ఐదు రాష్ట్రాలు, యూటీల్లో కోటి మందికి పైగా పేర్లు తొలగింపు
రాజస్తాన్‌లో అత్యధికంగా 42 లక్షల మంది
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం దేశంలోని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల(యూటీలు)లో జరిపిన వివాదాస్పద ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఓటర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. సర్ అనంతరం విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.6 శాతం తగ్గింది. ఈ ప్రక్రియలో 1.02 కోట్ల మంది పేర్లు తొలగించబడినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, గోవా, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలు, యూటీలలో సర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదలయ్యాయి. ఇందులో అక్టోబర్ 27 నాటికి ఉన్న 13.35 కోట్ల మంది ఓటర్ల సంఖ్యతో పోలిస్తే.. తాజా జాబితాల్లో 12.33 కోట్లకు పడిపోవటం గమనార్హం. ఇక తొలగించిన ఓటర్లను అధికారులు ప్రధానంగా వివిధ క్యాటగిరీలుగా విభజించారు. ఇందులో మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు లేదా చిరునామా లభించనివారు, డూప్లికేట్ ఓటర్లు, ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సమర్పించనివారు ఉన్నారు. ఈ తగ్గుదల బీహార్‌లో ఆగస్టులో జరిగిన సర్‌లో నమోదైన ఎనిమిది శాతం తగ్గుదలతో సమానంగా ఉండటం గమనార్హం.
రాజస్తాన్‌లో పరిస్థితి
బీజేపీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లోనే అత్యధికంగా 42 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణాలు (8.75 లక్షలు-1.6 శాతం), శాశ్వత వలసలు లేదా గైర్హాజరు (29.6 లక్షలు – 5.43 శాతం), డూప్లికేట్ ఓటర్లు (3.44 లక్షలు-0.63 శాతం) వంటివి ఉన్నాయి. ఇక జైపూర్‌లో 5.30 లక్షలకు పైగా, అజ్మీర్, కోటా, అల్వార్, సికార్, పాలీ జిల్లాల్లో లక్షకు పైగా చొప్పున పేర్లు తొలగించబడ్డాయి. గోవాలో లక్ష మందికి పైగా పేర్లు తొలగించబడ్డాయి. ఇక పుదుచ్చేరిలో 1.03 లక్షల పేర్లు డిలీట్ అయ్యాయి. అయితే ఇది తుది ఓటర్ల జాబితా కాదని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఈనెల 17 నుంచి వచ్చే నెల 15 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలకు గడువు ఉన్నదని అంటున్నారు. అర్హులైన ఓటర్లు తమ పేర్లను మళ్లీ నమోదు చేసుకునే అవకాశమున్నదని చెప్తున్నారు. ఇక తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. సర్ ప్రక్రియ ఇప్పటికే తీవ్ర వివాదంగా మారిన విషయం విదితమే. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లోని అధికార పార్టీలు సర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఓటర్ల జాబితాలో భారీ కుదింపు
- Advertisement -
- Advertisement -



