నవతెలంగాణ – దుబ్బాక
“ప్రస్తుత సమాజమంతా రోగాలు, మానసిక సమస్యలతో అస్తవ్యస్త జీవనం గడుపుతుంది. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే కృంగిపోతున్నారు. సమస్యల్ని పరిష్కరించే మార్గాన్ని అన్వేషించడం లేదు. వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసను పెట్టడమే. ధ్యానం చేస్తే మన ఆరోగ్యం మెరుగుపడి ఏకాగ్రత, మానసిక ప్రశాంతత లభిస్తుంది.” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరానికి చెందిన బ్రహ్మవిధ్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అన్నారు.
ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం అలవర్చుకుంటే తమ ఆరోగ్యాన్ని తామే రక్షించుకున్న వాళ్ళవుతారని స్పష్టం చేశారు. మంగళవారం దుబ్బాక లోని వైశ్య భవన్ లో పిరమిడ్ స్పిరిచ్యూవల్ సొసైటీస్ మూవ్ మెంట్ (పీఎస్ఎస్ఎం) నిర్వాహకులు అంబటి కమల- సాయిబాబా దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన “ఒకరోజు ఉచిత ధ్యానం- ఆత్మ జ్ఞానం” శిక్షణ శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలని, ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన పలువురు పీఎస్ఎస్ఎం కార్యకర్తలు పాల్గొన్నారు.