Tuesday, December 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకైట్‌ ఫెస్టివల్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి

కైట్‌ ఫెస్టివల్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి

- Advertisement -

అధికారులకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సంక్రాంత్రి పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జనవరి 13 నుంచి 15 వరకు జరిగే అంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కైట్‌ ఫెస్టివల్‌ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నామని తెలిపారు. సరైన పేరు, ప్రత్యేక బ్రాండింగ్‌, ఆకర్శణీయమైన లోగోను రూపొందించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సారి కైట్‌ ఫెస్టివల్‌ను హైడ్రా ద్వారా పునరుజ్జీవంచబడిన చెరువుల వద్ద నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయా చెరువుల వద్ద హైడ్రాకు చెందిన ఒక్కో అధికారిని నియమించాలని సూచించారు.

తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ వేడుకలను తిలకించటానికి వచ్చే సందర్శకులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కైట్‌ ఫెస్టివల్‌లో హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే సందర్శకుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాల్లో జాతీయ, అంతర్జాతీయ కైట్‌ క్రీడాకారులు పాల్గొని పలు డిజైన్లలో రూపొందించిన పతంగులను ఎగరేస్తారని తెలిపారు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలను స్టాళ్లలో అందుబాటులో ఉంచనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, మను చౌదరి, ఎస్పీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -