ప్రజానాట్యమండలి కళాకారుడి హత్య
నెల్లూరులో దారుణం
సీపీఐ(ఎం) తీవ్ర ఖండన
నెల్లూరు : నెల్లూరులో గంజాయి ముఠా బరితెగించింది. గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కళా రూపాలతో ప్రజలను చైతన్య పరుస్తున్న యువకళాకారుడిపై విరుచుకుపడింది. తన పిల్లలతో కలిసి వస్తున్న ఆయనపై నడిరోడ్డు మీద అమానుష దాడికి దిగింది. కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేసింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. పథకం ప్రకారం గంజాయి ముఠా చేసిన ఈ దాడిలో ప్రజానాట్య మండలి కళాకారుడు, డీవైఎఫ్‌ఐ మాజీ నేత సీపీఐ(ఎం) కార్యకర్త కె. పెంచలయ్య (37) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ అమానుష దాడిని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు, ప్రజానాట్యమండలి, డీవైఎఫ్‌ఐలు తీవ్రంగా ఖండించాయి.
హత్యకు కారకులను గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయా లని డిమాండ్ చేశాయి. ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న పెంచలయ్య నెల్లూరు రూరల్‌లో ప్రజానాట్య మండలి కార్యదర్శిగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లోనే నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన ప్రజ లను చైతన్య పరచడానికి అనేక కళారూపాలను రూపొందించి, ప్రదర్శించాడు. పోలీస్ శాఖ సహకారంతో కూడా కొన్ని కార్యక్ర మాలు చేశాడు. గంజాయి మానండంటూ స్థానికంగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇది స్థానిక గంజాయి ముఠాకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో కొంత కాలంగా ఆయన కదలి కలపై నిఘా వేసిన ఆ ముఠా పకడ్బందీగా పథకం రూపొం దించి ఆయనను హతమార్చిందన్న అనుమానాలున్నాయి.
కత్తులతో వెంబడించి..
విజయవాడలో ఈ నెల 30న జరిగే ఒక కార్యక్రమంలో పెంచలయ్య బృందం ‘యోగి వేమన’ కళారూపాన్ని ప్రదర్శిం చాల్సిఉంది. సోమవారం ఉదయం నుంచి ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ట్యూషన్‌కు వెళ్లిన పిల్లలను తీసుకురావడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ నారాయణ కళాశాల సమీపానికి వెళ్లి వస్తున్న క్రమంలో ముసుగులతో ఉన్న ముగ్గురు నలుగురు వ్యక్తులు ఆయన వాహనానికి అడ్డుగా వెళ్లి, దాడి చేశారని చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమై పిల్లలతో కలిసి రోడ్డు మీద కొంత దూరం పరిగెత్తే ప్రయత్నం చేశారు.
అయితే, నలువైపుల నుంచి చుట్టుముట్టిన ముసుగు వ్యక్తులు ఆయన ముఖం, శరీరంపై విచక్షణా రహితంగా పొడిచి, పారి పోయారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులను కూడా బెదిరించారు. ఈ దాడిలో పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన వెంట ఉన్న పిల్లలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కుటుంబానికి, పార్టీ నేతలకు స్థానికులు సమాచారమిచ్చారు. రూరల్ డీఎస్‌పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకొని పెంచలయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
కఠినంగా శిక్షించండి : సీపీఐ(ఎం) ఏపీ శాఖ డిమాండ్
పెంచలయ్య హత్యను సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. గూండాల దాడిలో హత్యకు గురైన పెంచలయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు. హత్య చేసిన గూండాలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రజానాట్యమండలి దిగ్భ్రాంతి
పెంచలయ్య హత్య పట్ల ప్రజానాట్యమండలి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి. మంగరాజు, ఎస్. అనిల్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. పెంచలయ్య అనేక కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరిచేవాడని, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగిన సింహపురి సాంస్కృతిక ఉత్సవాల్లో వేమన కళారూపాన్ని ఇతర కళాకారులతో ఆయన ప్రదర్శించారని తెలిపారు. 30వ తేదీన గాదె సుబ్బారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఎంబీవీకేలో నిర్వహించే కార్యక్రమంలో కూడా ఆ కళారూపాన్ని ప్రదర్శించాల్సి ఉందని, కొద్ది రోజులుగా ఆ పనిలోనే ఉన్నారని తెలిపారు.
ఖండించిన ఏపీ డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్
పెంచలయ్య హత్యను డీవైఎఫ్‌ఐ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న ఖండించారు. డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో ఈ హత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. డ్రగ్స్ అంతం డీవైఎఫ్‌ఐ పంతం అనే నినాదంతో పెద్దయెత్తున పోరాటం కొనసాగుతుందన్నారు. దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెంచలయ్య హత్యను ఏపీ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) కూడా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
గంజాయి ముఠా బరితెగింపు
- Advertisement -
- Advertisement -



