”నరకంలో ఉన్నంత జనాభా ఉందీ భారతదేశంలో. నేనీ ముక్క మాత్రం కచ్చితంగా చెప్పగలను. భారతీయులతోనూ, చైనా వాళ్ళతోనూ మనం తగాదా పడాల్సిందేనని నొక్కి చెప్తున్నావు. కానీ, అదే జరిగితే మూడొంతుల ప్రపంచంతో మనం విరోధం తెచ్చుకోవడమే అవుతుంది తెలుసా? అన్నాడు వాషింగ్టన్ పోస్టు పత్రికా సంపాదకుడు” అంటూ ప్రారంభమౌతుంది కుట్ర నవల. ఉత్కంఠ భరితంగా సాగే ఈ నవలేదో డిటెక్టివ్ నవల కాదు. 1974లో ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షునిగా పనిచేసిన విలియం క్లార్క్ అనుభవాల సారం నుండి పుట్టింది.
ఆ తర్వాత పి.వి., మన్మోహన్‌సింగ్ పాలనలో ఐఎమ్‌ఎఫ్ అప్పు పుట్టింది. దాని వెంట ‘ప్రాజెక్టు లోన్లు’ ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు వచ్చింది. చంద్రబాబంటే ప్రపంచబ్యాంకే నన్నంతగా ప్రచారం సాగింది 90వ దశకం ద్వితీయార్థంలో. రెండు పార్టీలు మారినా ఆ విధానాల్లో మార్పు లేదు. ఆ తర్వాత రాష్ట్రం రెండు ముక్కలైనా ఆ విధానాల్లో మార్పులేదు. బీఆర్‌ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెసొచ్చినా అవే విధానాలు.
”మొదట విసిరిన పంచరంగుల అప్పుల వలల” ఫలితమిది.
ఆపై నిరాఘాటంగా సహజ వనరుల దోడిపీ” సాగుతూనే ఉంది. ఎప్పుడైనా మాట వినని పాలకులొస్తే, లేదా వినరేమోనని అగ్రరాజ్యం భావిస్తే సీఐఏ తోడేళ్లను ఉసి గొల్పడానికి సిద్ధం చేసుకుని ఉంటారు. అందుకే ‘కుట్ర’ నవలని ‘ఒక దళారీ పశ్చాత్తాపం’తో కలిపి చదివితే నేడు మన దేశమూ, మనమూ ఎదుర్కొంటున్న సమస్యల మూలాలు అర్థమౌతాయి. ఒకటి నవల. మారు పేర్లతో ఒరిజినల్ క్యారెక్టర్లుంటాయి. రెండవది ‘యదార్థ గాథల సమాహారం’. ఇది డాక్యుమెంటేషన్. రెండూ నిజజీవిత గాథలే. పాలక పార్టీల బండారం తేటతెల్లమవుతుంది.
విడిగా లేబర్ కోడ్‌ల గురించో, రైతు చట్టాల గురించో ఆలోచించినా, పది ఏండ్లుగా బీఆర్‌ఎస్ కనీస వేతనాలు సవరించలేదనో, ఇప్పుడు కాంగ్రెస్సూ స్పందించట్లేదనో ఆందోళన చెందినా ఉపయోగం లేదు. దేనికిదానికే సమాధానాలు వెతికితే దొరకవు. ముత్యాల ముగ్గు భాషలో చెప్పాలంటే ఒక ”వోలు మొత్తం”లో భాగంగా లేబర్ కోడ్‌లు, రైతుల నల్ల చట్టాలను చూడాలి. ప్రతిపక్షాన్ని బయటికి నెట్టేసి వీటిని లోక్‌సభలో పాస్ చేసుకున్న తీరూ! శిరసు వంచి ‘విశ్వగురు’ రైతులకు సారీ చెప్పిన తీరు, మళ్లీ రైతు చట్టాల్ని అమల్లోకి తెస్తున్న తీరూ అన్నీ ఒక దండలోని దారానికి సంబంధించినవే. ఇదీ నేపథ్యం!
××
నేటి మేడేకి దారి తీసిన సంఘటన 139 ఏండ్ల నాటిదే కావచ్చు. పెట్టుబడికి ఆకలి తీరదు. అందుకే అది అది వర్తమానమే! ఆనాటి పెట్టుబడిదారుల దోపిడీ తగ్గలేదు. పైగా ఎన్నోరెట్లు పెరిగింది. దాని ‘అత్యున్నత’ రూపమైన ‘సామ్రాజ్యవాద’మైంది. సామ్రాజ్య వాదమంటేనే యుద్ధాలని లెనిన్ చెప్పిన మాట ఆచరణలో నిజమైంది. రెండు ప్రపంచ యుద్ధాలను ప్రపంచం అనుభవించింది. విపరీతమైన మానవ హననం జరిగింది. వలస దోపిడీ తీవ్రమైంది. వలసల్లో అశేష త్యాగాలతో ప్రజలు చేసిన పోరాటాలు, సోషలిస్టు దేశాల పుణ్యాన వలస వ్యవస్థ బీటలు వారింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1950వ దశకంలో పంచరంగుల ప్రపంచ పటం ఆవిష్కృతమైంది.
