అక్షరాలు నాతో పేచీ పడుతున్న తీరును
మీరూ ఒక సారి వినాలి-
ఎండాకాలం రైతులు తవ్విన కోపుల్లోంచి
ఒండుమట్టిని తెచ్చి యతులు ప్రాసలు సృష్టిస్తాను
పద్యం నన్ను నిరసిస్తుంది
నేను నీ కాగితం మీద కంటే చెరువులోనే సారవంతంగా ఉండేదాన్ని అని-
సన్నసన్నని వెదురు కర్రలు తెచ్చి
పిల్లనగొయ్యలు చేస్తున్న నాన్నచేతివేళ్ల గాలిలోంచి శ్రుతులు స్వరాలు రచిస్తాను
పాట నన్ను అభిశంసిస్తోంది
నేను నీ గొంతులో కంటే గుల్మం చెంతనే సుగమంగా రవళించేదాన్ని అని-
కంకుల మీద ఊయలూగుతున్న
పిట్టల ముక్కులనుంచి రాలే పచ్చి గింజలను తెచ్చి
ఉపమానాలు ఉత్ప్రేక్షలు నిర్మిస్తాను
కవిత నన్ను నిలదీస్తోంది
నేను నీ వాక్యాల్లో కంటే చేను మొదటనే
అలంకారాలుగా ప్రకాశించేదాన్ని అని-
ఊరి జమ్మిచెట్టుకు అంతరిక్ష నౌకను లాంతరులా వేలాడదీయమని
పసిడి రెక్కలతో సీతాకోక చిలుకలు నాటుతున్న తోటలన్నిటినీ
సూర్యుడికి ఏకబిగిన చూపెట్టే భూదర్శినిగా తమకు ఆయువులు పోయమని
నిజమైన గుండెతో మాట్లాడుతూ తారసపడే మను
షులతో ఉదయాలు ఉదయించేలా
మాకో అర్థం పరమార్థం సిద్ధించేలా సృజన కక్ష్యను మార్చమని
అక్షరాలు నాతో పేచీ పడుతున్న తీరును
అందరూ ఒక సారి వినండి-
ముఖ్యంగా రాబోయే తరం
రాపిడుల రాగాలపై వివక్షలను మరింత వినూత్నంగా
ఆలాపించాల్సిన అధునాతన తరం
అక్షరాలు నాతో పేచీ పడుతున్న తీరును ఒక సారి చెవులార వినాలి.
ప్రొఫెసర్ బెల్లి యాదయ్య, 98483 92690
డిస్సెంట్
9 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)