సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ సమావేశం నిర్ణయం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
మార్చి 8న దేశవ్యాప్తంగా పోరాట, ఐక్యత, ప్రజా ప్రతిఘటన దినంగా మార్చాలని సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పిలుపునిచ్చారు. గురువారం నాడిక్కడ సీఐటీయూ కేంద్ర కార్యాలయంలో ప్రజా సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా భారీస్థాయిలో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఫిబ్రవరి 12న నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె ప్రజా ఉద్యమాల శక్తిని చాటిచెప్పిందని, కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని పేర్కొంది. అదే ఉత్సాహంతో, అదే ఐక్యతతో మహిళల హక్కులు-జీవనోపాధి-సమానత్వం-ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై దేశవ్యాప్తంగా ర్యాలీలు, సభలు, చర్చా గోష్టులు వంటి కార్యక్రమాలు భారీస్థాయిలో నిర్వహించాలని తీర్మానించింది.
రాష్ట్రాలు, జిల్లాలు, మండల స్థాయిల్లో ప్రజలను విస్తృతంగా సమీకరించాలని, మహిళాలతో పాటు పురుషులు పెద్దసంఖ్యలో పాల్గొని సమానత్వ పోరాటాలు ఐక్యంగా ముందుకు సాగించాలని పిలుపునిచ్చింది. ‘దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలి, సమానత్వం కోసం పోరాడాలి, లింగ వివక్షను అంతం చేయాలి, జీవనోపాధిపై దాడులను ప్రతిఘటించాలి, ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటం చేయాలంటూ’ నినాదాలనిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై పెరుగుతున్న హింస, అసమాన వేతనాలు, ఉపాధిలో వివక్ష, సామాజిక-రాజకీయ నిర్ణయాల్లో మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని అభిప్రాయపడింది.
ముఖ్యంగా మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్-కమ్యూనల్ విధానాలు మహిళల జీవనోపాధి దెబ్బతీయడంతో పాటు, వారి భద్రతనూ ప్రమాదంలోకి నెడుతున్నాయని విమర్శించింది. దేశంలో మహిళల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, బీజేపీ ప్రభుత్వ విధానాలు మహిళ, ప్రజా వ్యతిరేక దిశలో సాగుతున్నాయని సమావేశం ధ్వజమెత్తింది. ఈ విధానాలను పోరాటాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఐద్వా ప్రధాన కార్యదర్శి కనినికా ఘోష్, సీఐటీయూ కార్యదర్శి ఏఆర్ సింధూ, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఏఐకేఎస్ కోశాధికారి పి.కృష్ణప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కార్యవర్గ సభ్యురాలు ఐషీ ఘోష్, ఐద్వా ఉపాధ్యక్షులు సుభాషిణీ అలీ, మరియం ధావలే, ఎస్.పుణ్యవతి, సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మార్చి 8న ప్రజాప్రతిఘటన దినం
- Advertisement -
- Advertisement -