రెండవ ప్రపంచ యుద్ధం దాదాపు అంతమైన తర్వాత తన మిత్రులకు, శత్రువులకు తన సైనిక పాటవాన్ని చూపించుకునేదానికి 1945 ఆగస్టు 6న హీరోషిమా, 9న నాగసాకి పట్టణాలపై అణుబాంబులు వేసింది అమెరికా. ఏడు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మనుషుల శరీరం నుండి మాంసం ముద్దలు ముద్దలుగా ఊడి పడిపోయింది. ఆ ప్రభావం నేటికీ పోలేదు జపనీయులకు. 1973 -75 మధ్య వియత్నాం యుద్ధంలో నాపమ్ బాంబులు జారవిడిచింది అమెరికా. 700 – 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలో మనుషులతో పాటు పంటలు, చెట్లు కాలి బూడిదైనాయి. నేటికీ అమెరికా దన్నుతో ఇజ్రాయిల్ పాలస్తీనియన్లపై సాగిస్తున్న మారణకాండ మన కండ్లెదుటే వుంది. సామ్రాజ్యవాదమంటే ఊచకోత. సామ్రాజ్యవాదమంటే అణచివేత!
1886 నాటి చికాగో కార్మికుల రక్తం ఆవిధంగా నేటికీ ఏరులైపారుతోంది. అందుకే మేడే ఒక వర్తమానం. ఢిల్లీ సరిహద్దుల్లో బిజెపి నేతల కారు చక్రాల కింద చితికిపోయిన రైతుల రక్తమూ దాన్లోనే కలిసుంది. ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంకు విధానాలకి వ్యతిరేకంగా యావత్ ప్రపంచంలో గళమెత్తిన, పిడికిళ్లెత్తి నిరసనలు తెలిపినా, కదం కలిపి పోరాటాలు చేసినా వాటిపై విరుచుకుపడి మారణహోమం సాగిస్తున్నది పెట్టుబడి. విద్యుత్ ఉద్యమ అమరుల రక్తం, ముదిగొండ అమరవీరుల రుధిర తర్పణలూ దీనిలో అంతర్భాగం.
×××
ఇన్నేళ్లూ అవే ఉరితాళ్లు! ఉరేసే తలార్లు మారుతున్నారు! ఉరితీయబడేవాళ్లూ మారుతున్నారు. కొందర్ని స్వదేశస్థులు ఉరితీస్తే మరెందర్నో సామ్రాజ్యవాద కుక్కలు, తోడేళ్లు నంజుకుతిన్నాయి. 8 గంటల పనిదినాల కోసం సాగిన పోరులో 1887లో ఉరితియ్యబడ్డారు అల్బర్ట్ పార్సన్స్, ఆగస్టు స్పైస్, ఆడాల్ఫ్ ఫిషర్, జార్జి ఏంగెల్స్‌లు. బాంబుదాడిలో పోలీసులను హత్య చేశారన్న నేరారోపణ రుజువు కాకుండానే ఆ ఉరితీతలు జరిగిపోయాయి. అవి ఆనాటి పెట్టుబడిదారీ హత్యలే!
8 గంటల పని కోసం సాగిన పోరును బ్రహ్మప్రకాష్ కవితాత్మకంగా…
”మేము సూర్యరశ్మిని స్పృశించాలనుకుంటున్నాం
మేమూ పూల వాసన చూడాలనుకుంటున్నాం
మాకు భగవంతుడి అనుగ్రహం తప్పక వుంటుంది
మాకు కావాలి 8 గంటల పనిదినం
మేము శక్తులన్నీ మోహరించుకుంటున్నాం
నౌకలనుంచి, నౌకల రేవునుంచి, బజారు నుంచి, మిల్లుల నుంచి
ఎనిమిది గంటల పనిదినం
ఎనిమిది గంటల విశ్రాంతి
ఎనిమిది గంటలు మా కోసం…
ఆనాడు బానిసలు చేసిన సమ్మె సూర్యుడిని అస్తమింపజేసింది. లేకపోతే సూర్యుడు సామ్రాజ్యానికి గాని, బానిసలకు గాని అస్తమించేవాడే కాదు”
- ‘కంచెలపై దేహాలు’లో
పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ఆ ఉరితాళ్లను భద్రపరుచుకుంటారేమో! 1931, మార్చి 23న భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను లాహోర్‌లో ఆ తాళ్లతోనే ఉరేశారనుకుంటా! మొదటి ఐదుగురు కోరింది 8 గంటల పని. వారు ప్రాణత్యాగం చేసినా నేడది అమల్లోకి వచ్చింది. తర్వాతి ముగ్గురూ కోరింది భరతమాత దాశ్య శృంఖలాల్ని బద్దలు కొట్టుడం. అటువంటి వీరుల బలిదానాలు వృధా కాలేదు. 1947 ఆగస్టులో దేశ స్వాతంత్య్రమూ వచ్చింది.
