చిలుక క్షేమమా.. కులుకా కుశలమా.., ఒళ్లంతా తుళ్ళింత కావాలిలే.. జల్లంత కవ్వింత రావాలిలే.., నిన్ను కోరి వర్ణం.. వర్ణం.. ఈ సూపర్ డూపర్ తెలుగు పాటలు పాడింది మన తెలుగామే కాదు. కానీ చిత్రంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. దక్షిణ భారత నైటింగేల్‌గా, మెలోడీ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క తెలుగులోనే కాదు 10 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. ఆమే ప్రముఖ నేపథ్యగాయని కె.ఎస్.చిత్ర. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది’ అంటూ పాడటమే కాదు దాన్ని ఆచరణలో నిరూపిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మానవిలో ఆ మధుర గాన కోయిల పరిచయం…
చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. 1963 జూలై 27న కేరళ రాష్ట్రంలోని ఇప్పటి తిరువనంతపురం (త్రివేండ్రం) నగరంలో జన్మించారు. ఆమె తండ్రి కృష్ణ నాయక్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, సంగీత విద్వాంసుడు. ఆయనే తన ముగ్గురు పిల్లలకి స్వయంగా సంగీతంలోని ప్రాథమికాలను నేర్పించారు. ఆమె తల్లి శాంతి కుమారి కూడా సంగీతం టీచర్. చిత్ర పేరులో తన తల్లిదండ్రుల ఇద్దరి పేర్లు కలిపి ఉన్నాయి. ఆమెకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలని కోరిక ఉండేది. అందుకు పెద్ద కుమార్తె బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క సాధన చేసేటప్పుడు చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేవారు. చిన్నతనంలోనే ఆల్ ఇండియా రేడియోలో రెండేండ్ల కృష్ణుడికి పాట పాడించారు. ఆమె తొలి రికార్డ్ అదే.
ఆమె ప్రతిభను గుర్తించి
పూర్తిస్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరిక మేరకు చిత్ర కేంద్ర ప్రభుత్వం అందించే ‘నేషనల్ టాలెంట్ సెర్చ్’ స్కాలర్షిప్‌కి దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం కనీసం రెండేండ్లు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ అప్పటిదాకా తనకున్న సంగీత పరిజ్ఞానంతో దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికలో భాగంగా న్యాయనిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడారు. ఆ కృతిలో తనకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసారు. ఆమె ప్రతిభను గమనించిన న్యాయ నిర్ణయితలు ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డాక్టర్ కె.ఓమన్ కుట్టి వద్ద కర్ణాటక సంగీతంలో విస్తృతమైన శిక్షణ పొందారు.
మొదటి పాటకే జాతీయ పురస్కారం
తిరువనంతపురంలోని కాటన్ హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసారు. కేరళ విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో బి.ఎ చేసి పట్టభద్రురాలయ్యారు. చిత్రను 1979లో ఆమె గురు ఓమనకుట్టి అన్నయ్య అయిన ఎం.జి రాధాకృష్ణన్ మలయాళ చిత్ర రంగానికి పరిచయం చేశారు. మొదటిసారే జేసుదాసుతో కలిసి పాడే అరుదైన అవకాశం దక్కించు కున్నారు. మొదటి సారి తప్పులు పాడినా జేసుదాసు సహకారంతో విజయ వంతంగా పాడగలిగారు. దాంతో ఆమెకు అవకాశాలు మొదలయ్యాయి. తెలుగులో ‘పాడలేను పల్లవైన భాషరాని దానను’ అనే తన మొదటి పాటకే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ పాటకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. అప్పటి నుండి ఆమెకు విస్తృతమైన అవకాశాలు వచ్చాయి. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ పరిచయమయ్యారు. అందుకే ఆమెకు ప్రతి చోట అభిమానులున్నారు. జేసుదాసుతో కలిసి భారత దేశంలోనే కాక దేశ విదేశాల్లో అనేక కచేరీలు చేశారు.
లెక్కకు మించిన పురస్కారాలు
ఉత్తమ నేపథ్య గాయనిగా కేరళ రాష్ట్ర ప్రభు త్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 పురస్కారాలు, తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి నాలుగు పురస్కారాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు పురస్కారాలను అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపద్య గాయనిగా పురస్కారాలు అందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించారు. అంతేకాక ఒడిశా ప్రభుత్వం నుండి ఒకటి, బెంగాల్ ప్రభుత్వం నుండి ఒకటి అందుకు న్నారు. ఎనిమిది ఫిలింఫేర్ పురస్కా రాలు, 252 ఇతర అవార్డులు అందుకున్నారు. చైనా ప్రభుత్వం నుండి అవార్డు పొందిన మొదటి భారత నేపధ్య గాయకురాలిగా చరిత్ర సృష్టించారు. బ్రిటిష్ పార్లమెంట్లోనూ అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా చిత్ర నిలిచారు. ఆమె అందుకున్న పురస్కారల సంఖ్య 450కి పై చిలుకే. ఇంత చరిత్ర సృష్టించిన చిత్ర మన భారతీ యురాలు కావడం గర్వకారణం. ఈమె మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ…
– పాలపర్తి సంధ్యారాణి
మెలోడీ క్వీన్ చిత్ర
- Advertisement -
- Advertisement -