Magazines

ఆసియా క్రీడలలో మహిళా ప్రభంజనం

1 గంట క్రితం

Asian Games
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 4 నిమిషాల చదవడం

జపాన్‌లో‌ని నగోయా నగరంలో ఆసియా క్రీడలు ఆనందోత్సాహాలతో ముగిసాయి. ముఖ్యంగా మన దేశం 85 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. మన దేశ యువ జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య చాలా చిన్నదే. అయితే ఈ క్రీడల్లో ఓ గొప్పదనం ఉంది. దేశం గర్వించవలసిన అంశం ఉంది. దాదాపు సగం పతకాలు అంటే 37 వరకు మహిళలు సాధించారు. అందునా మొత్తం 21 స్వర్ణ పతకాల్లో సగం పతకాలు అనగా 11 స్వర్ణ పతకాలు మహిళలే సాధించారు. ఎన్నో అంక్షలు, కట్టుబాట్లు క్రీడారంగంలో మహిళలు దూసుకుపోతున్నారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారు. క్రీడారంగం గురించి లోతుగా పరిశీలిస్తే మహిళలు టీం పరంగా, వ్యక్తిగతంగా వివిధ ఈవెంట్స్‌లో రాణిస్తున్నారు. మన క్రీడా రంగానికి నూతన ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా, కొన్ని రికార్డులను తమ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్చరీ, షూటింగ్, బాక్సింగ్, గోల్ఫ్, క్రికెట్, కబాడి, హాకీ వంటి వివిధ క్రీడల్లో రాణించారు. పతకాలు సాధించారు. ఆ వివరాలు ఈ రోజు మానవిలో తెలుసుకుందాం...


దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏండ్లు గడుస్తున్నా మహిళలు అనేక రకాలుగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా క్రీడారంగంలో అడుగుపెట్టేందుకు మహిళలకు అనేక ఆంక్షలు ఉన్నాయి. పొట్టి బట్టలు వేసుకోవల్సి వస్తుందని, రోజుల తరబడి ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుందని, డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుందని చాలా మంది తమ అమ్మాయిలను క్రీడారంగంలోకి అంతగా ప్రోత్సహించడం లేదు. ఇక వచ్చిన ఆ కొద్ది మందికి కూడా సరైన సౌకర్యాలు ఉండడం లేదు. రక్షణ అంతకంటే లేదు. కానీ ఇలాంటి మరెన్నో అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటూ అమ్మాయిలు దేశానికి పతకాలతో పాటు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతున్నారు. ఆసియా క్రీడల్లో వారు సాధించిన విజయాలు ఇందుకు నిదర్శనం. ఈ క్రీడల్లో మహిళలు సాధించిన విజయాలు వ్యక్తిగతంగా, టీంగా ఇలా ఉన్నాయి.


టీంలుగా సాధించిన విజయాలు

హాకీ జట్టు: చైనాతో ఫైనల్‌తో తలబడిన భారత మహిళల హాకీ జట్టు.. ప్రత్యర్థి జట్టును 1-0తో తేడాతో ఓడింది. దాదాపు 44 ఏండ్ల తర్వాత స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఉమెన్స్ హాకీలో ఇండియాకు వచ్చింది రెండో గోల్డ్‌ మెడల్స్.. ఒకటి 1982లో రాగా.. తాజాగా 44 ఏండ్ల తర్వాత ఇప్పుడు రెండో గోల్డ్‌ మెడల్ వచ్చింది. అంతేకాదు.. ఈ విజయంతో భారత్‌ 2028 లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఒలంపిక్స్‌కు కూడా సెలెక్ట్ అయింది.


మహిళా క్రికెట్ జట్టు: ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, భారత్‌కు ఈ టోర్నీలో తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.


మహిళల కబడ్డీ జట్టు: అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుని తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.


మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు: ఫైనల్లో బలమైన దక్షిణ కొరియా జట్టుపై చారిత్రాత్మక విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది.


కాంపౌండ్ ఆర్చరీ జట్టు: జ్యోతి సురేఖ వెన్నం, చికిత తనిపర్తి, ప్రీతిక ప్రదీప్‌లతో కూడిన ఈ జట్టు ప్రపంచ రికార్డును సమం చేస్తూ బంగారు పతకం సాధించింది.


మహిళల 4x400మీ రిలే జట్టు: కిరణ్ పహాల్, పూవమ్మ ఎంఆర్, ప్రాచి చౌదరి, విథ్యా రామ్‌రాజ్ ల బృందం అద్భుత వేగంతో పసిడి పతకాన్ని గెలుచుకుంది.


వ్యక్తిగత విభాగాలు

కుమ్కుమ్ అనిల్ మొహోద్ (ఆర్చరీ): ఆసియా క్రీడల చరిత్రలోనే వ్యక్తిగత రికర్వ్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా 17 ఏండ్ల కుమ్కుమ్ సరికొత్త రికార్డు సృష్టించింది


నీరూ ధండా (షూటింగ్): మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో కొత్త ఆసియా రికార్డుతో స్వర్ణం సాధించి, ఈ విభాగంలో 48 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ మరో స్వర్ణం సాధించింది


ప్రణవి అర్స్ (గోల్ఫ్): ఆసియా క్రీడల గోల్ఫ్ చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్‌గా ప్రణవి చరిత్ర సృష్టించింది.


లోవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్): మేరీకోమ్ తర్వాత ఆసియా క్రీడల బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన రెండవ భారతీయ మహిళగా నిలిచింది. 75 కేజీల విభాగంలో చైనా బాక్సర్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది.


క్రీడలపై ప్రత్యేక దృష్టి

ఈ విధంగా పలు విభాగాల్లో మహిళలు తమ సత్తా చాటారు. భారత క్రీడా నైపుణ్యాలను ఆసియా క్రీడా వేదికపై ఆవిష్కరించారు. మన క్రీడా రంగానికి నూతన ఉత్తేజాన్ని కలిగించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మహిళల శక్తియుక్తులను గుర్తించాలి. విజయాలు సాధించిన తర్వాత గొప్పగా చెప్పుకోవడం కాకుండా ముందే వారికి కనీసం సౌకర్యాలు కల్పించాలి. భవిష్యత్తులోనూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పురుషులతో పాటు సమానంగా మహిళలు రాణించాలంటే కుటుంబ సభ్యులు తోడ్పాటు, వ్యాయామ ఉపాధ్యాయులు సహకారం ఎంతైనా అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించాలి. ఎంపిక విధానంలో ప్రతిభకు పట్టం కట్టాలి. ఏ రకమైన సిఫార్సులకు ఎంపిక కమిటీ లోనవరాదు.


బడ్జెట్ కేటాయించాలి

ముఖ్యంగా మహిళల పట్ల వివక్ష, చులకన భావం రూపుమాపాలి. క్రీడారంగానికి అవసరమైన నిధులు కేటాయించాలి. అతి త్వరలో మనదేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రస్తుత తరుణంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా రంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‌సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అన్ని పాఠశాలల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు పోస్టులు అవసరమైన మేరకు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన నియామకం చేయాలి. క్రీడా సామాగ్రి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ స్థాయిలో భారత్ క్రీడా ప్రతిభ ముఖ్యంగా మహిళల క్రీడా ప్రతిభ అంతర్జాతీయ వేదికలపై ఆవిష్కరించబడుతుంది. పలు పతకాలు మహిళలు ఒడిసి పడతారు. పతకాల పట్టికలో భారత్ ప్రధమ స్థానంలో నిలుస్తుంది.


ఐ.ప్రసాదరావు, 9390509791

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్