పెట్టుబడి దారులను వ్యతిరేకించినా, సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించిననా ఉరి కామన్. లేదా కాల్చి చంపడం కామన్. మనదేశంలో సీతారామరాజైనా, చిలీలో అలెండీ అయినా, కాంగోలో పాట్రిస్‌లుముంబా అయినా, బొలీవియాలో చేగువేరా అయినా! అందరి హత్యల వెనుక సామ్రాజ్యవాదమే!
అందుకే శ్రీశ్రీ ”రణరంగం కానిచోటు భూస్థలమంతా వెతికిన దొరకదు/
గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్లతో” అన్నాడు.
నేడొక పక్క నయా ఉదారవాద విధానాలు వ్యవస్థాగత సంక్షోభంలో చిక్కుకున్నాయి. ట్రేడ్ యూనియన్లు లేని కార్మికశక్తి కోసం ప్రపంచ పెట్టుబడి వెంపర్లాడుతోంది. గడియారాన్ని వెనక్కి తిప్పాలని పెట్టుబడిదారుల ప్రయత్నం. యూనియన్ల నుండి ఏ ఆదరువూ లేని కట్టు బానిసలుగా కార్మిక వర్గాన్ని తయారు చేసే ప్రయత్నంలో వారున్నారు. మనదేశంలో ఇది ఇంకా మరింత ఎక్కువగా కనపడుతుంది. అందుకే ఆక్స్‌ఫామ్ నివేదిక భారతదేశంలో అంతరాలు స్పష్టంగా కనపడుతున్నాయన్నది.
×V
లేబర్ కోడ్‌లు 2020 లో పార్లమెంట్ పాస్ చేసినా గత ఐదేండ్లుగా వాటి అమలును కార్మిక వర్గం తన ప్రతిఘటన ద్వారా అడ్డుకుంది. లేబర్‌కోడ్‌లు అమల్లోకి రాకముందే ‘జన్ విశ్వాస్ చట్టం’ కింద కార్పొరేట్లు చేసే 180 నేరాల్ని, బాయిలర్ చట్టం, అటవీ చట్టం, టీ గార్డెన్స్ చట్టం, రబ్బర్ చట్టం, అనేక ఫార్మాస్యుటీకల్ చట్టాల వంటి 41 చట్టాల సవరణ ద్వారా నేరాలు కాకుండా చేసింది మోడీ సర్కారే. పై చట్టాల కింద గతంలోని జైలు శిక్షలకు బదులు కొద్దిగా ‘ఫైన్’ చెల్లిస్తే చాలంది. తాజా కేంద్ర బడ్జెట్‌లో దాదాపు వంద నేరాల్ని నేరాల పరిధి నుండి తొలగించింది. ‘శ్రమ్ సమాధాన్, శ్రమ్ సువిధ’ పోర్టల్స్ ద్వారా ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు చేసే విధానాన్ని ఎత్తేశారు. కార్మికులు మొత్తుకున్నా పట్టించుకునే వారుండరన్నమాట!
మరోపక్క తాము పోరాడి సాధించుకున్న హక్కులు నిలబెట్టుకునేందుకు కార్మికులు సమిష్టిగా చేసే ఏ చర్యనైనా ‘నేరం’ కిందికి చేర్చేశారు. భారతీయ న్యాయసంహిత (బి.ఎన్.ఎస్)లోని సెక్షన్111 ప్రకారం కార్మికులందరూ కలిసి సామూహికంగా ఫిర్యాదు చేసినా ‘నాన్ బెయిలబుల్’ కేసులు పెట్టొచ్చు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చాలామంది కార్మిక నాయకులు కార్మిక సమస్యల్ని లేబర్ డిపార్ట్‌మెంట్ దృష్టికి తెచ్చినందుకు ఇటువంటి తప్పుడు కేసుల్లో మగ్గుతున్నారు. 1799 – 1880లో బ్రిటన్‌లో పాస్ చేసిన కాంబినేషన్ చట్టాల దశకు భారతదేశాన్ని తీసికెళ్లాలని భావిస్తున్నట్టున్నారు.
