– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బీఆర్‌ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా, బీఆర్‌ఎస్ పార్టీయా అన్న స్పష్టత కూడా ప్రభుత్వానికి లేదని అన్నారు. బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనడం సిగ్గుచేటని, ఈ వ్యాఖ్యలతోనే పోలీసింగ్ వ్యవస్థ పనితీరు ప్రశ్నార్థకమవుతోందన్నారు. హోంమంత్రి చేతకానితనం మంత్రుల మాటల ద్వారానే బయట పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులకు, అధికారులకు స్వేచ్ఛ లేదని, రాజకీయ ఒత్తిళ్లతో వ్యవస్థను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ మొదటి నుంచే చెబుతోందని, ఇప్పుడు అదే విషయాన్ని కాంగ్రెస్ నాయకులే ఒప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టి బీఆర్‌ఎస్‌పై దాడులు చేయిస్తున్నారని, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల్లో సహకరించాలని కోరడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, రాత్రివేళల్లో కాంగ్రెస్ గుంపులు బైక్‌లపై సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతో ఉద్యోగులను ప్రభావితం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కేసీఆర్ రాజ్యమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జెడ్పీమాజీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



