బీఆర్‌ఎస్, బీజేపీ గెలిస్తే ఉపయోగం ఉండదు : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్‌ను జగ్గారెడ్డి కట్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఇప్పటికే అనేక రకాలుగా అభివృద్ధి చేశామని, ఇంకా అభివృద్ధి చెందాలంటే యువకుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు కోరారు. నవీన్‌యాదవ్ విజయం సాధించిన వెంటనే ప్రజలు సమస్యలు తెలియజేస్తే ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించే బాధ్యతను అతను తీసుకుంటారని చెప్పారు. తాను కూడా ఆ దిశగా కృషి చేస్తానన్నారు.
బాగా ఆలోచించి మీ భవిష్యత్, పిల్లల భవిష్యత్ బాగుపడాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. తామంతా జవాబుదారీగా ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ గెలిస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందించేందుకు సీఎం ఆలోచిస్తున్నారని, ఇందుకు సంబంధించిన బడ్జెట్ సమకూర్చుకోవడంలో నిమగమయ్యారని తెలిపారు. సోషల్ మీడియా వారు కేటీఆర్ అనుమతితో తెలంగాణ భవన్‌లోనే నివసిస్తున్నారని తనకు అనుమానంగా ఉందన్నారు. అలాగే హైడ్రాను బూచిగా చూపిట్టే ప్రయత్నం చేస్తున్నారని, జూబ్లీహిల్స్‌లో ఏ ఒక్క ఇల్లు కూల్చలేదని తెలిపారు. నవంబర్ 11న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ ”చేతి” గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని, జూబ్లీహిల్స్ ఓటర్లు వివేకవంతులని, మీపై తనకు నమ్మకం ఉందని అన్నారు.



