పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ సమావేశం
పెట్రోలియం, విద్యుత్, ఎరువులపై చర్చ
సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
హాజరైన రాజ్‌నాథ్, అమిత్ షా, నడ్డా, పలువురు మంత్రులు
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో భారత్‌లో ఇంధన సంక్షోభం ఆందోళన కలిగిస్తున్నది. ఈ తరుణంలో ప్రధాని మోడీ.. పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువుల రంగాల స్థితిగతులపై వారితో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, శివరాజ్‌సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పురి, సర్బానంద సోనోవాల్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా నిరంతర సరఫరా, సమర్థ పంపిణీపై మంత్రులతో ప్రధాని మోడీ చర్చించారు. గ్యాస్, పెట్రోల్ , ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలన్న ప్రధాని.. సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం పరిశీలిస్తోందని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలో ఉంచుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ చాలా తక్కువ నౌకలను మాత్రమే దీని గుండా అనుమతిస్తోంది. ఈ దిగ్బంధం వల్ల భారత్ సహా అనేక దేశాలకు ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి, సరఫరా ఒత్తిళ్లను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సిటీ గ్యాస్ ప్రాజెక్టుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూనే, కీలక రంగాలకు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను పెంచింది.
పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్‌జీ) సరఫరాను పెంచేందుకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ దరఖాస్తులను 10 రోజులలోపు పరిష్కరించాలని పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) ఆదేశించింది. ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, పీఎన్‌జీకి మారాలని పట్టణ, నగరాల్లోని వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు సూచించింది. అటు ఎల్పీజీకి సంబంధించి ఇప్పటికే పునరుద్ధరించిన 20 శాతానికి అదనంగా మార్చి 18న మరో 10 శాతం, మార్చి 21న మరో 20 శాతం కేటాయింపులు పెంచారు. ఫలితంగా సరఫరా 50 శాతానికి చేరింది. హోటళ్లు, రెస్టారెంట్లు, డైరీ పరిశ్రమలు, కమ్యూనిటీ కిచెన్‌లు, విద్యా సంస్థలకు సరఫరాలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డొమెస్టిక్ వంట గ్యాస్ సరఫరా స్థిరంగా ఉందని, ఎక్కడా కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. భయాందోళనలతో చేసే బుకింగ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వం పేర్కొంది.



