మావోయిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
ప్రజాస్వామ్యయుతంగా పనులు చేసుకోవాలని సూచన
బలిమెలలో మరణించిన 32 మంది పోలీసులకు 200 గజాల స్థలం
గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ సభ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి తాము సాధించాలనుకున్న పనులను ప్రజాస్వామ్య యుతంగా సాధించుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గోషామహల్ పోలీస్‌స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ (బ్లాక్ డే) సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టులు అనుసరిస్తున్న మార్గానికి భవిష్యత్ లేదనీ, ఇప్పటికే అగ్రనేతలు కొందరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. మిగతావారు కూడా ఆ బాటలో నడిచి ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో తమ భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 191 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరుల య్యారనీ, రాష్ట్రానికి చెందిన ఎస్సై బానోత్ జవహర్‌తో పాటు కానిస్టేబుళ్లు సందీప్, శ్రీధర్, పవన్‌కళ్యాణ్, సైదులు, ప్రమోద్‌లు అమరుల య్యారనీ, వారి త్యాగాలు ఎనలేనివని ఆయన కొనియాడారు. వారికి శ్రద్ధాంజలి ఘటించారు. విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు కోటి రూపాయలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ.1.20 కోట్లు, డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ వరకు రూ.1.50 కోట్లు, ఎస్పీ నుంచి ఆ పైస్థాయి వరకు రూ.2 కోట్లను నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లిస్తున్నదనీ, అలాగే వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, 300 గజాల స్థలాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నదని వివరించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల అదుపునకు కృషి చేస్తున్న పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వం అన్ని విధాలా చేయూత నిస్తుందన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా మొదలుకొని మత కలహాలను అదుపు చేయడంలో పోలీసులు రేయింబవళ్లు కృషి చేస్తున్నారనీ, వారు అందిస్తున్న సేవలకు ప్రజలు కూడా తగిన గుర్తింపును ఇవ్వాలని కోరారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లోని బలిమెల రిజర్వా యర్‌లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన 32 మంది పోలీసులకు కూడా తమ ప్రభుత్వం గాజులరామారంలో ఒక్కొక్కరికి 200 గజాల భూమిని కేటాయిస్తు తాజాగా నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. వారికి నష్టపరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పెరిగిపో తున్న సైబర్ నేరాలను అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని అన్నారు. డ్రగ్స్ మాఫి యాను కట్టడి చేయడానికి ఈగల్ ఫోర్స్ సైతం చేస్తున్న కృషి కూడా ఫలిస్తున్నదని రేవంత్‌రెడ్డి మెచ్చుకున్నారు. చట్టాలను గౌరవించేవారి పట్ల ఫ్రెండ్లీగా, అతిక్రమించేవారి పట్ల కఠినంగా పోలీసులు వ్యవహరిస్తారనే సందేశాన్ని పోలీసులు సమాజంలోకి పంపిం చాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి శాంతి భద్రతలే ప్రధాన కారణమనీ, దాని పరిరక్ష ణలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని సీఎం చెప్పారు. దేశంలోనే శాంతి భద్రతల పరిరక్ష ణలో రాష్ట్ర పోలీసులు మొదటి స్థానంలో ఉండటం గర్వకారణ మన్నారు. పోలీస్ శాఖలో మహిళలను ప్రోత్స హిస్తూ మహిళా ఐపీఎస్ అధికారులు పలువురికి కీలకమైన బాధ్యతలను అప్పగించడం జరిగిందనీ, మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్లలో ఏడుగురు మహిళా ఐపీఎస్ అధికారులు డీసీపీ బాధ్యతలను నిర్వహిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖను మరింత పటిష్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
లొంగిపోవడమే మార్గం : డీజీపీ శివధర్‌రెడ్డి
రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర పోలీస్ శాఖ మరింత స్ఫూర్తిదాయకంగా పని చేయాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో కత్తిపోట్లకు గురై మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే ప్రఖ్యాతి గడించిన రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మరింత ఇనుమడించిన శక్తితో పని చేస్తున్నదని ఆయన తెలిపారు. మావోయిస్టులకు రాష్ట్రంలో తమ కార్యాలాపాలను కొనసాగించే పరిస్థితులు లేవనీ, లొంగిపోవడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు.
‘పోలీస్ అమరులు వీరు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం
అనంతరం ‘పోలీస్ అమరులు వీరు’ అనే పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. తర్వాత ఆ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి ముఖ్యమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ (హౌం) సి.వి ఆనంద్, డీజీపీ శివధర్‌రెడ్డి, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ డీజీపీలు కూడా అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అదే ప్రాంగణంలో ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసుల కుటుంబ సభ్యులను ఎస్‌ఐబీ డీజీ సుమతి ముఖ్యమంత్రికి పరిచయం చేయగా వారిని ఆయన పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జనజీవనస్రవంతిలో కలవండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES