Friday, October 10, 2025
E-PAPER
Homeజాతీయందశాబ్దకాలంగా అమలుకు నోచని మైనారిటీ కమిషన్‌ సిఫార్సులు

దశాబ్దకాలంగా అమలుకు నోచని మైనారిటీ కమిషన్‌ సిఫార్సులు

- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడచిన పది సంవత్సరాల కాలంలో జాతీయ మైనారిటీల కమిషన్‌ (ఎన్‌సీఎం) నుంచి కేంద్రానికి 1,495 సిఫార్సులు అందాయి. అయితే వాటిలో ఏ ఒక్కటైనా అమలుకు నోచుకున్నదా అంటే స్పష్టత లేదు. కేంద్రంలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మైనారిటీలు…ముఖ్యంగా ముస్లింల పరిస్థితి దయనీయంగా మారింది. వారు వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. భారత్‌ను హిందూ దేశంగా, పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలను రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో మారణహోమం తరహా సంకేతాలు వెలువడుతున్నాయని ఎర్లీ వార్నింగ్‌, జెనొసైడ్‌ వాచ్‌ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఎన్‌సీఎం ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తే దాని సిఫార్సులపై కేంద్ర ఎంత ఉదాశీనంగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది.

శ్రీనగర్‌కు చెందిన ఎంఎం. షూజా అడిగిన ప్రశ్నకు సమాధానంగా…కేంద్రానికి 2015-16 నుంచి 2024-25 వరకూ పంపిన సిఫార్సుల వివరాలను సమాచార కమిషన్‌ తెలియజేసింది. ఈ సిఫార్సులు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని చెప్పింది. అంతే తప్ప వాటిలో అమలైన సిఫార్సుల సమాచారం ఇవ్వలేదు. దేశంలోని మైనారిటీల్లో ముస్లిం జనాభా అత్యధికంగా 14.2 శాతం ఉండగా క్రైస్తవులు 2.3 శాతం, సిక్కులు 1.7 శాతం, బౌద్ధులు 0.7 శాతం, జైనులు 0.4 శాతం, పార్సీలు 0.006 శాతం ఉన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కల్పించిన విధంగానే తనకు కూడా రాజ్యాంగ సంస్థ హోదా ఇవ్వాలని ఎన్‌సీఎం డిమాండ్‌ చేస్తోంది. అయితే కేంద్రం దీనికి అంగీకరించడం లేదు.

కమిషన్‌ పనితీరూ అంతే…
2020 ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌ 31 వరకూ ఎన్‌సీఎంకు 9,824 ఫిర్యాదులు అందాయి. వీటిలో 8,536 ఫిర్యాదులను కమిషన్‌ పరిష్కరించింది. అయితే తనకు అందిన ఫిర్యాదులు, పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను మాత్రం కమిషన్‌ వెల్లడించలేదు. 2014-25 మధ్యకాలంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో చనిపోయిన లేదా గాయపడిన మైనారిటీలు ఎందరు, బాధిత కుటుంబాలకు పరిహారం ఏమైనా ఇచ్చారా అనే విషయాలను కూడా ఎన్‌సీఎం బయటపెట్టడం లేదు. నిబంధనల ప్రకారం ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ సహా ఎన్‌సీఎంలో ఏడుగురు సభ్యులు ఉండాలి. అయితే ఏప్రిల్‌ నుంచి ఛైర్‌పర్సన్‌ కానీ, సభ్యులు కానీ లేకుండానే అది పనిచేస్తోంది. చిట్టచివరగా మాజీ ఐపీఎస్‌ అధికారి, బీజేపీ నేత ఇక్బాల్‌ సింగ్‌ దీనికి నేతృత్వం వహించారు. కమిషన్‌లో ప్రస్తుతం 33 మంది సిబ్బంది, 26 ఖాళీలు ఉన్నాయి. దేశంలో ఆక్రమణలకు గురైన మైనారిటీల భూముల సమాచారం కూడా కమిషన్‌ వద్ద లేదు.

చట్టసభలో తగ్గుతున్న ప్రాతినిధ్యం
బీజేపీ హయాంలో పార్లమెంటులో మైనారిటీల రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతోంది. బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు పార్లమెంటులో 30 మంది ముస్లిం ఎంపీలు ఉండే వారు. వీరిలో బీజేపీ సభ్యుడు ఒకరే. ఇప్పుడు పార్లమెంటులో పాతిక మంది ముస్లిం సభ్యులు ఉండగా బీజేపీకి ఎవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -