అమెరికాముందు మోకరిల్లుతున్నారు
కేంద్రం లక్ష్యం కార్పొరేట్ల ప్రయోజనాలే
దేశంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలు : ఎస్వీకే వద్ద పంద్రాగస్టు వేడుకల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎందరో వీరుల త్యాగఫలమే దేశానికి స్వాతంత్య్రమనీ, ఆ పోరాట స్ఫూర్తికి భిన్నంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో వెస్లీ మాట్లాడారు. 200 ఏండ్ల బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, అల్లూరి సీతారామారాజు వంటి ఎందరో వీరులు దేశ స్వతంత్య్రం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన సంస్థకు బద్ధుడైన నరేంద్రమోడీ ఇప్పుడు ప్రధాని స్థానంలో ఉండి, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేయటం శోచనీయమని అన్నారు. 79ఏండ్ల స్వతంత్ర భారతంలో ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద దేశమైన అమెరికాకు మోకరిల్లడం దేశ సార్వభౌమత్వానికీ, స్వతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. రష్యా నుంచి అయిల్ దిగుమతి చేసుకోవడాన్ని ఆపేయాలనీ, లేదంటే దిగుమతులపై 50శాతం సుంకాలను విధించక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు మోడీ మెతక వైఖరే కారణమని విమర్శించారు. 140 కోట్లమంది ప్రజలు కాలర్ ఎగరేసుకునే విధంగా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడికి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.
పహల్గాం ఘటన అనంతరం 22 నిముషాల్లో పాకిస్తాన్‌పై దాడి చేసి ఉగ్రవాద స్థావరాలను ద్వంసం చేశామని ఎర్రకోట సాక్షిగా మోడీ చెబుతున్నారనీ, ఆ యుద్ధాన్ని నేనే అపానని ట్రంప్ పదేపదే ప్రకటిస్తుంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు దీనిపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని సోషలిజం పదాన్ని తొలగించాలని బీజేపీ పరివారం డిమాండ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 80శాతం హిందూవులున్నారనీ, వారందరి ఓట్లను కన్సాలిడేట్ చేసుకునేందుకు కావాల్సిన ప్రాతిపదికలను ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసుకుంటున్నారని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలతో మనుధర్మాన్ని తీసుకొస్తున్నారనీ, వాటి ఆధారంగా స్త్రీ, పురుష, కుల అసమానతలను స్థిరపర్చాలనే కుట్ర సాగుతున్నదన్నారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించేందుకు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అర్థం చేసుకుని స్వాతంత్య్రపోరాట స్ఫూర్తితో దేశ భక్తియుత ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఎస్ వినయకుమార్ మాట్లాడుతూ దేశంలో మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఓటు హక్కు ఉంటుందా? లేదా? అనే మీ మాంస కొనసాగుతున్నదన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో బీహార్‌లో 65లక్షల ఓట్లను తొలగించారని గుర్తు చేశారు. స్వతంత్ర సంస్థలైన ఈసీ, సీబీఐ,ఈడీ లాంటి సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయని విమర్శించారు. దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయన్నారు. ఫూలే, అంబేద్కర్ ఊహించినదానికంటే ప్రమాదకరంగా పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్వీకే మేనేజింగ్ కమిటి సభ్యులు జి బుచ్చిరెడ్డి, బాలోత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్ సోమయ్య, రమణారావు తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర స్ఫూర్తికి భిన్నంగా మోడీ విధానాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES