Tuesday, May 20, 2025
Homeరాష్ట్రీయంభరతజాతిని బంధనాల్లోకి లాగుతున్న మోడీ

భరతజాతిని బంధనాల్లోకి లాగుతున్న మోడీ

- Advertisement -

– సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.సుధా భాస్కర్‌
– 40వ వర్థంతి సందర్భంగా ”సమకాలీన పరిస్థితులు-మన కర్తవ్యం”పై సెమినార్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

ప్రజా సమస్యలను గాలికొదిలేసి భరత జాతిని మళ్లీ బంధనాల్లోకి లాగుతున్న ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై.. విప్లవం కోసం జీవితాన్ని త్యాగం చేసిన పుచ్చలపల్లి సుందరయ్య అందించిన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.సుధాభాస్కర్‌ చెప్పారు. సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం సంగారెడ్డి జిల్లా కేవల్‌ కిషన్‌ భవన్‌లో ‘సమకాలీన పరిస్థితులు-మన కర్తవ్యం’ అనే అంశంపై సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అధ్యక్షతన సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాభాస్కర్‌ మాట్లాడుతూ.. భూములు, జలవనరులు, వ్యవసాయ రంగం, రాజకీయాలను సమగ్ర దృక్పథంతో సుందరయ్య అధ్యయనం చేయడమే కాకుండా నిశితమైన పరిశీలన చేసి పోరాటాలకు రూపకల్పన చేశారన్నారు. బాల్యంలోనే దళితుల్ని ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టి, వారితో కలిసి భోంచేయడం ద్వారా సామాజిక రుగ్మతలపై పోరాటానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వ్యవసాయ సంబంధాల్లో ఏమేమీ మార్పులొస్తున్నాయో అధ్యయనం చేసిన సుందరయ్య.. భూస్వాములు, ధనిక రైతులు, సన్నకారు రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కూలీలున్నట్టు ఆ రోజుల్లోనే అంచనా వేశారని అన్నారు. వ్యవసాయ కూలీల సమస్యలను గుర్తించి తన ఊరి నుండే కూలిరేట్ల పోరాటం నడిపారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులేమిటో అధ్యయనం చేసి సమస్యలపై కేంద్రీకరించి పని చేయాల్సిన అవసరముందన్నారు. నిజాం దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రమహాసభ నింపిన చైతన్యంతో 1946-52 వరకు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఏటేటా నిరుద్యోగం పెరుగుతోందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారనీ తద్వారా దేశ భవిష్యత్‌ కూడా నీరుగారి పోతుందని అన్నారు. ఉపాధి కోసం యువత, నల్ల చట్టాల రద్దు కోసం రైతులు, లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం కార్మికులు పెద్దఎత్తున పోరాటాలు నడుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశం, అతిమేల మాణిక్‌, ఎం.నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.యాదగిరి, ప్రవీణ్‌కుమార్‌, కృష్ణ, నాయకులు అశోక్‌, కె.రాజయ్య, మహేష్‌, రాజేష్‌, అర్జున్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -