద్ర కమిటీలో సీనియర్‌ సభ్యుడుగా గుర్తించాయి. గరియాబంద్‌లోని మారుమూల ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచిన రాష్ట్ర పోలీసు బృందాలు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) , కోబ్రా బెటాలియన్‌ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గరియాబంద్‌ ఎస్పీ నిఖిల్‌ రఖేచా పర్యవేక్షిస్తున్నారు.

మావోయిస్టులకు బలమైన స్థావరం గరియాబంద్‌
గరియాబంద్‌ జిల్లా చాలా కాలంగా మావోయిస్టు కార్యకలాపాలకు బలమైన స్థావరంగా ఉంది, ఇక్కడ భద్రతా దళాలు , మావోయిస్టుల మధ్య అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇటీవలి సంవత్సరాలలో, భద్రతా దళాలు ఇక్కడ నక్సలిజాన్ని బలహీనపర్చేందుకు.. ఆపరేషన్లను మరింత ఉధృతం చేశాయి.

మనోజ్‌ అలియాస్‌ మోడెం బాలకృష్ణ ఎవరు?
మనోజ్‌ అలియాస్‌ మోడెం బాలకృష్ణ మావోయిస్టు సంస్థలో కీలకనేతగా ఉన్నారు. హత్య, దోపిడీ, పోలీసులపై దాడి కేసుల్లో ఆయన నిందితుడని భద్రతాబలగాలు తెలిపాయి. బాలకృష్ణ మృతితో మావోయిస్టు కార్యకలాపాల వెన్ను విరిచినట్టయిందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఓవైపు మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతుంటే.. మరోవైపు ఎన్‌కౌంటర్ల పేరిట కేంద్రం అంతమొందిస్తుం దని పౌర సమాజం ఆరోపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -