Magazines

చేగువేరా- వ్యక్తిగత జీవితం

57 నిమిషాల క్రితం

Che Guevara
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 4 నిమిషాల చదవడం

ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో చేగువేరా త్యాగపూరిత జీవితంతో పోల్చదగిన మరో మనిషి లేడు. అలాగే కమ్యూనిస్టుపైనే గాక కమ్యూనిస్టేతరుల్లోనూ ఇంత ప్రభావం కలిగించినవారు కూడా లేరు. త్యాగం, సాహసం, విప్లవ నిబద్ధతకు ఆయనొక ప్రతీక. 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చే 1967 అక్టోబర్ 9న బొలీవియాలో 39 ఏండ్ల వయసులో హత్యకు గురయ్యారు. క్యూబా విప్లవ విజయానంతరం పరిశ్రమల మంత్రి, నేషనల్ బ్యాంకు ఛైర్మన్, సినిమా-కళారంగాల బాధ్యతలు, సాయుధ దళాల శిక్షణా కేంద్రం డైరెక్టర్, పత్రిక సంపాదకుడిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాస్ట్రోతో సమానమైన ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఆ భద్రమైన జీవితాన్ని వదులుకొని లాటిన్ అమెరికా అంతా సామ్రాజ్యవాదుల విషకౌగిలి నుండి విముక్తి కావాలని ముళ్ల కిరీటాన్ని తలకెత్తుకొని కొంతమంది సహచరులతో బొలీవియా అడవుల్లో ప్రవేశించాడు. ఈ మహావీరుని గురించి అనేకసార్లు, వివిధ సందర్భాల్లో చదివేవుంటారు. కానీ, ఆయన కుటుంబ, వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గ్వాటిమాలాలో విప్లవ ప్రభుత్వం ఏర్పడిందని తెలుసుకుని చే కొందరు అర్జెంటీనా మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడ పెరూ కమ్యూనిస్టు కార్యకర్త హిల్దా గాదియా గురించి తెలుసుకున్నారు. ఆమెను కలిస్తే అవసరమైన సహాయం లభిస్తుందని మిత్రులు చెప్పడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు. పెరూలో పుట్టి పెరిగిన హిల్దా తండ్రి స్పానిష్, తల్లి ఇండియన్. లీమాలోని మార్కొస్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ పట్టా పొందింది. పెరూలోని వామపక్ష సంస్థలో సభ్యు రాలిగా పనిచేసింది. ప్రభుత్వ నిర్బంధం పెరగడంతో ఆ సంస్థ నిషేధానికి గురైంది. దీంతో ఆమె గ్వాటిమాలాకు వచ్చి ఉద్యోగం సంపాదించింది. హిల్దా సహాయంతో చే, అతని మిత్రులు గది సంపాదించుకున్నారు. ఆమె కొంత ఆర్థిక సహాయం కూడా చేసింది. ఈ పరిచయం క్రమంగా సాన్నిహిత్యంగా మారింది.

చే ఆమెను పెండ్లి చేసుకోవాలని కోరాడు. కానీ, హిల్దా వెంటనే నిర్ణయం తీసుకోలేదు. చే కు దేశాటనపై ఉన్న ఆసక్తి ఆమెకు సందేహం కలిగించింది. రాజకీయంగా కూడా ఇద్దరి మధ్య తేడాలు ఉన్నాయి. చే సాయుధ పోరాటాన్ని నమ్మితే, హిల్దా మితవాద కమ్యూనిస్టు రాజకీయాల వైపు మొగ్గుచూపింది. అమెరికా మద్దతుతో గ్వాటిమాలా విప్లవ ప్రభుత్వంపై దాడులు ప్రారంభమయ్యాయి. నిర్బంధం తీవ్రమైంది. ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడం కూడా కష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో కూడా చే హిల్దాను కలుస్తూనే ఉన్నాడు. ఇద్దరూ మెక్సికో వెళ్లాలని అనుకున్నారు. చే పెండ్లి విషయం ప్రస్తావించినప్పుడల్లా హిల్దా వాయిదా వేసేది. మంచి మిత్రుడిగా చేపై ఆమెకు అభిమానం ఉన్నా, అతనితో కుటుంబ జీవితం సజావుగా సాగుతుందనే నమ్మకం ఆమెకు కలగలేదు. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి విభేదాలు కూడా వచ్చేవి. ఒకసారి హిల్దాకు జ్వరం వచ్చినప్పుడు చే స్వయంగా ఆమెకు వైద్యం చేశాడు. ఆ సందర్భంలో వారి అనుబంధం మరింత బలపడింది. చివరకు ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. చేకు మెడికల్ కాలేజీలో డిమాన్స్ట్రేటర్‌గా ఉద్యోగం వచ్చింది. హిల్దాకు ఆరోగ్యశాఖలో ఉద్యోగం లభించింది. 1955 ఆగస్టు 18న మెక్సికో నగరానికి సమీపంలోని ఒక చిన్న పట్టణంలో వీరి వివాహం జరిగింది. రావుల్ కాస్ట్రో కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు. వివాహ సమయానికే హిల్దా గర్భిణి. 1956 ఫిబ్రవరి 15న వారికి కుమార్తె జన్మించింది. ఆమెకు హిల్దా బియాత్రిజ్ అని పేరు పెట్టారు. అయితే తర్వాత కాలంలో చే జీవితంలో మరో మలుపు వచ్చింది. అజ్ఞాతంలో పనిచేస్తున్న ఎం-26 ఉద్యమ కార్యకర్త అలైదా మార్చ్ పరిచయమైంది. క్యూబా విప్లవాన్ని విజయవంతం చేసిన గెరిల్లా పోరాటంలో అలైదా కీలకపాత్ర పోషించింది.

ఆమెతో చేకు సాన్నిహిత్యం పెరిగింది. చే ఎంచుకున్న సాయుధ విప్లవ మార్గంలో హిల్దా కలిసి నడవడానికి ఇష్టపడలేదు. హిల్దా పెరూకు వెళ్లిపోయింది. అలైదాతో తన సాన్నిహిత్యం పెరుగుతున్న విషయాన్ని చే స్వయంగా హిల్దాకు తెలియజేశాడు. భావసారూప్యత లేని పరిస్థితిలో కలిసి ఉండటం సమంజసం కాదని ఇద్దరూ అంగీకరించారు. స్నేహపూర్వకంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. తన కుమార్తె హిల్దాతాను చే వద్ద ఉంచడానికి కూడా హిల్దా అభ్యంతరం చెప్పలేదు. అనంతరం హిల్దా కూతురిని తీసుకుని హవానాకు వచ్చింది. చే అప్పటికే అధికారంలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరంగా జీవించేవాడు. కూతురికి బహుమతి ఇవ్వడానికి కూడా అతని దగ్గర చిల్లిగవ్వలేదు. చివరకు చే మిత్రులే హిల్దతాకు ఒక బొమ్మ కొనిచ్చారు. ఇది ఆయన వ్యక్తిగత జీవితం ఎంత నిరాడంబరంగా ఉండేదో చూపిస్తుంది. అలైదా-చే వివాహం 1959 జూన్ 25న జరిగింది. క్యూబా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం కారణంగా చే క్యూబన్ పౌరుడయ్యాడు. 1960 నవంబరులో చే విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అలైదాకు కుమార్తె జన్మించింది. లాటిన్ అమెరికా సంప్రదాయం ప్రకారం ఆమెకు తల్లి పేరైన అలైదానే పెట్టారు. తర్వాత జన్మించిన కుమారుడికి క్యూబా ఉద్యమంలో మరణించిన తన మిత్రుడు కామిలో పేరు పెట్టాడు. 1963 జూన్ 14న మరో కుమార్తె జన్మించగా చే తన తల్లి సెలియా పేరును ఆమెకు పెట్టాడు. 1965 ఫిబ్రవరి 24న మరో కుమారుడు జన్మించగా అతనికి ఎర్నస్తో అని పేరు పెట్టారు.

భార్యా పిల్లలపై ప్రేమ ఉన్నప్పటికీ చే కు వ్యక్తిగత ఆస్తులు, భద్రమైన జీవితం, అధికార హోదాలపై మమకారం లేదు. తన కుటుంబానికి ఆస్తిపాస్తులు కూడబెట్టాలని ఆయన ప్రయత్నించలేదు. మంత్రి పదవితో సహా తనకున్న అధికార పదవులన్నింటినీ వదిలిపెట్టాడు. భార్యా పిల్లలను క్యూబాలోనే వదిలి వెళ్లేటప్పుడు వారి చదువు, జీవనోపాధికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఆయనకు తెలుసు. అందువల్ల వారికి ఆస్తులు ఇవ్వలేకపోతున్నాననే బాధ కూడా తనకు లేదని స్పష్టంగా రాశాడు. లాటిన్ అమెరికా దేశాలు సామ్రాజ్యవాద ప్రభావం నుంచి విముక్తి పొందాలనే లక్ష్యంతో చే మళ్లీ పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. కొంతమంది సహచరులతో కలిసి బొలీవియా అడవుల్లోకి వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయి. ఆహారం, నీళ్లు సరిగా దొరకలేదు. ఆస్తమాతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ గెరిల్లా దళానికి నాయకత్వం వహిస్తూ పోరాటాన్ని కొనసాగించాడు. చివరకు బొలీవియా సైనికులు, సీఐఏ ఏజెంట్ల చేతికి చే చిక్కాడు. 1967 అక్టోబర్ 9న 39 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లలతో కూడిన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉన్నప్పటికీ, తన నమ్మిన విప్లవ లక్ష్యం కోసం అన్నింటినీ వదిలేశాడు. కుటుంబంపై ప్రేమ ఉన్నా, ప్రజల విముక్తి కోసం తన జీవితాన్నే అర్పించాడు. అందుకే చేగువేరా వ్యక్తిగత జీవితం కూడా ఆయన విప్లవ వ్యక్తిత్వంలోని త్యాగం, నిరాడంబరత, నిబద్ధతకు అద్దం పడుతుంది. ఈరోజు చే వర్థంతి సందర్భంగా కుటుంబాన్ని, అధికారాన్ని, ఆస్తిని వదిలి తన నమ్మిన మార్గంలో చివరివరకు నడిచిన ఆ వీరయోధుడిని స్మరించుకుందాం. (09 అక్టోబర్‌, చేగువేరా వర్థంతి)


చెరుకూరి సత్యనారాయణ, 9848664587

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్