– ప్రపంచ రాజకీయ దిశను మార్చనున్న తాజా విజయం
– ప్రజలకు కావాల్సింది న్యాయం, సమానత్వం, హక్కులు
– మితవాద, మతతత్వ శక్తులతో అది సాధ్యం కాదు
– దేశంలోనూ ‘న్యూయార్క్’ వంటి మార్పే రావాలి
– ఆరెస్సెస్ వంటి హిందూత్వ శక్తుల కుయుక్తులను తిప్పికొట్టాలి
– మేధావులు, విశ్లేషకులు
న్యూఢిల్లీ : న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధించిన డెమోక్రటిక్ పార్టీ నేత జోహ్రాన్ మమ్దానీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు తన విజయంతో షాకిచ్చిన మమ్దానీ విజయం రైట్ వింగ్ శక్తులకు రుచించడం లేదు. మూడు పదుల వయసులోనే అపూర్వమైన విజయాన్ని సాధించిన ఆయన వామపక్ష నాయకత్వ లక్షణాలు లెఫ్ట్‌వింగ్ భావజాలానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయ. ముఖ్యంగా, మమ్దానీ విజయాన్ని భారత్‌లోని పరిస్థితులకు పోల్చి చూస్తున్నారు మేధావులు, విశ్లేషకులు. 2014లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక దేశంలో మతోన్మాదదాడులు పెరిగిపోయాయి. దేశంలోని మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలకు రక్షణ, భద్రత కరువైంది. మతోన్మాద భావజాలంతో పని చేసే ఆరెస్సెస్ సంస్థ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసే బీజేపీ.. దేశాన్ని కాషాయమయం చేయాలని భావిస్తున్నది. ఇలాంటి రైట్‌వింగ్ భావజాలాన్నే కలిగి ఉన్న డోనాల్డ్ ట్రంప్.. అటు అమెరికాలోనూ తీవ్ర అలజడులకు కారణమవుతున్నాడు. మితిమీరిన జాతీయవాదం పేరుతో టారిఫ్‌లు విధిస్తున్నాడు. వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఒక అడుగు ముందుకేసి మరీ.. మమ్దానీని ఎన్నుకుంటే న్యూయార్క్ నగరానికి నిధులు ఇవ్వబోనని బెదిరించాడు. అయినప్పటికీ అవేమీ లెక్క చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీనే ఎన్నుకోవడం గమనార్హం.తనను తాను సోషలిస్టుగా ప్రకటించుకున్న మమ్దానీ.. ప్రభుత్వరంగ పరిరక్షణ, శ్రామికవర్గ సంక్షేమమే తన ధ్యేయమని చెప్పారు. అలాంటి వ్యక్తి న్యూయార్క్ వంటి నగరంలో విజయం సాధించడం లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన న్యూయార్క్ మేయర్‌గా ఎన్నిక కావడం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదనీ, అది ప్రపంచ రాజకీయ దిశను మార్చగల మలుపు అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఈ విజయం రైట్‌వింగ్ శక్తుల నియంతృత్వ ధోరణులకు ఒక పెద్ద సవాలుగా నిలిచిందని చెప్తున్నారు. క్యాపిటలిజానికి కోట అయిన న్యూయార్క్‌లో ఒక సోషలిస్ట్ మేయర్‌గా ఎన్నిక కావడమనేది ప్రజలలో వస్తున్న మార్పునకు నిదర్శనమని అంటున్నారు. అందరూ అనుకున్నట్టే ట్రంప్.. మమ్దానీని ఒక కమ్యూనిస్టుగా పిలిచాడు. ఆర్థిక అసమానతల గురించి మాట్లాడే ఎవరినైనా ఒక కమ్యూనిస్టుగా ముద్రవేయడం, అది అంటరాని పదంగా చిత్రీకరించడం రైట్‌వింగ్ శక్తులకు సర్వసాధారణమైపోయింది. అయితే ఈ న్యూయార్క్ ఎన్నికలతో ప్రజలు ఇలాంటి వర్గీకరణను తిరస్కరించినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.
భారతీయ మూలాలున్న మమ్దానీ విజయం ఆరెస్సెస్ వంటి హిందూత్వ, రైట్‌వింగ్ శక్తులకు మింగుడుపడటం లేదు. మైనారిటీలు, అణగారిన వర్గాలు తమ హక్కులను వదిలి మెజారిటీ అభీష్టం మేరకు నడుచుకోవాలన్నది సంఫ్‌ు వంటి హిందూత్వ సంస్థల ఆలోచన. మైనారిటీ వర్గాలు మెజారిటీకి విధేయులుగా ఉండాలనీ, అవమానాలను భరించాలనే భావనతో ఉంటాయి. ఇలాంటి కుయుక్తులను ప్రజలు తిరస్కరించాలనీ, దేశంలోనూ న్యూయార్క్ వంటి మార్పే రావాలని మేధావులు సూచిస్తున్నారు. అటు ట్రంప్ అయినా, ఇటు భారత్‌లోని బీజేపీ ప్రభుత్వమైనా.. ఇస్లాం మతాన్ని టార్గెట్ చేసుకుంటూ, ద్వేషాన్ని పెంచేలా ప్రకటనలు చేస్తాయి. అయితే అమెరికా జనాభాలో ముస్లిం వాటా 1.5 శాతమే. ఒక ముస్లింగా మమ్దానీ ఇప్పుడు న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికవడం రైట్‌వింగ్ శక్తుల ద్వేషపూరిత ప్రచారాలను ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనమని మేధావులు చెప్తున్నారు.
సోషలిజం అనే పదమే గిట్టని అమెరికాలో.. మమ్దానీ తనను తాను డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని ప్రకటించుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక సోషలిస్టుగా ఆయన ప్రచారం ఇండ్ల హక్కు, ఆరోగ్యం, ఉచిత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి అంశాలపై జరిగింది. ఇది అసమానతను ‘హక్కుల సమస్య’గా చూపించింది. ఇప్పటి వరకు ఆర్థిక అసమానతల వల్ల కలిగిన అసంతృప్తిని రైట్‌వింగ్ శక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. అయితే మమ్దానీ విజయంతో ఆ పరిస్థితిలో మార్పు ప్రారంభమ యిందనీ, ఇది లెఫ్ట్‌వింగ్ రాజకీయాలకు కొత్త దారిని చూపుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.



