త్వరలోనే క్యూబా పతనం : ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ : వెనిజులా నేత నికొలస్ మదురో అపహరణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరింతగా రెచ్చిపోతున్నారు. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రోపై సైతం సైనిక చర్య చేపడతానని హెచ్చరించారు. క్యూబా ప్రభుత్వం కూడా త్వరలోనే పతనమవుతుందని జోస్యం చెప్పారు. మదురో అపహరణను బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, ఉరుగ్వే, స్పెయిన్ తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా చర్య శాంతి, ప్రాంతీయ భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ట్రంప్ తన దుందుడుకు వైఖరిని వీడటం లేదు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వెనిజులా, కొలంబియా దేశాలు బలహీనంగా ఉన్నాయని చెప్పారు. కొకైన్‌ను తయారు చేసి, దానిని అమెరికాలో అమ్మాలని అనుకునే వ్యక్తి బొగోటాలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఎంతో కాలం ఆ పని చేయలేరని పెట్రోను ఉద్దేశించి అన్నారు. కొలంబియాపై అమెరికా సైనిక చర్య జరుపుతుందని అంటారా అని విలేకరులు ప్రశ్నించగా అవునని చెప్పారు.
అపవాదులు ఆపండి : పెట్రో
ట్రంప్ బెదిరింపులపై పెట్రో ఘాటుగా స్పందించారు. తనపై అభాండాలు వేయడం మానుకోవాలని ట్రంప్‌కు సూచించారు. లాటిన్ అమెరికా దేశాలన్నీ సంఘటితం కావాలని పిలుపునిస్తూ లేకుంటే మనల్ని బానిసలుగా, సేవకులుగా చూస్తారని అన్నారు. ‘ప్రపంచ మానవ చరిత్రలో ఒక దక్షిణ అమెరికా దేశంపై బాంబు దాడి చేసిన మొట్టమొదటి దేశం అమెరికాయే. అయితే ప్రతీకారం అనేది జవాబు కాదు. దానికి బదులుగా లాటిన్ అమెరికా దేశాలు ఐక్యంగా ఉండాలి. పరస్పరం అవగాహన కలిగి ఉండాలి. వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలి. అన్ని దేశాలు ప్రపంచంతో చేతులు కలపాలి’ అని సూచించారు.



