Thursday, November 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంన్యూయార్క్‌ మేయర్‌గా మమ్దానీ ఘన విజయం

న్యూయార్క్‌ మేయర్‌గా మమ్దానీ ఘన విజయం

- Advertisement -

సోషలిస్టులకు నూతనోత్సాహం
ట్రంప్‌నకు తప్పని భంగపాటు

న్యూయార్క్‌ : భారత సంతతికి చెందిన డెమొక్రటిక్‌ పార్టీ నేత జోహ్రాన్‌ మమ్దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్‌ నగర మేయర్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. తద్వారా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. మమ్దానీని ఎన్నుకుంటే న్యూయార్క్‌ నగరానికి నిధులు ఇవ్వబోమంటూ ట్రంప్‌ హెచ్చరించినా ప్రజలు ఏ మాత్రం ఖాతరు చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరికి భిన్నంగా… మమ్దానీ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించారు. తాను సోషలిస్టునని ప్రకటించుకున్నారు. ప్రభుత్వరంగ పరిరక్షణ, శ్రామికవరగ్ర సంక్షేమమే ధ్యేయమని చెప్పి బరిలో నిలిచారు. ట్రంప్‌ను ఎదిరించి మరీ గెలిచారు. ఈ విజయం అమెరికాలో సోషలిస్టు భావజాలానికి పెరుగుతున్న ఆదరణకు ఒక సంకేతం. సామ్రాజ్యవాదానికి ఓ సవాలు. ఆఫ్రికాలో జన్మించిన మమ్దానీకి న్యూయార్క్‌ వాసులు పట్టం కట్టడం విశేషం.

ట్రంప్‌ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నగర మాజీ మేయర్‌ ఆండ్రూ క్యూమోపై మమ్దానీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. తనను తాను డెమొక్రటిక్‌ సోషలిస్టుగా చెప్పుకునే మమ్దానీ న్యూయార్క్‌ నగరానికి తొలి ముస్లిం మేయర్‌ కాబోతున్నారు. పొద్దుపోయే సమయానికి 91 శాతం ఓట్లు లెక్కించగా మమ్దానీకి 10,36,051 ఓట్లు లభించాయి. క్యూమోకు 8,50,000 ఓట్లు వచ్చాయి. అంటే క్యుమోపై మమ్దానీ దాదాపు 9 శాతం పాయింట్లు ఆధ్యికత ప్రదర్శించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జాన్‌ లిండ్సే మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1965 తర్వాత న్యూయార్క్‌ మేయర్‌ పదవికి పోటీ పడిన ఏ అభ్యర్థికీ మమ్దానీకి వచ్చినన్ని ఓట్లు రాకపోవడం విశేషం. పోలైన ఓట్లలో మమ్దానీకి యాభై శాతానికి పైగా ఓట్లు లభించాయి. క్యూమోకు 41 శాతానికి పైగా ఓట్లు రాగా లిండ్సేకు కేవలం ఏడు శాతం ఓట్లే వచ్చాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా
అమెరికా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు తమ సత్తా చూపారు. న్యూయార్క్‌, వర్జీనియా నగర మేయర్లుగా ఎన్నికైన మమ్దానీ, గజాలా హష్మీలు భారత మూలాలు కలిగిన వారే కావడం విశేషం. మమ్దానీ భారత్‌లో ప్రముఖ బాలివుడ్‌ దర్శకురాలు మీరా నాయర్‌ కుమారుడే. తండ్రి మహ్మద్‌ మమ్దానీ ఉగాండాకు చెందిన విద్యావేత్త. సలాం బాంబే, మాన్‌సూన్‌ వెడ్డింగ్‌ వంటి చిత్రాల దర్శకురాలైన మీరా నాయర్‌ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మమ్దానీ, తన ఎన్నికల ప్రచారంలో కూడా అవే భావాలను ప్రదర్శించి ఓటర్ల మనస్సు గెలుచుకున్నారు.

నవ శకానికి స్వాగతం ! విజయోత్సవ ప్రసంగంలో నెహ్రూ మాటలు గుర్తు చేసుకున్న మమ్దానీ
విజయం సాధించిన అనంతరం మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మమ్దానీ, భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ మాటలను గుర్తు చేసుకున్నారు. నవ శకానికి స్వాగతం పలుకుతున్నామంటూ ఆనాడు నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. నవశకం వైపు అడుగువేసినప్పుడు. ఒక శకం ముగిసినప్పుడు.. సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి నుంచి గళం వినిపించినప్పుడు.. చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మార్పుకు సంకేతమన్నారు. భవిష్యత్తు మన చేతుల్లో వుందన్నారు. ‘మిత్రులారా…మనం ఒక రాజకీయ రాజవంశాన్ని కూలదోశామని మమ్దానీ వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ మోసం చేసిన ఈ దేశానికి ఆయనను ఎలా ఓడించాలో చూపించాలంటే అది ఆయనను పెంచి పోషించిన ఈ నగరమేనని అన్నారు. క్యూమో వ్యక్తిగత జీవితం బాగుండాలని మాత్రమే నేను కోరుకుంటున్నానని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని న్యూయార్క్‌ వాసులు భావించినందునే తాను ఈ విజయం సాధించానని చెప్పారు. డెమొ క్రటిక్‌ ప్రైమరీ ఎన్నికలలో క్యూమోను మమ్దానీ ఓడించిన విషయం తెలిసిందే. అనేక మంది ప్రముఖులు క్యూమోను సమర్ధించినా చివరకు ఆయనకు ఓటమి తప్పలేదు. ఎన్నికలకు ముందు క్యూమోకు ట్రంప్‌ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ‘మీరు ఇదంతా చూస్తున్నారని నాకు తెలుసు. నేను మీకు నాలుగు మాటలు చెప్పాలని అనుకుంటున్నా. వాల్యూమ్‌ పెంచండి’ అని ట్రంప్‌ను ఉద్దేశించి మమ్దానీ చురకలు వేశారు.

పలు రాష్ట్రాల్లో డెమోక్రాట్లదే విజయం ! స్థానిక సంస్థల్లో భారత సంతతి నేతల సత్తా
వాషింగ్టన్‌ : అమెరికాలోని వర్జీనియా, న్యూజెర్సీ, న్యూయార్క్‌, కాలిఫోర్నియా నగరాలకు జరిగిన మేయర్‌, గవర్నర్‌ ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఈ విజయం ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బే. కేవలం సంత్సర కాలానికే అమెరికా పౌరులు ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నారని ఈ ఎన్నికలతో స్పష్టమైంది. అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ అభ్యర్థి జోహ్రాన్‌ మమ్దానీ ఘన విజయం సాధించగా, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గజాలా హష్మీ తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ జాన్‌ రీడ్‌ను ఓడించారు. గవర్నర్‌ పదవిలో ముస్లిం మహిళ ఎన్నిక కావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వీరిద్దరూ భారత మూలాలు కలిగిన వారే కావడం విశేషం. న్యూజెర్సీ గవర్నర్‌ ఎన్నికలో డెమోక్రాట్‌ అభ్యర్థి మికీ షెర్రిల్‌ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జాక్‌ సియాటరెల్లిని భారీ ఓట్ల తేడాతో ఓడించారు. న్యూజెర్సీ గవర్నర్‌గా ఎన్నికైన రెండవ మహిళ ఈమే. అలాగే కాలిఫోర్నియా, టెక్సాస్‌, ఓహియో, మిస్సోరా రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ డెమోక్రాట్‌ పాలిత రాష్ట్రాలే. మొత్తంగా ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులను డెమోక్రటిక్‌ అభ్యర్థులు చిత్తుచిత్తుగా ఓడించారు.

చెరిగిపోయిన రికార్డులు
న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన మమ్దానీ తన విజయంతో అనేక రికార్డులను చెరిపేశారు. 1892 తర్వాత నగర మేయర్‌గా ఎన్నికైన పిన్న వయస్కుడు ఆయనే. తొలి ముస్లిం మేయర్‌, ఆఫ్రికాలో జన్మించి అమెరికా నగరానికి మేయర్‌ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. క్వీన్స్‌ అసెంబ్లీ సభ్యుడైన 34 సంవత్సరాల మమ్దానీ గత సంవత్సరమే మేయర్‌ రేసులో అడుగు పెట్టారు. అప్పుడు ఆయనకు పెద్దగా గుర్తింపు కూడా లేదు. ధన బలమూ తక్కువే. పార్టీ మద్దతు కూడా లేదు. అయినప్పటికీ మాజీ గవర్నర్‌ క్యూమో, రిపబ్లికన్‌ అభ్యర్థి లిండ్సేలను మట్టి కరిపించారు.

