నవతెలంగాణ – వనపర్తి
పెబ్బేరు పట్టణంలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే శుక్రవారం పరామర్శించారు. గురువారం మధ్య రాత్రి ఒంటి గంట సమయంలో పెబ్బేరు మండలం సుచి రెస్టారెంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వనపర్తి మండలం నాచహల్లి గ్రామానికి చెందిన శివశంకర్, సాయి అక్కడికక్కడే మృతిచెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులను వనపర్తి శాసనసభ్యులను తూడి మేఘారెడ్డి వనపర్తి జిల్లా ఆస్పత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వినాయక నిమజ్జన సందర్భంగా నాచహల్లి గ్రామ యువకులు వినాయకుడిని బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో నిమజ్జనం చేసి వస్తున్న సందర్భంలో పెబ్బేరు మండలం సుచిదాబ వద్ద వేగంగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డా రని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు వివరించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పరామర్శలో వనపర్తి మండల మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పట్టణ ప్రముఖ వైద్యుడు పగిడాల శ్రీనివాస్, పట్టణ మాజీ కౌన్సిలర్ బ్రహ్మం చారి ఉమల్ల రాములు తదితరులు ఉన్నారు.