ఊరు అంటేనే అందమైన
వాతావరణం
ఎప్పుడూ కొత్తగా పొందే
అనుభూతి
ఆహ్లాదాన్ని ఇచ్చే ఏదో కొత్త
ఋతువు ఆ నేలను
పరిమళింప జేస్తుంది
అక్కడ వీచే చల్లని గాలి
నాకు ఊరికి మద్య
అల్లుకున్న ( ఊపిరిపోసే) శ్వాస
మా ఇద్దరి మధ్య కల్మషం లేని
మనుషుల చిరునవ్వే
అనిర్వచనీయమైన బంధం
కోడి కూయక ముందే ఊరు
మేల్కొంటుంది
సాన్పి జల్లి అమ్మ గుమ్మం ముందు
ముగ్గవుతుంది
ఉన్నా లేకున్నా అమ్మ చేతిలో
బర్కత్ ఉంటుంది
కలిసిరాని కాలం చేసిన గాయం
నాన్న గుండెల్లో నాగలి కర్రు యై
సలుపుతుంటది
పండగకో పబ్బానికో ఊర్లోకొచ్చే
నన్ను ఆప్యాయ ఊరు పరికరింపులు
గుండెను చెరువు చేస్తాయి
మా ఊరి నేల తల్లి తన రెండు చేతులతో
నన్ను ఒడిసిపట్టుకున్నప్పుడు కన్నీళ్లు
ఆనంద భాష్పాలై ప్రవహిస్తాయి
బాల్య మిత్రులందరు
జమ్మి చెట్టు సాక్షిగా
ఇచ్చే అలాయ్ బలాయ్ లు
చిన్నప్పటి జ్ఞాపకాల
కొమ్మల్లో చిగురిస్తాయి
బతుకమ్మ పువ్వుల తీరొక్క
కథలకు తల్లిగారిల్లు ఊరట
అవుతుంది
ప్రస్తుతం నా ఊరిలో నేను
ఒంటరినయ్యాను
పాత తరం గుర్తులు లేవు
ఈ తరంతో పరిచయాలు లేవు
ఊరు ఊరులా లేదు
నా ఊరిలోనే నేను
తప్పిపోయిన జ్ఞాపకాన్ని.....
ప్రమోద్ ఆవంచ, 7013272452
తప్పిపోయిన జ్ఞాపకాన్ని...
11 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)