Magazines

‘పిడికిలి వదిలినప్పుడు’ - ఒక పరిపూర్ణ కవితా ప్రయాణం

12 నిమిషాల క్రితం

Journey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 4 నిమిషాల చదవడం

మా నెల్లూరు కవి దిగ్గజం డాక్టర్ పెరుగు రామకృష్ణ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కవిగా మనందరికీ సుపరిచితులు. ఎన్నో కవితా సంపుటాలు, దీర్ఘకావ్యాలు వెలువరించిన ఆయన, తన కవిత్వంతో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. విదేశాల్లోనూ తన కవితా యాత్రను కొనసాగిస్తూ, విశ్వవిశిష్ట సాహిత్య వేదికలపై తన గళాన్ని వినిపించారు. ఆయన దీర్ఘకావ్యం ‘ఫ్లెమింగో’లోని కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిదో తరగతి తెలుగు పాఠ్యాంశంగా చేర్చడం కవిగా ఆయనకు దక్కిన గొప్ప గౌరవం. ఆయన రచనలపై పరిశోధనలు జరిగి, పరిశోధకులు ఉన్నత విద్యా పట్టాలు పొందడం ఆయన కవిత్వానికి లభించిన సార్థకతగా చెప్పవచ్చు. అంతేకాకుండా పత్రికా సంపాదకుడిగా, పలు సాహిత్య పేజీల నిర్వాహకుడిగా కూడా ఆయన తన సేవలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మన ముందుకు వచ్చిన ‘పిడికిలి వదిలినప్పుడు’ ఆయన వెలువరించిన మొత్తం పుస్తకాలలో 33వది కాగా, కవిత్వ సంపుటాల్లో 12వది. కవిత్వంలో సాహితీ స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న కవిగా ఆయన సీనియారిటీకి, అనుభవ సంపదకు ఈ సంపుటి ఒక సజీవ సాక్ష్యం.


ఈ కవితా సంపుటిలో రామకృష్ణగారి కవిత్వం లోతైన భావాలను పలికిస్తూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ఆయన కవిత్వంలో జీవితం పట్ల ఆశావహ దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. కవిత్వానికి ప్రాణం ఎత్తుగడ, ముగింపు, మంచి అభివ్యక్తి అనుకుంటే, ఈ మూడు అంశాల్లోనూ కవి తనదైన శైలితో పాఠకుల మనసు పొరల్లోకి దూసుకెళ్లారు. మెరుగైన మానవ సంబంధాలను ఆకాంక్షిస్తూ, వెలకట్టలేని కుటుంబ బంధాల విలువను మనతో పంచుకుంటారు. అదే సమయంలో అనేక నూతన వస్తువులను అన్వేషించి, వాటిని కవితామయం చేయడంలో విజేతగా నిలుస్తారు. నూతన వస్తువు ఏదైనా, తన చేయి తిరిగిన ప్రతిభతో దాన్ని నవనవోన్మేషంగా ఆవిష్కరించడం రామకృష్ణగారి ప్రత్యేకత. ఈ సంపుటిలోని కవితా పాదాలను చదివినప్పుడు అవి నేరుగా హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుపోయే శక్తిని కలిగి ఉన్నాయని అనిపిస్తుంది. ‘ఓటీపీ క్షణాలు’ అనే కవితలో, బంధాలు కూడా ఓటీపీలలా.. ‘‘క్షణకాలం మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి” అంటూ ఆధునిక కాలంలో మానవ సంబంధాలు ఎంత క్షణికంగా మారిపోతున్నాయో వేదనతో చెబుతారు.

తెరల ప్రపంచం’ కవితలో సెల్ఫోన్కు బానిసవుతున్న మనిషి జీవనశైలిని ప్రశ్నిస్తూ... ‘‘రాత్రి అనేది ఇక విశ్రాంతి కాదు./ ప్రతి కంటిలోనూ ఒక చిన్న సూర్యుడు మండుతూనే ఉంటాడు” అంటారు. ఆధునిక సాంకేతిక ప్రపంచంలోని వెలుగుల వెనుక దాగి ఉన్న మానసిక అలసటను ఈ పాదాలు అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ... ‘‘ఇప్పుడు దొంగలు చీకట్లో కాదు/ క్లిక్కుల మధ్య సంచరిస్తున్నారు/ తాళాలు కాదు.. పాస్వర్డ్లు/ విరుగుతున్నాయి”అంటూ సమాజాన్ని అప్రమత్తం చేస్తారు. ‘మీ నాబ్ 168’ కవితలో... ‘‘ఆకాశంలో ఎగిరిన ఆ విమానం/ భూమికి ఒక ప్రశ్నను వదిలింది/ ఇంకా ఎంత రక్తం నింపితే/ మానవత్వం మేల్కొంటుంది?” అంటూ యుద్ధాలపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తారు. రాజ్యాల మధ్య ఆంక్షలను, సరిహద్దుల పేరుతో జరిగే హింసను నిరసిస్తూ... ‘‘పటాలపై గీసిన గీతల కోసం/ నేల ఎంత రక్తం తాగింది’’ అని సూటిగా గుండెల్లోకి అస్త్రాన్ని సంధిస్తారు. ‘టోల్ ప్లాజా’ గురించి... ‘‘రహదారి గుండె మధ్యలో/ పలుకులేని గుమ్మంలా నిలిచి ఉంటుంది” అని చెప్పడంలో ఒక వినూత్న కవితా దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఈ ‘పిడికిలి వదిలినప్పుడు’ సంపుటిలో అమ్మపై తన ప్రేమను కవి అనేక కోణాల్లో వ్యక్తీకరించారు.

అమ్మతో తన అనుబంధాన్ని, చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ ‘‘నువ్వు మడిచిన కాగితపు పడవల్లో/ నా బాల్యం ఇంకా తేలుతూనే ఉంది”అంటారు. ఎంత ప్రాణప్రదమైన కవితా పాదమిది! ‘అమ్మ వెళ్లిన తర్వాత’ కవితలో... “ఇల్లు అనే పడవలో చిల్లులు పడిన ప్రతి చోటా/ తన వేళ్లనే మేకులుగా కొట్టుకుంది” అంటూ ప్రతి ఇంటికీ అమ్మ ఎంత అవసరమో హృదయాన్ని తాకేలా తెలియజేస్తారు. చిన్ననాటి ఒక జ్ఞాపకాన్ని తలుచుకుంటూ.. ‘‘కడవ నడుం మీద మోసుకొచ్చేందుకు/ అమ్మ నన్ను వదిలి వెళ్లినప్పుడల్లా/ కళ్లన్నీ నీళ్లయిన వాడిని” అంటారు. ఈ పాదాల్లోని బాల్యవేదన పాఠకుని మనసును కదిలిస్తుంది. రామకృష్ణగారి కవితల్లో కనిపించే మరో ప్రధాన లక్షణం ఆశావాద దృక్పథం. జీవనయానంలో హెచ్చుతగ్గులు సహజం. ఓటమి మనిషిని కృంగదీసినా, అక్కడితో ఆగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన చెబుతారు. ‘వెలుగు వైపు’ కవితలో.. ‘‘చిట్లిన నేలే/ మొదటి మొలకలు హత్తుకుంటుంది” అనే పదచిత్రంతో ఓటమికి కుంగిపోకుండా మళ్లీ మొలకెత్తే ధైర్యాన్ని పెంపొందించు కోవాలని చెబుతారు. సూపర్ ఎల్‌‌నినో పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నగరాల దుస్థితిని వివరిస్తూ.. ‘‘రోడ్డంతా నిప్పులపై నడిచే ఊరేగింపులా ఉంది” అంటారు.


అలాగే.. “ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడ్డ ప్రతి మనిషి/ తన చెమటను మోస్తున్న శిల్పంలా కనిపిస్తున్నారు” అంటూ నూతనమైన వ్యక్తీకరణను అందించారు. అసెంబ్లీలో వాదులాడుకునే అధికారపక్షం, ప్రతిపక్షాలు సైతం ఆటవిడుపు సూత్రంతో ఒకటిగా కట్టివేయబడుతున్న తీరును కూడా తన కవిత్వంలో ప్రతిబింబించారు. ‘ఆ పెంకుటిల్లు’ కవితలో.. “ఆ పెంకుటిల్లు/ మట్టి గోడల మధ్య/ మానవత్వం నిలిపిన గుడారం” అంటూ పటిష్టమైన ఇంటి మమకారపు తడిని తన కవితలోకి దింపుతారు. ‘చివరికి ప్రేమే మిగులుతుంది’ అనే కవితలో, “పిల్లలు రెక్కలు తొడుక్కొని/ తమ తమ ఆకాశం వైపు ఎగిరిపోయాక/ ఇద్దరమే మిగిలి నేర్పిన జీవిత సత్యం ఏమిటంటే../ ప్రేమంటే పొందటం కాదు.. పంచుకోవడం” అంటూ జీవితానికి ఒక అందమైన నిర్వచనాన్ని అందిస్తారు. తన జీవిత సహచరి గురించిన కవితాక్షరాలు మనసు పొరల్లోంచి దూసుకొచ్చిన ప్రేమభాషగా మారి, ప్రతి పంక్తిలోనూ పాఠకుడిని కదిలిస్తాయి. పెరుగు రామకృష్ణ ఈ సంపుటిలో ఎన్నో కొత్త వస్తువులను మన ముందుంచారు. టోల్ ప్లాజా, యూనివర్సిటీ స్నాతకోత్సవం, జెన్-జీ, భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన రోజు వంటి సమకాలీన అంశాలను ఎంచుకొని, వాటికి నూతన అభివ్యక్తిని జోడించి కవితామయం చేశారు.

సమకాలీన జీవనంలోని చిన్నచిన్న దృశ్యాలను కూడా కవిత్వ వస్తువులుగా మలచగల సామర్థ్యం ఆయన కవిత్వానికి ఉన్న బలం. ఈయన కవితల్లో ముగింపు పాదాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. కవితకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం. దాదాపు అన్ని కవితల్లోనూ ముగింపు వాక్యాలు పాఠకుని మనసును తాకేలా ఉంటాయి. “ప్రేమించడం.. క్షమించడం../ సమానంగా జీవించడం../ ఇదే కదా నాగరికతకు శాశ్వత చిరునామా”అంటూ ఒక కవితకు ముగింపు పలుకుతారు. “వెలుగు వైపు తిరిగిన మనసే../ మనిషి వేసే ముందడుగు”అంటారు. ఇంకో కవితలో తన అభీష్టాన్ని తాత్వికంగా... “సమస్త సహవాసాలను వదిలి/ నేను ప్రకృతిలో మమేకమవ్వాలి”అంటూ వ్యక్తం చేస్తారు. ఈ విధంగా ‘పిడికిలి వదిలినప్పుడు’ కవితా సంపుటిని ఒక పరిపూర్ణమైన కవితా సంపుటిగా పేర్కొనవచ్చు. మమతా రాగాల నుంచి , మండించే సామాజిక అంశాల వరకు, వ్యక్తిగత అనుభవాల నుంచి సమకాలీన ప్రపంచ సమస్యల వరకు ఎన్నో విభిన్న వస్తువులను నూతన అభివ్యక్తితో కవిత్వీకరించారు. ఈ సంపుటిలో జీవితం ఉంది.

ప్రేమ ఉంది. అమ్మ ఉంది. కుటుంబం ఉంది. సమాజం ఉంది. సాంకేతిక ప్రపంచపు సంక్షోభం ఉంది. యుద్ధవ్యతిరేక స్వరం ఉంది. ప్రకృతి ఉంది. ముఖ్యంగా, మనిషిపై నమ్మకం ఉంది. సాహిత్యప్రియులందరికీ సంతృప్తిని అందించే ఈ కవితా సంపుటి, నూతనంగా కవిత్వ లోకంలోకి అడుగుపెట్టే వారికి దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉంది. అనుభవం, పరిశీలన, మానవీయ స్పందన, సామాజిక చైతన్యం, ఆశావాదం, తాత్వికత…ఇవన్నింటినీ తనదైన కవితా భాషలో మేళవించిన ‘పిడికిలి వదిలినప్పుడు’ దాచుకోవాల్సిన ఒక విలువైన సాహిత్య సంపుటిగా నిలుస్తుంది. ఇలాంటి సాహిత్య విలువలు కలిగిన పుస్తకాన్ని తెలుగు కవిత్వ లోకానికి అందించిన డాక్టర్ పెరుగు రామకృష్ణగారికి హృదయపూర్వక అభినందనలు, నమస్సులు..! ​


అవ్వారు శ్రీధర్ బాబు 8500130770

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్