నవతెలంగాణ – అశ్వారావుపేట
మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించాల్సిన బకాయి వంట బిల్లులు,వేతనాలను వెంటనే విడుదల చేయాలని,వంట కార్మికులకు రెగ్యులర్గా చెల్లించే ఈ – కుబేర్ నుండి కాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కార్మికుల అకౌంట్లో జమ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల మండల మహాసభ నాగ దుర్గ అధ్యక్షతన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం లో మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు వేతనం పెంచుతామని,వారి సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా ఏ ఒక్క సమస్య పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పాఠశాలలు తెరిచిన నాటి నుండి మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మార్కెట్ ధరలకు తగ్గట్టుగా విద్యార్థుల మెనూ చార్జీలు,తమ వేతనాలు పెంచాలని దశలవారీగా అధికారులకు మొరపెట్టుకున్నా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉన్నాయని అన్నారు. విద్యాశాఖ పై స్థాయి అధికారుల దృష్టికి తమ సమస్యలు తీసుకుని వెళ్లటానికి ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపడితే సాధారణ వంట కార్మికులను దగ్గర నుండి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు అరెస్టుల పర్వం కొనసాగించారు అని, బస్సుల్లో రైల్లో ధర్నాకు వెళుతున్న నాయకులు వంట కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని ఇది అత్యంత అప్రాజాస్వామిక చర్య అని,ఇది కార్మికుల హక్కులపై జరుగుతున్న దాడికి నిదర్శనం అని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక వేదికలపై నుండి అనేక సందర్భాలలో మాట్లాడుతూ తమ పాలనలో ఉద్యోగులకు కార్మికులకు ప్రజలకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే హక్కును స్వేచ్ఛను ఇచ్చామని చెప్తూనే నాయకుల ఇండ్లకు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేయడం తమ విధానానికి వ్యతిరేకమని అంటూనే ఇలాంటి నియంతృత్వ చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు.అన్ని పాఠశాలలో గ్యాస్ తో మధ్యాహ్న భోజనం వంట చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అవసరమైన గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యామిని, సీత,శిరీష,మహాలక్ష్మి,విజయ్ కుమారి,రమాదేవి,సారమ్మ, గంగావతి తదితరులు పాల్గొన్నారు.