– అరెస్టులకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మధ్యాహ్న భోజన కార్మికులు వారి సమస్యలను పరిష్కరించాలంటూ బుధవారం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వస్తుంటే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఖండించింది. వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించడం సరైంది కాదని తెలిపింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రమను గృహ నిర్భంధం చేయడాన్ని ఖండించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ను పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారని విమర్శించారు. అరెస్టుల సందర్భంగా అనేక మంది కార్మికులు గాయపడ్డారని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి రావాల్సిన 10 నెలల వేతన బకాయిలు, ఆరు నెలల గుడ్ల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేస్తామంటూ హామీనిచ్చారనీ, రెండేండ్లు కావస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కొత్తగా మెనూ అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, అవసరమైన నిధులను కేటాయించటం లేదని తెలిపారు. మెనూలో వారానికి మూడు గుడ్లు, రోజూ రాగిజావ, రెండు మూడు రకాల కూరగాయలు, సాంబారు వంటివి ఇస్త్తామన్నారని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ నిధులను కేటాయించడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కొత్తగా అమలు చేస్తామన్న మెనూకు సరిపడా నిధులను కేటాయించాలనీ, వేతన బకాయిలు, గుడ్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతును తెలియజేస్తున్నామని తెలిపారు.
మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలు చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES