Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుబీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

- Advertisement -

కారులో కార్చిచ్చు…
– చిలికి చిలికి గాలి వానలా కుటుంబ వ్యవహారం
– పార్టీ మారేనా? లేక కొత్త పార్టీయా?
– నూతన పార్టీ పేరుపై చర్చోపచర్చలు
– ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కారు పార్టీలో కార్చిచ్చు రేగింది. కేసీఆర్‌, కేటీఆర్‌… కవిత మధ్య ఇన్నాళ్లూ నలిగిన కుటుంబ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి, ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్‌ చేసేదాకా వెళ్లింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్‌, టి.రవీందర్‌రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కవిత గత కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ నేతలపైనా, ఆ పార్టీ అనుసరిస్తున్న తీరుపైనా విమర్శలు గుప్పిస్తోన్న విషయం విదితమే. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ చుట్టూ దయ్యాలున్నారంటూ ఆమె పలుమార్లు వ్యాఖ్యానించారు. బీజేపీకి, బీఆర్‌ఎస్‌ దగ్గరవుతోందనీ, ఇది సరికాదంటూ తాను కేసీఆర్‌కు లేఖ రాశానని తెలిపారు. ఆఖరికి తాను లిక్కర్‌ కేసులో జైలు నుంచి బయటపడాలంటే బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనను సైతం తిరస్కరించారని వివరణ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించి తాను తన తండ్రికి రాసిన లేఖను కొందరు దెయ్యాలు కావాలనే బయటపెట్టారనీ, మీడియాకు లీకులిచ్చారనీ కవిత వాపోయారు.

తీన్మార్‌ మల్లన్నను ఉసిగొలిపి పొడుగ్గా ఉన్న నాయకుడొకరు తనపై విమర్శలు చేయించారంటూ హరీశ్‌రావు నుద్దేశించి ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో తీన్మార్‌ చేసిన కామెంట్లను ఖండిస్తూ పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య ‘తెలంగాణ భవన్‌’కు, కవితకు దూరం బాగా పెరిగింది. ప్రతీయేటా తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టే కవితకు, కేటీఆర్‌ ఈసారి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. తాను ఇంటికి వచ్చి రాఖీ కడతానన్న… కేటీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఆందుబాటులో లేకుండా పోయారని ఆమె కంటతడి పెట్టుకున్నారు. తాజాగా అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న రోజే (సోమవారం) ఆమె… కాళేశ్వరం ప్రాజెక్టు, దానిపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించటం తదితరాంశాలపై ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ జోగినేపల్లి సంతోశ్‌కుమార్‌, మెగా కృష్ణారెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వారి ముగ్గురి వల్లే తన తండ్రి కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే పార్టీ నుంచి ఆమె బహిష్కరణకు కారణమైంది.

హరీశ్‌, సంతోశ్‌లపై ఆరోపణలు గుప్పించటం ద్వారా కవిత… కాళేశ్వరం వ్యవహారంలో అవినీతి జరిగిందనే విషయాన్ని నిర్దారించా రంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అధికార కాంగ్రెస్‌కు ఊతమిచ్చే విధంగా సొంత పార్టీ మనిషే ఇలా మాట్లాడితే… అది అంతిమంగా అధినేతకు, పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందంటూ కేసీఆర్‌ ఆగ్రహించారు. అందుకే కవితను సస్పెండ్‌ చేసేందుకు ఆయన నిర్ణయిం చుకున్నారని తెలంగాణ భవన్‌ వర్గాలు తెలిపాయి.

మరోవైపు కవితపై బహిష్కరణ వేటు, తదనంతర పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారనీ, దాని పేరు తెలంగాణ భారత జాగృతి సమితి అనే ఊహాగానాలు కూడా ఉపందుకున్నాయి. కాదు.. కాదు.. ఆమె కాంగ్రెస్‌ లోకో, బీజేపీలోకో వెళతారనే వాదనలూ కొనసాగుతున్నాయి. కాగా కొద్ది నెలల క్రితం తెలంగాణ జాగృతి కోసం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కవిత, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి కొద్ది దూరంలోనే మరో కార్యాలయాన్ని కొనుగోలు చేసి, మరమ్మతులు చేయించారు. ఒకవేళ పార్టీ నుంచి తనను బహిష్కరిస్తే, అప్పుడు కొత్త పార్టీ పెట్టాల్సి వస్తే, అందుకు ఆఫీసు అవసరమవుతుందని ముందుగానే కవిత ఊహించారు. అందుకే ఒక భవనాన్ని కొనుగోలు చేశారని వినికిడి. అంతిమంగా ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి.. మున్ముందు అవి ఎవరికి లబ్ది చేకూరుస్తాయనేది వేచి చూడాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad