Magazines

30 ఏండ్లు దాటాయా..?

8 నిమిషాల క్రితం

years
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 3 నిమిషాల చదవడం

30 ఏండ్లు దాటిన తర్వాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మెటబాలిజం నెమ్మదించడం, ఎముకల బలం తగ్గడం, హార్మోన్ల హెచ్చుతగ్గులు, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే వాటిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే 30లోకి వచ్చాక కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...


బొప్పాయి: ఏ, సి విటమిన్లు, ఫోలేట్, ఇతర ఫైటోకెమికల్స్‌ పుష్కలంగా ఉన్న ఈ పండు స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులోని పపైన్‌ జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే ఈ పండులో ఉండే బీటాకెరోటిన్‌ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వయసుతోపాటు వచ్చే మాక్యులర్‌ డీజనరేషన్‌ను ఈ పండులోని పోషకాలు అడ్డుకుంటాయని, మధుమేహం, హృద్రోగాలు, కడుపుబ్బరం వంటి వాటినీ నియంత్రిస్తాయని చెబుతున్నారు.

జామ: జామలోని పోషకాలకు కొదువ లేదు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్, యాంటీ డయాబెటిక్, యాంటీ డయేరియా, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్, నియాసిన్, కాల్షియం, పొటాషియం, జింక్, కాపర్, కార్బోహైడ్రేట్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తంలో చక్కెర నిల్వలను, ఇన్సులిన్‌ నిరోధాన్నీ తగ్గించడంతోపాటు గుండె వ్యాధులు రాకుండానూ అడ్డుకుంటాయి. ముఖ్యంగా నెలసరిలో వచ్చే నొప్పుల తీవత్రను జామ పండు తగ్గిస్తుంది.

యాపిల్‌: రోజూ ఒక యాపిల్​ తింటే డాక్టర్​ అవసరం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇందులో లభించే పోషకాలు అన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఆహారంలోని అదనపు కొవ్వుల్ని శరీరం గ్రహించడాన్ని తగ్గించేందుకు యాపిల్​లో ఉండే పెక్టిన్‌ అనే ఫైబర్​ సాయపడుతుంది. పైగా ఈ పీచు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడంతో త్వరగా పొట్ట నిండిన భావన కలిగి కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలను అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీర్ఘకాలంలో బరువు తగ్గడానికీ సాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారు 4 నుంచి 12 వారాల పాటు ఆపిల్ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​ వెల్లడించింది. ఇక క్రమం తప్పక వీటిని తినేవాళ్లలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 22 శాతం తక్కువని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

అవకాడో: 30 ఏండ్లు దాటిన మహిళలు కచ్చితంగా అవకాడో తినాలి. ఎందుకంటే ఇందులో మోనోఅన్​శాచురేటెడ్ కొవ్వులు, ఒలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్​ను పెంచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా అవకాడోలను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని జనరల్‌ ఆఫ్‌ ‌ది అమెరికన్‌ ‌హార్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అలాగే అవకాడోలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మధ్యాహ్న భోజనంతోపాటు సగం తాజా అవకాడోను తిన్న స్త్రీలలో స్నాక్స్‌ వంటివి తినాలనే కోరిక 40 శాతం తగ్గిందట.

చెర్రీ: మధ్యవయసులో వచ్చే ఆర్థరైటిస్‌ను నిరోధించేందుకు చెర్రీలు ఎంతో సాయపడతాయి. వీటిల్లోని ఆంథోసైనిన్లు శక్తి స్థాయుల్ని పెంచుతాయి. అందుకే వారానికి నాలుగుసార్లు డజను చొప్పున ఈ పండ్లను తింటే మేలు. ఇక పెరుగుతో కలిపి తింటే విటమిన్లు మరింతగా ఒంటపడతాయి.

దానిమ్మ : చాలా మంది మహిళలు 30 ఏండ్లు దాటినాక రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు దానిమ్మను తినాలి. ఇందులో ఐరన్, విటమన్ సి, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి ఆహారంలోని ఐరన్​ను శరీరం త్వరగా గ్రహించుకోవడానికి అవసరం. అలాగే ఫోలేట్ అనేది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు.

కేవలం పైన చెప్పిన పండ్లు మాత్రమే కాకుండా మిగిలిన పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ప్రతి మహిళలూ... రోజూ మీ డైట్​లో పండ్లు ఉండేలా చూసుకోవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్