ప్రభుత్వ శాఖల్లో కరపత్రాల పంపిణీ, గేట్ మీటింగు జరపడం, మెమొరాండాలు అధికారులకు ఇవ్వడం ఇప్పటికే నిషేధించారు.
గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం దేశంలో పెరిగిపోతోంది. కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయి. జోడించిన నికర విలువలో (నెట్ వాల్యూయాడెడ్) కార్మికుల వేతనాలు 2020లో 18.9 శాతం నుండి 2023కు 15.9 కి పడిపోగా, ఇదే కాలంలో లాభాల వాటా 38.7 శాతం నుండి 51.9 శాతానికి పెరిగింది. కటిక పేదరికం, పోషకాహార లేమి పెరుగుతున్నాయి. అటు బిజెపి పాలిత రాష్ట్రాలలోనూ, ఇటు కేంద్రంలోనూ అవినీతి వ్యవస్థీకృతం అయిపోయింది. 2018లో పుల్వామా నుండి నేటి పహల్గాం వరకు ఉగ్రవాదులు రెచ్చిపోతూనే వున్నారు. దొంగనోట్ల ముద్రణ ఆగలేదు. అదీ గుజరాత్ నుండే. 2016లో నోట్ల రద్దు సమయంలో మోడీ చెప్పిన కారణాలన్నీ బోగస్ అని తేలిపోయింది. కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పేదలు మైక్రో ఫైనాన్స్ వలలో చిక్కుకుంటున్నారు.
ఈ అన్ని సమస్యలపై రానున్న రోజుల్లో మనదేశంలో కూడా పోరాటాలు పెచ్చరిల్లుతాయి. ఇప్పటికే రైతాంగం 2020 జూన్ నుండి లక్షల సంఖ్యలో ఢిల్లీని ముట్టడించి అక్షరాల ప్రభుత్వం మెడలు వంచి వాటిని రద్దు చేయించుకున్నారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వామపక్ష మేధావి నోమ్ ఛోమ్స్‌స్కీ చెప్పినట్లు ”చీకట్లు కమ్మిన ప్రపంచంలో ఇది ఒక కాంతిరేఖ”. మోడీ ప్రభుత్వం అణిచివేతలను అధిగమించి ఆ ఉద్యమం అంతర్జాతీయ మద్దతు కూడగట్టి వినూత్న పద్ధతుల్లో విజయం సాధించింది.
మేడే ఒక అత్యున్నత స్థాయి వర్గపోరాటం. పని గంటలు తగ్గించడమంటే నేరుగా పెట్టుబడిదార్ల లాభాలపై వేటేయడమే. దాని ప్రతిధ్వని మొదటి కార్మిక వర్గ రాజ్యంలో లెనిన్ ద్వారా చట్టమైంది. ప్రపంచ కార్మికులకు చుట్టమైంది. కార్మిక వర్గ రాజ్యాలు విస్తరించకుండా ఉండాలంటే 1919లో ఐ.ఎల్.ఒ ద్వారా ప్రపంచ వ్యాపిత రూలైంది 8 గంటల పనిదినం. ఈ సందర్భంగా ఒక విషయం గమనార్హం. ”ప్రజలను దోచుకునే వీళ్లే ప్రజల చరిత్రనూ దోచుకుంటారు. ఏ వర్గ పోరాటమైనా ఈ క్రమాన్నంతా తిరగదోడే క్రమమే. అందుకే పీడిత ప్రజల దృక్పథంతో చరిత్రను పరిశీలించాలంటే వర్తమాన వర్గ పోరాటంతో మాత్రమే ప్రారంభించాలి. ఇంక ఏ విధంగా చరిత్రను అధ్యయనం చేసే క్రమమైనా గతించిన సంఘర్షణలలో గెలుపొందిన వారి ప్రభావానికి లోనుగాక తప్పదు”. – ఏ అమెరికాలోని చికాగోలో మే డే సంఘటన జరిగిందో అక్కడ మే డే జరగదు. సెప్టెంబర్ మొదటి సోమవారం ‘లేబర్ డే’ జరుపుకుంటారు. ఆ రోజు శెలవు దినం.
8 గంటల పనిదినం కోసం కార్మికులు అమరులైన రోజది. అది దీక్షా దినం. పండుగ రోజు కాదు.
(మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా) - సుధా భాస్కర్, 9490098025