Magazines

మతోన్మాదాన్ని ఓడించి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించి...

1 గంట క్రితం

victory of democracy
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 3 నిమిషాల చదవడం

దేశంలో ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో 2026-27 గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలోని వామపక్ష, సామాజిక శక్తుల కూటమి విజయం సాధించింది. ఎస్ఎఫ్‌ఐ-ఎఎస్ఏ-ఐసా-డీఎస్‌యూ-టీఎస్‌ఎఫ్‌లు కలిసి ఏర్పాటు చేసిన కూటమి మతోన్మాద ఏబీవీపీని ఓడించింది. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హెచ్‌సీయూలో సాధించిన ఈ విజయం ప్రగతిశీల శక్తులకు ఉత్సాహాన్నిచ్చింది. కూటమి తరఫున ఎస్ఎఫ్‌ఐ నుంచి మైనారిటీ విద్యార్థిని దిల్షాదా రైహానా అధ్యక్ష పదవికి పోటీ చేసి 451 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా కూటమి ప్రాతినిధ్యం కల్పించింది. అన్ని వర్గాల విద్యార్థుల మద్దతుతో కూటమి మద్దతు కూడగట్టింది. 2025-26 విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించిన అనంతరం క్యాంపస్‌లో ప్రజాస్వామ్య వాతా వరణం దెబ్బతింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు. విద్యార్థులకు చెందిన రూ.32 లక్షల నిధులకు ఆర్థిక నివేదిక ఇవ్వలేదు. యూజీబీఎం నిర్వహించకుండా నిధులను పక్కదారి పట్టించింది. విద్యార్థులపై 28 సార్లు దాడులు చేసింది. మెస్, కిచెన్‌ల అభివృద్ధి, నాణ్యమైన ఆహారం, హాస్టల్ సదుపాయాలపై ప్రశ్నించిన విద్యార్థులపై కూడా దాడులకు దిగింది.

విద్యార్థులకు సంబంధం లేని అంశాల్లో యూనివర్సిటీ అధికారాలను తమ చేతు ల్లోకి తీసుకుని ల్యాప్‌టాప్‌లు పోయాయనే పేరుతో హాస్టల్ గదుల్లో సోదాలు నిర్వహించింది. ముస్లిం విద్యార్థులను జై శ్రీరామ్ నినాదాలు చేయాలని బెదిరించడం, హిందూ విద్యార్థులు ముస్లిం విద్యార్థులతో స్నేహం చేయవద్దని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో ఆరెస్సెస్ శాఖను నిర్వహిస్తూ విద్యార్థులను అందులో పాల్గొనాలని ఒత్తిడి చేసింది. విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ, సెక్యూరిటీ సిబ్బంది, షాపులు నిర్వహిస్తున్న వారిపైనా ఒత్తిళ్లు కొనసాగాయి. విద్యార్థుల అకడమిక్స్‌పైనా ప్రభావం పడింది. పరీక్షలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు తమ చదువులో భాగంగా ప్రదర్శించిన స్క్రిప్ట్‌ను మతాన్ని అవమానిస్తున్నారనే పేరుతో అడ్డుకున్నారు. దీంతో అకడమిక్స్‌తో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లో ముందున్న హెచ్‌సీయూ ప్రతిష్ట దెబ్బతింది. మరోవైపు ఎస్ఎఫ్‌ఐ యూనివర్సిటీ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు నిర్వహించింది. హాస్టల్ సదుపాయాలు, ఫీజుల పెంపు, పెండింగ్ ఫెలోషిప్స్, సెంట్రల్ యూనివర్సిటీలకు నిధులు, యూనివర్సిటీల స్వతంత్రత, 24 గంటల లైబ్రరీ, ఖాళీ పోస్టుల భర్తీ, నాణ్యమైన భోజనం, వైఫై, హాస్టల్ మరమ్మతులు, రవాణా, విద్యార్థినుల భద్రత వంటి సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహించింది.

స్థానిక సమస్యలతో పాటు వర్కర్ల సమస్యలపై కూడా పోరాటాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని కేంద్రీకరించడం, విద్యా వాణిజ్యీకరణ, నీట్ పేపర్ లీక్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం జరిగిన జెన్-జీ ఉద్యమం, ఎన్నికల సంస్కరణల పేరుతో ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపు వంటి అంశాలను కూడా కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చర్చించింది. ఏబీవీపీ అధికారంలోకి వస్తే యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినా పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. క్యూఎస్ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూ ర్యాంకు 800-850 నుంచి 850-900కు పడిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నేతలు జెన్-జీ తమతోనే ఉందని ప్రచారం చేసిన నేపథ్యంలో హెచ్‌సియు ఎన్నికల ఫలితం భిన్నమైన సందేశాన్ని ఇచ్చింది. విద్యార్థులు మతోన్మాద, కార్పొరేట్ రాజకీయాలను తిరస్కరించి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సామాజిక న్యాయం వైపు నిలిచారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరిగినా విద్యార్థులు వాటిని తిరస్కరించారు. హెచ్‌సీయూలో ఏబీవీపీ ఓటమి తర్వాత కూడా ఎస్ఎఫ్‌ఐ, ఎఎస్ఏ నాయకులపై దాడులు, విద్యార్థినులపై వేధింపులు చోటుచేసు కున్నాయి. అయిన ప్పటికీ విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న వామపక్ష, సామాజిక శక్తుల కూటమికి విద్యార్థులు అవకాశం ఇచ్చి గెలిపించారు. హెచ్‌సీయూ లో మరోసారి మతోన్మాద, విచ్ఛిన్నకర రాజకీయాలకు స్థానం లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలకు కొత్త ఉత్సాహం లభించింది.


టి.నాగరాజు, 9490098292


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్