మానవీయ విలువలు పరిమళించేలా సామాజిక చేతనతో, బాధ్యతగా కవిత్వం రాస్తున్న వర్ధమానకవి నల్గొండ రమేష్. కూడలిచెట్టుగా సాహితీ లోకానికి పరిచితుడైన రమేశ్.
ఇప్పుడు తన చుట్టూ ఉన్న సామాన్యుల బాధామయ గాథలను వెతలను మనసుతో స్పర్శించి, మనసులో సంఘర్షించి "దిగులు ద్వీపం"గా కవిత్వ సంపుటిని వెలువరించారు.
ఈ సంపుటిలోని మొదటి కవిత 'మాను గానం' చింత చెట్టును ఆసాంతం చిత్రించిన కవిత. "పసిపిల్లల ఆటలకు/ బడిలో పంతులు చెప్పే లెక్కలకు/ చింత గింజల ఉపకారమే/ కాయల్లో పులిపే గానీ/ దరికి రారమ్మనే పిలుపే మధురం/ ఆర్థిక చిక్కుముళ్లు గాని/ ఇ 'గోల' బ్రహ్మజముళ్లు గానీ దానికి లేవు"మనిషిది స్వార్థతత్వం.
ఎప్పుడు ఏదో ఒక సమస్య చింత ఉంటుంది. తన సర్వస్వం లోకానికి ఇచ్చే మానుది త్యాగభావం. అందుకే కవి అంటాడు దాని పేరులో చింత ఉన్న దాని బతకంతా నిశ్చింత అని.
ప్రతి మనిషికి జీవితంలో గాయాలు దుఃఖాలు తప్పవు.
అయితే కొన్ని కొన్ని దుఃఖాలను జీవితకాలం మోస్తూనే కొందరు బతుకుతుంటారు. 'తడికన్ను' కవితలో మూడుముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటైన ఓ స్త్రీ మూర్తి వ్యథార్థ జీవితాన్ని ఆర్ద్రతగా బొమ్మ కడతాడు.
'ఋణమంటే మరణమా' అని ప్రశ్నిస్తున్న కవితలో అప్పుల బాధలు తెలుపుతూ 'వెంటాడి వేటాడే మరణం' అంటున్నాడు. "పేదరికాన్ని రూపుమాపే జాతి అభివృద్ధి పథకాలేవి?" అని ప్రశ్నిస్తున్నాడు. మనిషితనం లేని సమాజంలో అప్పుల బాధకు తాళలేక, జీవితాలు చాలించుకుంటున్న వాళ్లను తెలిసి మనం కదిలిపోతాము.
'రైతుదే భూగోళం' కవితలో "నీ జానెడు పొట్టకు కడుపునిండా/ ఇంత అన్నం పెట్టే వాడు ఎవడయ్యా?/ అన్నదాత కాకపోతే" అనే ఎరుకను కలిగిస్తూ, రైతు శ్రమ జీవనాన్ని గుర్తు చేస్తున్నాడు. మనం జీవితాంతం రైతులకు కృతజ్ఞులమై ఉండాలని ఉద్బోధిస్తున్నాడు కూడా.
'ఆకలి పొద్దు' కవితలో పసుల కాపరి జీవితాన్ని మొత్తం ఆర్ద్రతగా అద్భుతంగా రికార్డు చేసిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా డా.ఏనుగు నరసింహారెడ్డి గారి మాటలను ప్రస్తావించడం అవసరమని భావిస్తున్నాను.
పశువులను కాసే పాలబుగ్గల జీతగాడి గురించి సుద్దాల హనుమంతు ఎప్పుడో గేయం రాశారు. మళ్లీ ఇప్పుడు పశువుల కాపరి జీవితాన్ని కవితా వస్తువుగా నల్గొండ రమేష్ రాసారని ప్రశంసించారు.
"జీవితానికి ఏది పూర్ణమో అది అమ్మ/ అమ్మ ప్రేమ లేని ఎవరి జీవితమైనా అసంపూర్ణమే" అంటున్నాడు. ప్రఖ్యాత కవి డా.N.గోపి 'ఒంటరితనమంటే అమ్మ లేకపోవటమే! అదొక్కటే నిక్కమైన ప్రేమ' అంటారు.
తల్లిని కోల్పోయిన ఈ కవి కూడా భూలోకం అందాన్ని కోల్పోయింది అంటున్నాడు. ఆమె లేని తాను కూడా 'ఒంటరి సున్నా'నంటున్నాడు.
'దిగులు ద్వీపం' కవిత ఈ సంపుటిలో చివరిది. మతిస్థిమితం లేని ఓ అనాధ వ్యక్తి చుట్టూతా అల్లుకున్న కవిత్వపు తడి మన హృదయాలను ద్రవింప చేస్తుంది. ఎన్నో ప్రశ్నలుగా సమాజంలోని అమానవీయతను నిలదీస్తుంది." అతడు పిచ్చివాడేం కాదు/ మానవత్వపుటెడారి ఎండమావుల వెంట/ తనివి తీరని ధన దాహాల వెంట/ అలుపు మరిచి పరిగెత్తే మహానుభావుల సాక్షిగా/ ఈ పచ్చ కాగితాలలోకమే పిచ్చిది అనుకుంటా!" అంటూ సమాజ స్వభావాన్ని బాగాచదివిన కవి ఇలా స్పందిస్తున్నాడు.
ఈ సంపుటిలో బడిగంట మోగుతూనే ఉంటుంది.
జాతర హేలా సంబరముంటుంది. ఉద్యోగ విరమణ పొందిన రాజీవుడు కనిపిస్తాడు. పాఠశాలను శుభ్రపరిచే సుగుణమ్మ సుగుణాల అమ్మగా, ఆడసిపాయిగా దర్శనమిస్తారు. ఒంటరిపక్షి లాంటి స్త్రీలు,టీజీ బుల్డోజర్ కూల్చిన హైడ్రాబాధితుల వెతలు, వందే భారతంలో కులమతాల కుమ్ములాటలు, వొడవని దుఃఖాలు, దండకారణ్యంలో నకిలీ ఎన్కౌంటర్ల కర్కశత్వం, అడవి దుఃఖంతో పాటు అమ్మల దుఃఖము వినిపిస్తుంది. మస్కిటో మహాభారతంలో మనుషుల మీద పగ పట్టిన దోమలదండు దండయాత్రలు, మృత్యువర్ణంగా వృద్ధాప్యానికి ఎవరు అతీతులు కారనే తాత్వికత, సౌందర్యవంతమైన స్త్రీ సంతకం, అంగూర గుత్తుల వర్ణనలు ఇలా ఎన్నో ఉన్నాయి.
నల్గొండ రమేశ్ తనలోని భావాలకు రూపమిస్తున్నప్పుడు పదధారా ప్రవాహం అలలు అలలుగా సాగిపోతున్న నడక కనిపిస్తుంది.విషయాన్ని అనేక ఉపమానాలతో దృశ్యాత్మకంగా చూపుతాడు. విషయ విస్తృతి, భావగాఢత,వ్యక్తీకరణలో పరిణతి ఉంటుంది.
మంచి ఆలోచనలతో రచించిన "దిగులు ద్వీపం" మంచి కవితా సంపుటి అని చెప్పవచ్చు.
గడ్డం సులోచన, 7702891559






కామెంట్‌లు (0)