– మరణానికి కారణమైన అలెంబిక్ ఫార్మా ప్రతినిధులను కఠినంగా శిక్షించాలి : సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అలెంబిక్ ఫార్మా పరిశ్రమలో మెడికల్ రిప్రజెంటివ్‌గా పని చేసిన జె. అఖిలేష్ (23) కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆయన మరణానికి కారణమైన ఆ కంపెనీ ప్రతినిధులను కఠినంగా శిక్షించాలని కోరింది. యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించే వరకు టీఎంఎస్‌ఆర్‌యూ ఆధ్వర్యంలో తలపెట్టిన 15 రోజుల నిరసన కార్యక్రమాలకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఈమేరకు బుధవారం సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలెంబిక్ ఫార్మా కంపెనీలో మెడికల్ రెప్రజెంటేటివ్ పని చేస్తున్న ఆయన్ను టార్గెట్ పూర్తి చేసేందుకు స్టాకిస్టులకు సొంత డబ్బు చెల్లించాలని కంపెనీ ఒత్తిడి తెచ్చిందని విమర్శించారు. ఈ పద్దతిని నిరాకరించడంతో యాజమాన్యం ఆయనపై మరింత ఒత్తిడి పెంచడంతోపాటు బెదిరింపులకు పాల్పడిందని విమర్శించారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఆయన అలెంబిక్ కంపెనీకి రాజీనామా చేసి, మ్యాన్ కైండ్ ఫార్మా కంపెనీలో చేరినట్టు తెలిపారు. తమ కంపెనీకి అఖిలేష్ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉందంటూ ఆయన కొత్తగా చేరిన కంపెనీకి మేనేజర్లు ఫిర్యాదు చేశారని వివరించారు. దీంతో తిరిగి ఆయన పాత కంపెనీకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయినా ఆయనపై మేనేజర్ల వేధింపులు ఆగలేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనకు డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీలో ఉద్యోగం వచ్చిందని పేర్కొన్నారు. మేనేజర్లు అక్కడ కూడా ఇదే రకమైన ఫిర్యాదు చేశారని విమర్శించారు. కంపెనీ యాజమాన్యం, మేనేజర్ల ఒత్తిళ్లు, వేధింపులను తట్టుకోలేక తిరిగి పాత కంపెనీలో చేరాల్సి వచ్చిందనీ, ఆయన డబ్బు చెల్లించే వరకు సహోద్యోగులు ఎవరూ అతనితో మాట్లాడకూడదంటూ యాజమాన్యం షరతులు పెట్టిందని విమర్శించారు. దీనివల్ల ఆయన పూర్తిగా ఒంటరితనానికి గురై, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని సహజ మరణంగా నమోదు చేయించేందుకు కంపెనీ ప్రయత్నించిందని విమర్శించారు. దీనిపై యూనియన్ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేయడంతో అఖిలేష్ ఆత్మహత్యకు బాధ్యులైన మేనేజర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని గుర్తు చేశారు. అఖిలేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీఎంఎస్‌ఆర్‌యూ (సీఐటీయూ) యూనియన్ తలపెట్టిన ఉద్యమానికి రాష్ట్ర కార్మిక వర్గం అండగా నిలవాలని వారు కోరారు.
మెడికల్ రిప్రజెంటేటివ్ అఖిలేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



