శ్వేతసౌధంలో సాదరపూర్వక స్వాగతం
వాషింగ్టన్ : న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీకి అమెరికా అధ్యక్ష భవనంలో సాదర పూర్వక స్వాగతం లభించింది. గతంలో చేసిన ఆరోపణలన్నింటినీ పక్కనపెట్టి మమ్దానీకి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిరునవ్వుతో స్వాగతం పలికారు. అంతేకాదు…ఆయనపై ప్రశంసలు కురిపించారు కూడా. గతంలో మమ్దానీ తనను ఫాసిస్టుగా సంబోధించడాన్ని గుర్తుచేసుకుంటూ ‘అయితే ఓకే’ అని అన్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల సమయంలో ట్రంప్, మమ్దానీ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు సాగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పరస్పరం వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు.
అయితే ఓకే
ట్రంప్‌ను ఇప్పటికీ ఫాసిస్టుగానే భావిస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మమ్దానీ సమాధానమిస్తూ ‘నేను దాని గురించి మాట్లాడాను’ అని అన్నారు. ఇంతలోనే ట్రంప్ జోక్యం చేసుకొని ‘అయితే ఓకే. మీరు అవును అని అనవచ్చు’ అని చెప్పారు. దీంతో ఇరువురు నేతలు చిరునవ్వులు చిందించారు. ‘అది చాలా సులభం. వివరించడం కంటే సులభం. నేను దానిని పట్టించుకోను’ అంటూ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థితో చేయి కలిపారు. మమ్దానీ కూడా నవ్వుతూ ‘అవును’ అని బదులిచ్చారు. కాగా ట్రంప్, మమ్దానీ మధ్య నడిచిన సంభాషణ కొద్దిసేపటికే సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది.
అనేక విషయాలు చర్చించాం
ఇమ్మిగ్రేషన్ నుంచి ఆర్థిక విధానాల వరకూ…మమ్దానీ, ట్రంప్ మధ్య అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. అభిప్రాయబేధాలను, ఆరోపణలు- ప్రత్యారోపణలను పక్కనపెట్టిన ఇరువురు నేతలు శుక్రవారం సుహృద్భావ పూరితమైన వాతావరణంలో సమావేశమయ్యారు. తాను ఆశించిన దాని కంటే అనేక అంశాలపై ఏకాభిప్రాయంతో ఉన్నామని ట్రంప్ చెప్పారు. న్యూయార్క్ నగరాన్ని తాము ఇద్దరం ప్రేమిస్తున్నామని, దాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అనేక అంశాలపై పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకున్నామని అన్నారు. ఇమ్మిగ్రేషన్ అమలుపై కూడా మాట్లాడుకున్నామని ట్రంప్ చెప్పారు. తమ మధ్య నెలకొన్న అభిప్రాయబేధాలు ప్రస్తావనకు రాలేదని మమ్దానీ తెలిపారు. జీవనవ్యయానికి సంబంధించిన ఒత్తిడులపై ప్రధానంగా దృష్టి సారించామని అన్నారు.



