ఎలక్ట్రానిక్ యుద్ధ చర్యలు అమలు చేస్తాం : వెనిజులా రక్షణ మంత్రి పాడ్రినో లోపెజ్ వెల్లడి
అమెరికా మిలిటరీ చర్యలకు దీటుగా తాజా పరిణామాలు
వెనిజులా : మాదకపదార్థాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ పేరుతో మిలిటరీ చర్యలకు దిగుతోన్న అమెరికా చర్యలకు వెనిజులా ప్రత్తి స్పందించింది. తమ కరీబియన్ ద్వీప ప్రాంతంలోని లా ఓర్చిలాలో మూడు రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించినట్టు వెనిజులా వెల్లడించింది. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక చర్యలు చేపట్టటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్రమత్తమైన వెనిజులా తాజా చర్యకు దిగింది. మాదకద్రవ్య వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా అక్కడ మోహరించిన యూఎస్ దళాలు.. కరేబియన్ వ్యాప్తంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నాయంటూ రెండు వెనిజులా పడవలను పేల్చేశాయి. ఇందులో 14 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ చర్యతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యూఎస్ చర్యను యూఎన్ నిపుణులు సైతం తప్పుబట్టారు. ఇది న్యాయవిరుద్ధమైన చర్యగా విమర్శించారు.
ఈ దాడులతో పాటు ఈ ప్రాంతంలో యూఎస్ యుద్ధనౌకల మోహరింపు ఆందోళనలను రేకెత్తించాయి. వెనిజులా టార్గెట్‌గా యూఎస్ చర్యలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన వెనిజులా మూడ్రోజుల సైనిక విన్యాసాలకు దిగింది. తమ దేశ సమగ్రతను ప్రశ్నిస్తే ఎదుర్కోవటానికి ఎంతకైనా సిద్ధమంటూ అమెరికాకు గట్టి సందేశాన్ని పంపింది. ”సాయుధ డ్రోన్లు, నిఘా డ్రోన్లు, జలాంతర్గామి డ్రోన్లతో వైమానిక రక్షణ మోహరింపులు ఉంటాయి. మేము ఎలక్ట్రానిక్ యుద్ధచర్యలను అమలు చేయబోతున్నాం” అని వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో లోపెజ్ అన్నారు. ఈ విన్యాసాలలో 12 నౌకలు, 22 విమానాలు, ప్రత్యేక నావికా మిలీషియా నుంచి 20 చిన్న పడవలు ఉంటాయని వెనిజులా సాయుధ దళాలు చెప్పాయి. కాగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా టార్గెట్‌గా చేసుకున్న విషయం విదితమే. మదురోపై 50 మిలియన్ డాలర్ల బహుమతిని సైతం ప్రకటించింది కూడా.