ఆయన స్ఫూర్తితో ప్రతి వైద్య సిబ్బంది పని చేయాలి
పలువురు మండల వైద్యాధికారులు
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల ప్రాథమిక కేంద్రం హెల్త్ సూపర్వైజర్ మంద దానయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖకే ఆదర్శవంతుడని, స్ఫూర్తి ప్రదాత అని మండల ప్రాథమిక పూర్వ వైద్యాధికారులు తాటికొండ శ్రీకాంత్, బాలకృష్ణ, మండల ప్రాథమిక వైద్యాధికారి వేముల స్రవంతి, చింతకాని, బోదులబండ మండల వైద్యాధికారులు అల్తాఫ్, దేవేందర్, ప్రముఖ వైద్యురాలు కీర్తన, జిల్లాలోనే పలువురు హెల్త్ సూపర్వైజర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న మంద దానయ్య కు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వీడ్కోలు సన్మాన సభను గురువారం ఘనంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి వేముల స్రవంతి అధ్యక్షతన జరిగిన సన్మాన వీడ్కోలు సభలో పలువురు వక్తలు మాట్లాడారు.
పూర్వ బోనకల్ మండల వైద్యాధికారులు శ్రీకాంత్, బాలకృష్ణ, చింతకాని మండల వైద్యాధికారి అల్తాఫ్, చింతకాని, బోనకల్ మండల వైద్యాధికారులు అల్తాఫ్, వేముల స్రవంతి, పలువురు మాట్లాడుతూ మంద దానయ్య వైద్య శాఖకు చేస్తున్న సేవలకు విలువ కట్టలేమన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారంలో మందా దానయ్య పాత్ర తప్పనిసరిగా ఉంటుందన్నారు. బోనకల్ మండలంలో 9 సబ్ సెంటర్లు ఉన్నాయని, ఈ తొమ్మిది సబ్ సెంటర్లలో పని చేస్తున్న ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగు సూచనలు చేస్తూ ముందుకు నడపడంలో మండల వైద్యాధికారితో పాటు మంద దానయ్య పాత్ర కూడా మరువలేనిది అన్నారు.
తాము పనిచేసిన సమయంలో మంద దానయ్య అందించిన సహకారం, వైద్య సేవలు తాము జీవితంలో మర్చిపోలేని శ్రీకాంత్, బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం కూడా దానయ్య అందిస్తున్న సేవలు సహకారం తనకు కుడి భుజం లాగా అందిస్తూ ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని వేముల స్రవంతి అన్నారు. దానయ్యలేని లోటు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయని, ఆ ఆ లోటును తాను ఎలా పూడ్చుకోవాలో అర్థం కావడం లేదని వేముల స్రవంతి అన్నారు. జిల్లా కేంద్రం నుంచి ఎవరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన అన్ని తానై నడిపించే వారని, కానీ దానయ్య ప్రమోషన్ రావటం బదిలీ కావటంతో ఆ లోటు ఎవరు పూడ్చలేరన్నారు. ఎంతటి సమస్య వచ్చినా ఆ సమస్యను ఎంతో సమయస్ఫూర్తితో పరిష్కారం చేసేవారన్నారు. తన విధులే కాక తన పక్కన ఉన్న సిబ్బంది విధులు కూడా నిర్వహిస్తూ వారికి తోడుగా ఉంటూ తగు సూచనలు అందిస్తూ వైద్య సేవలను ముందు బాగాన నడిపించారన్నారు.
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఏ రిపోర్టు కావాలన్నా తన పరిధిలో లేకపోయినా వైద్యాధికారి ని సమన్వయం చేసుకుంటూ పూర్తిస్థాయి నివేదిక వెనువెంటనే తయారుచేసి అందించేవారు అన్నారు. తన క్లస్టర్ పరిధిలో లేకపోయినా మండల వ్యాప్తంగా అన్ని రకాల సిబ్బందికి తోడుగా ఉంటూ వైద్య సేవలు అందించడంలో ముందు పీఠాన ఉన్నారని అభినందించారు. మంద దానయ్యకు ప్రమోషన్ వస్తుందో రాదో, హెల్త్ సూపర్వైజర్ గా ఉద్యోగ విరమణ చేస్తారేమోనని తమ ఎంతో ఆందోళన చెందామని కానీ దానయ్యకు ఉద్యోగోన్నతి రావటం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దానయ్య ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు సేవలు అందిస్తూ ప్రతి సిబ్బంది మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు.
అనంతరం మంద దానయ్య, పద్మలత దంపతులను శ్రీకాంత్, బాలకృష్ణ, స్రవంతి, కీర్తన, గీత, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, సహచరులు, బంధువులు తదితరులు శాలువాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య ఆస్పటల్ ప్రమోక కార్డియాలజిస్ట్ వైద్యురాలు గీత, జిల్లాలో వివిధ మండలాలలో వైద్యాధికారులు కీర్తన, రాధాకృష్ణ, ధర్మేంద్ర, స్వప్న, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, మందా దానయ్య సహచరులు, సన్నిహితులు, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.



