Magazines

బాబాలు దేశద్రోహులన్న సైన్స్ ప్రచారకుడు బసవ ప్రేమానంద్

57 నిమిషాల క్రితం

Basava Premanand
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 5 నిమిషాల చదవడం

కేరళ రాష్ట్రానికి చెందిన భారతదేశపు సంశయ వాది, హేతువాది, వైజ్ఞానిక ప్రచారకుడు, రచయిత - అన్నింటికన్నా ముఖంగా దేశవ్యా ప్తంగా వ్యాపించిన దొంగ బాబాల, స్వామీజీల భరతం పట్టిన ధీశాలి బసవ ప్రేమానంద్!! 17 ఫిబ్రవరి 1930 నుంచి 4 అక్టోబర్ 2009 మధ్య కాలంలో 70 ఏండ్లు కేరళ - తమిళనాడులలో జీవించినవాడు. హేతువాద ఉద్యమానికి ఊతమిచ్చే అనేక సంస్థలకు రూపకల్పన చేసినవాడు. ఆ దిశలో కృషి చేయ డానికి కొన్ని పత్రికలు ప్రారంభించి, నిర్వ హించి సమాజగతిని మార్చినవాడు, పదేండ్ల వయసులోనే 1940లలో పాఠశాల చదువు వదిలేసి, నాటి ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలోకి దూకిన బాల దేశభక్తుడు! ఆ తర్వాత, మరో ఏడేండ్లు అప్పుడప్పుడే ప్రారంభమైన శ్రీ స్టెల్లా గురుకులంలో గడిపాడు. అక్కడ- వార్దా శాంతినికేతన్‌లో ఉన్నటువంటి విద్యావిధానం ఉండేది. నవయువకుడిగా హెలెనా బ్లావట్క్సీ థియోసొఫీ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత, శ్రీలంక సంశయవాది అబ్రహం కోవూర్ కృషికి ఆకర్షితుడ య్యాడు. 1978లో కోవూర్ మరణం తర్వాత, ఆయన కృషిని బసవ ప్రేమానంద్ కొనసాగించాడు. చిత్తశుద్ధితో మానవ శ్రేయస్సు కోసం, నిజాన్ని నిటారుగా నిలబెట్టడం కోసం చేసిన ఆయన కృషి ఈ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రేమానంద్ 1975 నుంచి పుట్టపర్తి సాయిబాబా బండారం ప్రజల ముందు పెట్టడం ప్రారంభించాడు. 1986లో ఐదు వందల మంది కార్యకర్తలతో పుట్టపర్తిలో సాయి నిలయం వైపు ఊరేగింపుగా సాగడం, సాయిబాబా అక్రమాల గూర్చి నినాదా లివ్వడం - వల్ల పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

అనాటి ప్రభుత్వాలన్నీ సాయిబాబాకు మద్దతు ఇవ్వడం ప్రత్యక్షంగా అక్కడ కనిపించింది. ప్రేమానంద్ ఏ మాత్రం తగ్గలేదు. నిజం, న్యాయం తనవైపు ఉన్నాయని నమ్మిన వాడాయన! సాయిబాబా బంగారు వస్తువులు సృష్టించి ‘మేజిక్’ చేస్తుండడాన్ని ప్రేమానంద్ కోర్టులో సవాలు చేశాడు. ఎందుకంటే, అప్పుడు ‘గోల్డ్ కంట్రోల్ ఆక్ట్’- అమలులో ఉంది. ఆ చట్టం ప్రకారం బంగారం సృష్టించడం - మాయం చేయడం నిషిద్ధం! చట్టరీత్యా ప్రేమానంద్ వాదన సరైనదే అయినా- న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై, ఆయన కేసును కోర్టులో నీరుగార్చారు. ‘‘సాయిబాబా నిజంగా బంగారం సృష్టించలేదనీ, సృష్టించిన దాన్ని నిజంగా మాయం చేయలేదనీ - అది సాయిబాబా ధార్మికశక్తి ప్రదర్శన మాత్రమే’’- నని కోర్టు తేల్చి, ప్రేమానంద్ వాదనను కొట్టేసింది. ప్రేమానంద్ వాదన వీగిపోయినా - సాయిబాబా ప్రదర్శన గిమ్మిక్కని పరోక్షంగా కోర్టు ఒప్పుకు న్నట్లు అయింది. అధిక సంఖ్యాకులైన ప్రజలు అందులో అంతరార్థాన్ని గ్రహించారు. ఆ సంఘటనతో ప్రేమానంద్ ధైర్యానికీ, తెగువకూ విలువ పెరిగింది. ఆ తర్వాత 1993లో MURDERS IN SAIBABA'S BED ROOM(సాయిబాబా పడక గదిలో హత్యలు) అనే పుస్తకాన్ని ఆయన ప్రకటించాడు. అందులో సాయిబాబాతో పాటు ఉండే ఆరుగురు యువకుల హత్య గురించి విపులంగా రాశాడు. ధనవంతుడైన సాయిబాబా, రాజకీయ నాయకుల్ని, వ్యవస్థల్ని, అధికారుల్ని తన చుట్టూ తిప్పుకోగలిగాడు కాబట్టి, ఆ విషయం మీద సరైన విచారణే జరగలేదు. అందువల్ల, సత్యసాయిబాబాకు ఉన్న లైంగిక అలవాట్ల గురించి, నేర ప్రవృత్తి గురించి, అతనికి మాఫియాలతో గల దగ్గరి సంబంధాల గూర్చి బసవ ప్రేమానంద్ తన పరిశోధననంతా ఆ పుస్తకంలో విపులంగా వివరించాడు.

హేతు వాదులంతా తప్పక చదవాల్సిన గ్రంథం అది! పుట్టపర్తి సాయి బాబా మోసపు ప్రదర్శనల్ని ప్రజలకు అర్ధం చేయించడానికి ప్రేమానంద్ కూడా కష్టపడి మేజిక్ నేర్చుకున్నాడు. సాయిబాబా చేసే ట్రిక్కులన్నీ బయట సమాజంలో ప్రజలకు విప్పి చెబుతూ, ఆయన కూడా ప్రదర్శించి చూపేవాడు. ఇలా చాలామంది దొంగ బాబాల గుట్టు రట్టు చేస్తూ వచ్చాడు ప్రేమానంద్. ఈయన ప్రతిభ గురించి తెలుసుకుని, బ్రిటీష్ ఫిలిం నిర్మాత రాబర్ట్ ఈగిల్ ఇండియాకు వచ్చి, కేరళలో ప్రేమానంద్‌ను వెతికి, ఆయన ఇచ్చే ప్రదర్శనల్ని, వివరణల్ని డాక్యుమెంటరీగా రూపొందించాడు. పుట్టపర్తి సాయిబాబా అవినీతి సామ్రాజ్యం గురించిన సమాచారం ఆ డాక్యుమెంటరీ ప్రపంచ పారులకు అందించింది. ఏ మనిషికీ అతీంద్రియ శక్తులుండవని, ఇలాంటి దొంగబాబాలు, స్వాములు చిన్నచిన్న టెక్నిక్కుల ద్వారా అమాయకులైన ప్రజల్ని మభ్యపెట్టి, మోసపూరితంగా వారి డబ్బు కాజేస్తుంటారన్న - సందేశం ప్రేమానంద్ ఆ డాక్యుమెంటరీలో ఇచ్చాడు. శరీరపు కండరాల్లోకి శూలాలు గుచ్చుకోవడం, భూమిలో పాతిపెట్టినా మళ్లీలేచి, బతికి బయటికి రావడం - వంటివి ఏవీ అతీంద్రియ శక్తులు కావని ఆయన నిరూపించాడు. 1982లో ప్రేమానంద్ విజ్ఞాన యాత్ర (సైన్స్ ర్యాలీ)ని ప్రారంభించారు. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రజలకు చేరువ చేయడానికి, వారిలో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించడానికి ఆ ర్యాలీ ఉపయోగపడింది. అంతేకాదు, 1987లో “భారత జన విజ్ఞాన జాతా’’ పేరుతో దాన్ని జాతీయ స్థాయికి తీసుకుపోయాడు. మరో రెండేండ్ల తర్వాత, ఈయన ప్రోత్సాహంతోనే మహారాష్ట్రలో ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి’ 1989లో ప్రారంభమై, తన కార్యక్రమాలు విస్తృతపరుచుకుంది. 1997 ఫిబ్రవరి 7న ప్రేమానంద్ మరో జాతీయస్థాయి సంస్థకు రూపకల్పన చేశాడు.

