నవతెలంగాణ-ధర్మసాగర్: మండలంలోని దేవునూరు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వరద ప్రవాహానికి దెబ్బతిన్న కల్వర్టును, పంటలను నష్టపోయిన రైతులను శనివారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరామర్శించారు. ఈ సందర్బంగా రైతులు వారి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా, ముందస్తు చర్యలు తీసుకోకుండా ఒకేసారి ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి 8గేట్లు ఎత్తడం వల్లే ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని తెలిపారు. వరద ప్రవాహం వచ్చిన తీరును, వరదలో కొట్టుకుపోయిన పంటలను ఎమ్మెల్యే గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.రిజర్వాయర్ గేట్లు ఎత్తడం వల్ల భారీగా వరదనీరు వచ్చి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఓదార్చి భరోసా కల్పించారు.రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టపోయిన రైతుల వివరాలను, పశు సంవర్థకశాఖ అధికారులు పశువులను కోల్పోయిన రైతుల వివరాలను వెంటనే సేకరించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. నీటి విడుదల పై విచారణ జరిపించి బాద్యుల పైన చర్యలు తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు.
రైతులకు సమాచారం ఇవ్వకుండా రిజర్వాయర్ గేట్లు ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ఉదృతుని అంచనా వేయడంలో వైఫల్యం అయ్యారని, ముందస్తు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచించాలని తెలిపారు. వరద నీరు వెళ్లే కాలువను రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి రైతుల సహకారంతో కాలువ వెడల్పు చేయాలని సూచించారు. వరద ఉదృతికి పూర్తిగా దెబ్బతిన్న కల్వర్టును వెంటనే మారమ్మత్తులు చేపట్టాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ, పంచాయతీ రాజ్, నీటిపారుదల, పశు సంవర్ధక శాఖ అధికారులతో పాటు తహసీల్దార్, ఎంపిడివో, ఇతర అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



