మనీ..మేనేజ్‌మెంట్.. మజిల్ పవర్ ప్రభావం
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ థామస్ ఐజాక్
తిరువనంతపురం : ఈ ఏడాది జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ రంగంలో గతంలో ఎన్నడూలేనంత డబ్బు ప్రవాహాన్ని చూస్తాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ థామస్ ఐజాక్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఫేస్‌బుక్ పోస్టులో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికల వ్యూహకర్తల ఆధిపత్యం
భారీ పారితోషకాలు తీసుకునే ‘కనుగోలు’ (కింగ్‌మేకర్) తరహా ఎన్నికల వ్యూహకర్తలు కీలక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారని ఐజాక్ పేర్కొన్నారు. ప్రధాన మీడియా సంస్థలు ఎక్కువగా కొనుగోలు చేయబడుతున్నాయనీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను అధిక ఖర్చుతో ఒప్పందాలపై తీసుకుంటున్నారని వివరించారు. సోషల్ మీడియా పేజీలు, గ్రూపులు స్వాధీనం చేసుకోవడం, భారీ హౌర్డింగ్‌లు బుక్ చేయడం, ఓటర్లకు నగదు పంపిణీ వంటి అంశాలు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయని ఐజాక్ పేర్కొన్నారు.
‘మూడు ఎం’ ల ప్రభావం
భారత్‌లో ఎన్నికలను ప్రధానంగా మనీ (డబ్బు), మేనేజ్‌మెంట్ (వ్యవస్థాపన, నిర్వహణ), మజిల్ పవర్ (బల ప్రదర్శన) అనే మూడు ‘ఎం’లు ప్రభావితం చేస్తున్నాయని ఐజాక్ విశ్లేషించారు. అయితే కేరళలోని ఎల్‌డీఎఫ్‌ను మజిల్ పవర్‌తో ఓడించడం సాధ్యం కాదన్న విషయం ఆరెస్సెస్‌కూ తెలుసునని ఆయన పేర్కొన్నారు. కానీ ఆర్థిక వనరుల విషయంలో లెఫ్ట్ ఫ్రంట్ తన ప్రత్యర్థులతో పోలిస్తే బలహీనంగా ఉందనీ, ఇదే ప్రధాన సవాలుగా మారిందని వివరించారు. ఈ పరిస్థితికి పరిష్కారంగా ఐజాక్ న్యూయార్క్ మేయర్ ఎన్నికను ప్రస్తావించారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై ప్రధాన మీడియా అంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. పరిమిత ఆర్థిక వనరులతోనే ఆయన విజయం సాధించారని పేర్కొన్నారు. సోషల్ మీడియా వినియోగం, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవడం అనే రెండు వ్యూహాల ద్వారానే మమ్దానీ విజయం సాధించారని వివరించారు. వేలాది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసిన విధానం అమెరికాలో అరుదైనదని ఐజాక్ పేర్కొన్నారు.
లెఫ్ట్ ఫ్రంట్‌కు అది కొత్త కాదు
ప్రధాన మీడియా వ్యతిరేకతను పక్కనబెట్టి, ఇంటింటి, కుటుంబస్థాయి సంభాషణల ద్వారా ప్రజలను చేరుకోవడం వామపక్ష కూటమికి కొత్త కాదని ఆయన గుర్తు చేశారు. ఈ సంప్రదాయాన్ని పునరుజ్జీవం చేయడం 2026 ఎన్నికల్లో అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. భారీ ఖర్చుతో కూడిన ప్రకటనల ప్రచారానికి బదులుగా.. వాలంటీర్ల ఆధారిత సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల విస్తరణ ఇప్పుడు తప్పనిసరి అని ఐజాక్ స్పష్టం చేశారు. 22 నుంచి కుటుంబస్థాయి సమావేశాల్లో విధానపరమైన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని వివరించారు. ఇంటింటి సందర్శనలే ప్రధాన ఎన్నికల ప్రచార వ్యూహంగా కొనసాగనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 15న ప్రారంభమైందని వివరించిన ఆయన… ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తి, గౌరవాన్ని వ్యక్తం చేశారని ఐజాక్ వివరించారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా డబ్బు ప్రవాహం
- Advertisement -
- Advertisement -