అది ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్’- (FIRA)గా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో సంశయవాదులు, నిరీశ్వర వాదులు, హేతువాదులు, ప్రజాస్వామ్యవాదులు, వైజ్ఞానికులు అందరూ భాగస్వాముల య్యారు. మానవవాదాన్ని, వైజ్ఞానిక స్పృహను, మహిళల హక్కుని, పరమత సహనాన్ని, తమని తాము ప్రకటించుకోగలిగే స్వేచ్ఛను ‘ఫెరా’ సంరక్షిస్తూ వస్తోంది. కుల సంస్కృతిని, బాల్య వివాహాల్ని అంధ విశ్వాసాల్ని తీవ్రంగా నిరసిస్తూ ఉంది. అంతేకాదు, సైన్స్ పేరుతో కొందరు సూడో సైన్స్ ప్రచారం చేయడాన్ని కూడా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనాలిస్ట్ అసోసియేషన్ (FIRA) తీవ్రంగా అడ్డుకుంటూ వస్తోంది. దీనికంతకూ ప్రారంభకుడైన బసవ ప్రేమానంద్ అందించిన స్ఫూర్తే కారణం!! ఇక్కడ CSICOP గురించి కూడా చెప్పుకోవాలి. commitee for Skeptical Inquiry (CSI) claims of the paranormal (cop) ఇందులో ఫిలాసఫర్‌లు, సైకాలజి‌స్ట్‌‌లు, ఎడ్యుకేటర్స్, రచయితలతో పాటు నొబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఉన్నారు. ఈ ప్రపంచస్థాయి సంస్థకు బసవ ప్రేమానందే ఇండియన్ కో ఆర్డినేటర్. ఇండియన్ బ్రాంచ్ తమిళనాడు నుంచి పనిచేసింది. వీటన్నిటితో పాటు, ప్రేమానంద్ తన ఖర్చుతో తనే ప్రారంభించి, నిర్వహించిన పత్రిక INDIAN SKEPTIC. ఇందులో వైజ్ఞానిక పరిశోధనల మీద పరిశీలనల మీద, వైజ్ఞానిక దృక్పథం మీదా వ్యాసాలుండేవి. దేశంలోని దొంగ గురువుల, దొంగ బాబాల అబద్దపు జీవితాల్ని బహిర్గతం చేస్తూ వచ్చిన బసవ ప్రేమానంద్ కృషి మీద LEADING GURU BUSTER శీర్షికన 17 జూన్ 2004 నాడు బి.బి.సి. ఒక కార్యక్రమం ప్రసారం చేసింది. ఇంగ్లీషలోను, మళయాళంలోనూ బసవ ప్రేమానంద్ 14 పుస్తకాలు ప్రకటించాడు. onlineలో ప్రయత్నిస్తే కొన్ని దొరకొచ్చు- ప్రేమానంద్‌ను ఒక గంటకు పైగా steven Hassan అనే అమెరికన్ మానసిక ఆరో‌గ్య నిపుణుడు, రచయిత చేసిన ఇంటర్వ్యూ యూట్యూబ్‌‌లో ఉంది.

వీలున్నవారు తప్పక చూడాలి. పుట్టపర్తి సాయిబాబాపై ఉన్న అభిప్రాయం తప్పక మార్చుకో గలుగుతారు. అతను ఎంతటి దేశద్రోహో అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైనా సరే, తమకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నిరూపించుకుంటే వారికి 100,000 శ్రీలంక రూపాయలిస్తానని అబ్రహం కోవూర్ 1963లో ప్రకటించాడు.. ఆయన జీవించి ఉన్నకాలంలో ఎవరూ ముందుకు రాలేదు. కోవూర్ మరణించిన తర్వాత, ఆ ఛాలెంజ్‌ను బసవ ప్రేమానంద్ కొనసాగించాడు. తను భారత దేశపు రూపాయలు చెల్లిస్తానన్నాడు. కొంతమంది భవిషత్తును సరిగా ఊహించి చెపుతామంటారు. కొందరు నీటిమీద నడుస్తామంటారు. సీల్‌‌చేసి ఉన్న నోట్లకట్టలో వాటి నెంబర్లు చెపుతామంటారు. ‘‘అలాంటి ప్రకటనలు అమాయ కులైన ప్రజల ముందు కాదర్రా- రండి! మా పర్యవేక్షణలో, మా నిఘావర్గాల మధ్య-నిజంగా అతీంద్రియ శక్తులుంటే నిరూపించు కోండి!’’ అని ప్రేమానంద్ కూడా ప్రకటించాడు. ఆయన జీవించి ఉన్నకాలంలో కూడా ఎవరూ ముందుకు రాలేదు. వారికి డబ్బు ముఖ్యం కాకపోవచ్చుకానీ, నిజాన్ని నిర్ణయంగా పరీక్షకు పెట్టడానికి ఎందుకు వెనకడుగు వేసినట్టూ? అంటే - దొంగబాబాలు, స్వాములు, సన్యాసులు, అమ్మలు, మాతలు చెప్పుకుంటున్నదంతా ‘ఉట్టి గాలికబుర్లే’నని తేలిపోయింది. 1963 నుంచి 2009 వరకు అంటే 46 ఏండ్ల కాలంలో ఏ దైవదూతలు, ఏ దేవుడి బిడ్డలూ ముందుకు రాలేదంటే అర్థం ఏమిటీ?

సామాన్య జనం కొంచెం వివేచన పెంచుకుని సీరియస్‌గా ఆలోచించుకోవాలి! మూర్ఖులైన బాబాల, స్వాముల చుట్టూ తిరిగి తమ డబ్బూ, సమయం, ఎనర్జీ వృథా చేసుకోగూడదు. ఎవరి దగ్గరా ఏ అతీంద్రియ శక్తి ఉండదు. మానవుడి శక్తిని మించి, మానవుడి వివేకాన్ని మించి ఈ విశ్వంలో ఏ శక్తి లేదు. కంటికి కనిపించని రోగ కారకాల్ని మనిషి వైజ్ఞానికంగా కనుక్కోగలుగుతున్నాడు. అంతరిక్ష‍ంలో ఇతర గ్రహాలకు వైఙ్ఞానికంగానే వెళ్లగలుగుతున్నాడు. అధిక దిగుబడికి కారణ మయ్యే పరిశోధనలు వైజ్ఞానికంగానే చేయగలుగు తున్నాడు. ఈ రోజు విస్తరిస్తున్న ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’’ అయినా మనిషి రూపొందిస్తున్నదే కాదా? మూఢనమ్మకాల్ని వదిలి, వైజ్ఞానికంగా ముందుకు పోవాల్సిన దశలో మన ప్రభుత్వాలు మనల్ని అనాగరిక యుగంలోకి తీసుకుపోతు న్నాయి. అలాంటి ప్రయత్నాల్ని తీవ్రంగా తప్పికొట్టాలి! అవసరమైతే ప్రభుత్వాలనే మార్చుకోవాలి!! మానవ సంక్షేమం కుంటు పడగూడదు. ఇలాంటి స్థితిలో బసవ ప్రేమానంద్ వంటి మహనీయులు చేస్తూ వచ్చిన విలువైన - వారి జీవిత కాలపు కృషి - వృథాకాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనమంతా సమైక్యంగా కలిసి పనిచేయాలి! ముందుతరం వారు అందించిన స్ఫూర్తితో దేశాన్ని వైజ్ఞానికంగా ఇంకా ముందుకు తీసుకు పోతూనే ఉండాలి! ​వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి పురస్కార తొలిగ్రహీత, జీవశాస్త్రవేత్త.


ప్రొ. దేవరాజు మహారాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్