అందుకే ఓడాం : ట్రంప్‌
తాజాగా మమ్దానీ విజయంపై ట్రంప్‌ స్పందించారు. ‘నేను బ్యాలెట్‌ పేపరులో లేను. ప్రభుత్వ షట్‌డౌన్‌ కొనసాగుతోంది. రిపబ్లికన్‌ పార్టీ ఓటమికి ఈ రెండూ కారణాలే’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ట్రంప్‌తో కలిసి పనిచేస్తా
ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ స్థానంలో మమ్దానీ న్యూయార్క్‌ మేయర్‌గా బాధ్యతలు చేపడతారు. మేయర్‌ పదవికి తిరిగి పోటీ చేయరాదని సెప్టెంబరులో ఆడమ్స్‌ నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మమ్దానీ, ట్రంప్‌ మధ్య పరోక్ష యుద్ధం సాగింది. మమ్దానీని ట్రంప్‌ పదే పదే కమ్యూనిస్టు వెర్రివాడు అంటూ తూలనాడారు. మమ్దానీ ఎన్నికైతే విపత్తు సంభవిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ మమ్దానీ మాత్రం ఎక్కడా ట్రంప్‌పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. న్యూయార్క్‌ ప్రజల క్షేమం కోసం దేశాధ్యక్షుడితో కలిసి పనిచేస్తానని తెలిపారు. అయితే న్యూయార్క్‌ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం పోరాడతానని స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమ విధానాలవైపే ప్రజలు న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికే ఉదాహరణ మమ్దానీకి సీపీఐ(ఎం) అభినందనలు
న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోహ్రాన్‌ మమ్దానీకి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. భారత మూలాలు కలిగిన వ్యక్తి ఈ విజయం సాధించారంటే అది మనందరికీ గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో సాధించిన ఈ విజయాన్ని చూస్తుంటే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే విధానాలకే ప్రజలు మొగ్గు చూపారని స్పష్టమవుతోందన్నారు. ‘ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన ప్రగతిశీల ప్రజాస్వామ్యవాద శక్తులమైన మేము ఈ సామ్రాజ్యవాద మిలటరీ- పారిశ్రామిక- మీడియా సముదాయానికి వ్యతిరేకంగా మా వాణిని వినిపిస్తామని, మీకు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు బాసటగా వుంటాం’ అని ఈ సందర్భంగా బేబీ ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రజా వాణిని అణచివేయాలని చూస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలబడేందుకు మా ప్రజలు ఒక ఉమ్మడి ప్రాతిపదికను కనుగొనాలని బేబీ ఆకాంక్షించారు.

అమెరికా స్థానిక ఎన్నికలో భారత సంతతికి చెందిన నేతల సత్తా
వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం
తొలి ముస్లిం మహిళగా రికార్డు

వర్జీనియా : అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు సత్తా చాటారు. వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా డెమో క్రాట్‌ నాయకురాలు గజాలా హష్మీ విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించినట్టు సమాచారం. బాల్యంలో అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించినట్టు తెలుస్తోంది. నాలుగేండ్ల ప్రాయంలో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు, ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా.. జార్జియా సదరన్‌ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ చదివారు.అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. అజహర్‌తో వివాహం అనంతరం గజాలా 1991లో రిచ్‌మండ్‌ ప్రాంతానికి మారారు. 30 ఏండ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనేట్‌ విద్య, వైద్య కమిటీ చైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.

వామపక్ష నాయకత్వ లక్షణాలు
అన్నింటికంటే ముఖ్యంగా డెమొక్రటిక్‌ పార్టీలోని చాలా మంది కోరుకుంటున్న నాయకత్వ లక్షణాలు ఆయనలో కన్పించాయి. వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు పలువురిని ఆకర్షించాయి. చిన్నారులను ఉచితంగా సంరక్షించాలని, ప్రజా రవాణాను విస్తరించాలని, స్వేచ్ఛా మార్కెట్‌ వ్యవస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తుండగా వాటిని మమ్దానీ గట్టిగా సమర్ధించారు. డెమొక్రటిక్‌ పార్టీకి ఇటీవలి కాలంలో దూరమైన శ్రామిక ఓటర్లను తిరిగి సొంతగూటికి రప్పించడంలో ఆయన విజయం సాధించారు. వారు ఎదుర్కొంటున్న ప్రధాన ఆర్థిక సమస్యలపై దృష్టి సారించారు. వామపక్షాల సాంస్కృతిక విలువలను ఆయన ఎన్నడూ తిరస్కరించలేదు.

డెట్రాయిట్‌ తొలి మహిళా మేయర్‌గా మేరీ షెఫీల్డ్‌
డెట్రాయిట్‌ నగర మేయర్‌గా తొలిసారి మహిళా నేత, సిటీ కౌన్సిల్‌ అధ్యక్షురాలు మేరీ షెఫీల్డ్‌ ఎన్నికయ్యారు. ఆమె తన ప్రత్యర్థి, ప్రముఖ మెగా చర్చ్‌ పాస్టర్‌ రెవరెండ్‌ సోలోమన్‌ కిల్నోచ్‌ని మంగళవారం జరిగిన ఎన్నికలలో ఓడించారు. మూడు సార్లు డెట్రాయిట్‌ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన మైక్‌ డగ్గన్‌ స్థానంలో ఆమె జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలలో తిరిగి పోటీ చేయబోనని ఆయన గత సంవత్సరమే ప్రకటించారు. డగ్గన్‌ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా మిచిగాన్‌ గవర్నర్‌ పదవి రేసులో ఉన్నారు. డెట్రాయిట్‌ నగరం అమెరికా చరిత్రలో దివాలా తీసిన అతి పెద్ద మున్సిపాలిటీ. అయితే 2014లో ఆ పరిస్థితి నుంచి బయటపడింది. ఆ తర్వాత పరిస్థితులు క్రమేపీ మెరుగయ్యాయి. కాగా మేయర్‌ పదవికి పోటీ పడిన షెఫీల్డ్‌, కిల్నోచ్‌…వీరిద్దరూ డెమొక్రాట్లే. షెఫీల్డ్‌ అభ్యర్థిత్వానికి డగ్గన్‌ మద్దతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -