జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలో వైద్య శాఖ ద్వారా గుర్తించిన మధుమేహం వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కరికి రేటినో స్కోపి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు రేటినో స్కోపి అత్యాధునిక సాంకేతిక పరికరం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో ముందుగానే రెటినోపతి వ్యాధిని గుర్తించి నివారణ చర్యలకు వంద రోజులు ప్రణాళికలు సిద్దం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లతో రెటినోపతి వైద్య పరీక్షల కార్యాచరణ పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వైద్య పరీక్షలు నవంబర్ 14 నుండి ప్రారంభించి వంద రోజుల్లో జిల్లాలోని ప్రతి మధుమేహం వ్యక్తికి రెటినోపతి వైద్య పరీక్ష నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెటినోపతి వ్యాధి మధుమేహం వ్యాధిగ్రస్తులకు సోకి క్రమంగా అందత్వం వచ్చే ప్రమాదం ఉంటుందని అందువల్ల ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన వైద్యం చేయించేచడమే వైద్య పరీక్షల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు ఉపయోగించే రెటినోస్కోపీ అనే అత్యాధునిక సాంకేతిక పరికరాన్ని సమకూర్చుకోవడం జరిగిందని, అవసరమైన మేరకు ఆప్తాల మాలజీలను నియమించుకుని తగిన శిక్షణ ఇచ్చిన గ్రామస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తం చేయాలని సూచించారు.
గత సంవత్సరంలో జిల్లాలోని ఇంటింటికి వెళ్లి 30 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ మధుమేహం వైద్య పరీక్షలు నిర్వహించి దాదాపు 20,000 మంది మధుమేహం వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరిగిందని, వారందరికీ ఒక షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇందులో పాజిటివ్ వచ్చినవారికి గుర్తించి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని అవసరమైన వారికి సరోజినీ హాస్పిటల్ లేదా ఎల్వీ ప్రసాద్, పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ కు సిఫారసు చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావు, ఉప వైద్య ఆరోగ్య అధికారి డా. శ్రీనివాసులు, ఆప్తాలమాలజీ హెచ్.ఓ. డి డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



