Sunday, November 2, 2025
E-PAPER
Homeజాతీయంధనబలం వర్సెస్‌ ప్రజాబలం

ధనబలం వర్సెస్‌ ప్రజాబలం

- Advertisement -

హయాఘాట్‌లో బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై సీపీఐ(ఎం) అభ్యర్థి శ్యామ్‌ భారతి పోటీ
న్యూఢిల్లీ :
బీహార్‌లోని హయాఘాట్‌లో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామచంద్ర ప్రసాద్‌కు, మహాగట్బంధన్‌ పక్షాన సీపీఐ(ఎం) నుంచి పోటీచేస్తున్న శ్యామ్‌ భారతి మధ్య ధనబలం వర్సెస్‌ ప్రజాబలం అన్నట్టుగా పోటీ నెలకొంది. 2020లో విజయం సాధించిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిన రామచంద్ర ప్రసాద్‌ ఆ తర్వాత ఏనాడూ నియోజకవర్గం వైపు ముఖం కూడా చూపలేదు. దీంతో అక్కడి ప్రజానీకంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం మందబలంతో రాగా ప్రజలు ఎక్కడికక్కడే తరిమికొట్టే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని అథర్‌ గ్రామంలో ఓట్లు అడగడానికి వెళ్లిన రామచంద్ర ప్రసాద్‌పై స్థానికులు దాడి చేసి వెంబడించారు. చుట్టుముట్టి దొంగ, అబద్ధాలకోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోపం కారణంగా బీజేపీ అభ్యర్థి ఎక్కడా ఓట్లు అడగలేక ఉడాయించారు’ అని శ్యామ్‌ భారతి పక్షాన ప్రచారంలో పాల్గొన్న గ్రాడ్యూయేట్‌ విద్యార్థి నవీన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా ఆ విద్యార్థి మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ సారి హయాఘాట్‌లో డబ్బుకు, ప్రజల శక్తికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోందన్నారు. బహదూర్‌పూర్‌లో ప్రచారం సాగిస్తున్న శ్యామ్‌ భారతి మీడియాతో మాట్లాడుతూ ”నేను చాలా సాధారణ వ్యక్తిని. నా విద్యార్థి దశ నుంచి, నేను పార్టీలో భాగంగా దళితులు, వెనుకబడిన తరగతుల కోసం పనిచేశాను. భూమి, సామాజిక న్యాయం కోసం పోరాటంలో భాగంగా నేను జనరల్‌ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. పార్టీ నాపై గొప్ప నమ్మకం ఉంచింది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంతో నేను ఈ ఎన్నికల్లో గెలుస్తాను” అని అన్నారు. శ్యామ్‌ భారతి పక్షాన ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల తరపున గళం వినిపించే శ్యామ్‌ భారతిని భారీ మెజారిటీలో గెలిపించాలని ఆయన కోరారు.

హయాఘాట్‌ను పీడిస్తున్న పెద్ద సమస్య ప్రభుత్వ రంగంలోని అశోక్‌ పేపర్‌ మిల్స్‌ మూసి వేయడం. 22 ఏండ్లుగా ఇది పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. దాదాపు 5,000 మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్ధ మూత పడటంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2010, 2015ల్లో జేడీయూ, బీజేపీ మిల్లును తెరుస్తామని హామీ ఇచ్చి ఇక్కడి నుంచి గెలిచాయి. అయితే, ఇంత కాలం గడిచినా మిల్లును తెరవడానికి ప్రయత్నాలేవీ జరగలేదు. బాగ్మతి నదిలో వరదలు వచ్చినప్పుడు, ఇక్కడ చాలా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. అయినా కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. జేడీయూ, బీజేపీ తమ వాగ్దానాలను నిలబెట్టుకోని పరిస్థితిలో ప్రజలకు సీపీఐ(ఎం) పైనే ఆశ ఉంది. ఎన్నికల కార్య కలాపాలను పర్యవేక్షిస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి లాలన్‌ చౌదరి స్పందిస్తూ పార్టీ అన్ని తరగతుల మద్దతుతో గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -