– సీఐటీయూ నేత పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను బలహీనపరిచి పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేందుకు నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేసేందుకు దూకుడుగా వ్యవహరిస్తుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. బుధవారం ఆ సంఘం మండల కమిటీ సమావేశం మొడియం సీత అధ్యక్షతన స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12 న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తున్నట్టు తెలిపారు.లేబర్ కోడ్ లు అమలు జరిగితే యూనియన్ లు పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కులపై తీవ్రమైన దాడి జరుగుతుందని వెంటనే లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేబర్ కోడ్ లను కేరళ ప్రభుత్వం అమలు చేయబోమంటూ ప్రకటించిందని అదే తరహాలో తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు,నన్ని పార్వతి, సారమ్మ,భాగ్యలక్ష్మి,జానకమ్మ, కనక తదితరులు పాల్గొన్నారు.



