రవితేజ నటించిన చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రచయిత భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈనెల 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్య మాట్లాడుతూ, ‘రవితేజతో నాది 20 ఏళ్ళ అనుబంధం. ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది రవితేజ. నవ్వించడం అనేది చాలా కష్టం. కానీ, రవితేజ మాత్రం తనదైన శైలిలో చాలా తేలికగా ఎన్నో ఏళ్ళుగా వినోదాన్ని పంచుతున్నారు. రవితేజలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ కూడా అలాగే అలరిస్తారు. ఈనెల 31న ‘మాస్ జాతర’ రూపంలో రవితేజ జాతర చూస్తారు’ అని తెలిపారు.
‘శివుడు పాత్ర చేసిన నవీన్ చంద్ర ఇలా కూడా చేయగలడా అని ఆశ్చర్యపోయేలా చేశాడు. నటుడిగా ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా విడుదలయ్యాక శివుడు పాత్ర గురించి మాట్లాడుకుంటారు. నాది, శ్రీలీలది సూపర్ హిట్ జోడి. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూడబోతున్నారు. ఫుల్ మాస్ పాత్ర చేసింది. ఈ చిత్రం ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. భాను రూపంలో మన పరిశ్రమకి మరో మంచి దర్శకుడు వస్తున్నాడు’ అని రవితేజ చెప్పారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ, ‘చాలారోజుల తర్వాత ‘మాస్ జాతర’ రూపంలో శక్తివంతమైన పాత్ర లభించింది’ అని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ”వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్‌కి వస్తారో.. అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. రెండు నిమిషాల ట్రైలర్ ఏ స్థాయిలో ఉందో.. రెండు గంటల సినిమాల కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది’ అని అన్నారు.
ఘనంగా ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక
- Advertisement -
- Advertisement -



