Friday, March 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆధునిక బానిసత్వం!

ఆధునిక బానిసత్వం!

- Advertisement -

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే సామాజిక భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి చిహ్నం. కానీ నేడు ”నయా ఉదారవాద” ఆర్థిక విధానాల నేపథ్యంలో, ప్రభుత్వ రంగాలు సైతం లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి.ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ‘కాంట్రాక్టు అండ్‌ అవుట్‌సోర్సింగ్‌’ విధానం. తక్కువ వేతనానికి ఎక్కువ పనిని పిండుకోవడం, ఎటువంటి సామాజిక భద్రత కల్పించకపోవడం వంటి లక్షణాలతో ఉన్న ఈ వ్యవస్థను నేడు మేధావులు, కార్మిక సంఘాలు ”ఆధునిక బానిసత్వం”గా పరిగణిస్తున్నాయి.

సాంప్రదాయ బానిసత్వంలో మనిషిని కొనుగోలు చేసేవారు. ఆధునిక బానిసత్వంలో మనిషి శ్రమను అత్యంత చౌకగా కొనుగోలు చేస్తూ, అతని ప్రాథమిక హక్కులను కాలరాస్తారు. కాంట్రాక్టు విధానంలో కార్మికుడికి ఉద్యోగ భద్రత ఉండదు. ఎప్పుడు తీసేస్తారో తెలియని భయం.సమాన పనికి సమాన వేతనం ఉండదు,రెగ్యులర్‌ ఉద్యోగితో సమానంగా పనిచేసినా, అందులో మూడో వంతు వేతనం కూడా అందదు. సంక్షేమ పథకాలు దూరం చేసి ,పెన్షన్‌, గ్రాట్యుటీ, వేతనంతో కూడిన సెలవులు వంటి సౌకర్యాలు మృగ్యమవుతాయి.ప్రస్తుతం ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో కాంట్రాక్టు విధానం ప్రధానంగా నాలుగు రూపాల్లో అమలులో ఉంది. వీటిని సామాజిక, ఆర్థిక కోణాల్లో ఈ విధంగా విభజించవచ్చు.

1.అవుట్‌సోర్సింగ్‌ విధానం: ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్కులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డుల కోసం దీన్ని వాడుతున్నారు. ప్రభుత్వం ఒక థర్డ్‌ పార్టీ ఏజెన్సీకి కాంట్రాక్టు ఇస్తుంది. ఆ ఏజెన్సీ కార్మికులను నియమిస్తుంది. ప్రభుత్వమిచ్చే జీతంలో ఏజెన్సీ కమిషన్‌ తీసుకోవడం వల్ల కార్మికుడికి తక్కువ వేతనం అందుతుంది.
2.ఒప్పంద నియామకాలు: నిర్దిష్ట కాల పరిమితి (ఉదాహరణకు 11 నెలలు లేదా ఒక ఏడాది) కోసం నేరుగా ప్రభుత్వమే అభ్యర్థులను ఒప్పందంపై తీసుకుంటుంది.వైద్యారోగ్యం (డాక్టర్లు, నర్సులు),విద్య (గెస్ట్‌ ఫ్యాకల్టీ), సాంకేతిక రంగాల్లో ఇది ఎక్కువగా ఉంది.వీరికి పర్మనెంట్‌ ఉద్యోగులతో సమానంగా బాధ్యతలు ఉంటాయి.కానీ, సెలవులు లేదా ఇతర ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి.
3.పీస్‌ రేట్‌ లేదా వర్క్‌ ఆర్డర్‌: ఇది నిర్మాణ, తయారీ రంగంలో కనిపిస్తుంది. పని పరిమాణాన్ని బట్టి (ఉదాహరణకు ఎన్ని ఇటుకలు పేర్చారు లేదా ఎన్ని షర్టులు కుట్టారు) డబ్బులు చెల్లిస్తారు.?పని త్వరగా పూర్తి చేయడానికి కార్మికులు తమ ఆరోగ్యానికి మించి పని చేయాల్సి వస్తుంది.
4.గిగ్‌ ఎకానమీ / ప్లాట్‌ఫారమ్‌ వర్క్‌: ఇది ప్రస్తుత కాలంలో వచ్చిన కొత్త రూపం. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్‌ వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బార్సు, డ్రైవర్లు దీని కిందకు వస్తారు.ఇక్కడ పని చేసేవారిని ”ఉద్యోగులు” అని పిలవరు, ”పార్టనర్లు” అంటారు. దీనివల్ల కంపెనీలు వారికి ఎటువంటి బీమా లేదా పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉండదు.

ప్రభుత్వ వైఖరి – ద్వంద్వ ప్రమాణాలు
ప్రభుత్వం ఒకవైపు ‘అందరికీ గౌరవప్రదమైన ఉపాధి’ అని నినాదాలు చేస్తూనే, మరోవైపు తన సొంత విభాగాల్లో కాంట్రాక్టు వ్యవస్థను పెంచి పోషిస్తోంది. 1970 నాటి ‘కాంట్రాక్టు కార్మిక (నియంత్రణ రద్దు) చట్టం’ ప్రకారం కష్ట స్వభావం, భవిష్యత్‌ నిర్మాణం ఉన్న పనుల్లో కాంట్రాక్టు కార్మికులను నియమించకూడదు. కానీ, రైల్వేలు, విద్యుత్‌ శాఖ, పారిశుధ్యం, విద్య, ఆరోగ్య శాఖల్లో సైతం పదేళ్ల పైబడి కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ చర్య ప్రభుత్వమే చట్టాన్ని తుంగలో తొక్కడం కాదా? ఇటీవల కేంద్ర సర్కార్‌ తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లు కార్మికుల హక్కులను మరింత బలహీనపరిచాయి.

‘ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌’ పేరుతో శాశ్వత ఉద్యోగాలను రద్దు చేసి, అందరినీ కాంట్రాక్టు పరిధిలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది యజమానులకు ‘హైర్‌ అండ్‌ ఫైర్‌’ (కావాలన్నప్పుడు తీసుకోవడం, వద్దనుకున్నప్పుడు తీసేయడం) అధికారాన్ని కట్టబెడతుంది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం, గత దశాబ్ద కాలంగా ప్రభుత్వరంగంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య నలభై శాతానికి పైగా పెరిగింది. ఒకే పనిచేస్తున్న రెగ్యులర్‌ కార్మికుడికి రూ.40వేలు వస్తుంటే, కాంట్రాక్టు కార్మికుడికి రూ.12వేలు మించి అందడం లేదు. ముఖ్యంగా పారిశుధ్యం, విద్యుత్‌ లైన్మెన్‌ వంటి ప్రమాదకర పనుల్లో మరణిస్తున్న వారిలో తొంభైశాతం మంది కాంట్రాక్టు కార్మికులే. వీరికి ఎటువంటి బీమా సౌకర్యం లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.

సామాజిక,ఆర్థిక ప్రభావాలు
ఈ బానిసత్వ విధానం వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.భవిష్యత్తుపై ధీమా లేకపోవడంతో కార్మికులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.ఆర్థిక సంపద అంతా కొద్దిమంది కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్తోంది, శ్రమించే వాడు పేదరికంలోనే మగ్గుతున్నాడు.ఉద్యోగ భద్రత లేని చోట కార్మికుడు పూర్తి అంకితభావంతో పనిచేయలేడు, ఇది సేవల నాణ్యతను దెబ్బతీస్తుంది. ప్రభుత్వం తనను తాను ”సంక్షేమ రాజ్యం” అని చెప్పుకుంటున్నప్పుడు, తన పౌరులను బానిసలుగా మార్చే హక్కు దానికి లేదు.

కాంట్రాక్టు విధానమనేది ఒక ఆర్థిక అవసరం కాదు, అది ఒక రాజకీయ వైఫల్యం. ప్రభుత్వం పదేళ్లు దాటిన కాంట్రాక్టు కార్మికులందరినీ తక్షణమే రెగ్యులరైజ్‌ చేయాలి.”సమాన పనికి సమాన వేతనం” సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలి.అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల దోపిడీని అరికట్టడానికి ‘నేరుగా చెల్లింపు’ పద్ధతిని ప్రవేశపెట్టాలి. ఇప్పటికైనా ఈ ఆధునిక బానిసత్వ సంకెళ్లను తెంచకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన కార్మిక పోరాటాలు తప్పవు.

జుర్రు నారాయణ యాదవ్‌
9494019270

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -