మార్కెట్లలో అమ్మకాల వెల్లువ
82 వేల దిగువకు సెన్సెక్స్
ముంబయి : ఇటీవల కొన్ని రోజులుగా జోష్‌లో ఉన్న దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం అమ్మకాల వెల్లువ చోటు చేసుకుంది. అమెరికా పరపతిని తగ్గిస్తూ మూడీస్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో పాటు ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 82 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం 82,116.17 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ ఇంట్రాడేలో 81,153.70 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తుదకు 873 పాయింట్ల నష్టంతో 81,186కు పడిపోయింది. నిఫ్టీ 262 పాయింట్ల నష్టంతో 24,683.90 వద్ద ముగిసింది. దీంతో వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టాలు చవి చూసినట్లయ్యింది. మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయని బ్రోకర్లు తెలిపారు. సెన్సెక్స్-30లో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఆటో సూచీ 2 శాతానికి పైగా నష్టపోగా, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్ 100 సూచీ 1.62 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.94 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3.50 లక్షలు కోట్లు క్షీణించి రూ.440.23 లక్షల కోట్లకు తగ్గింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండిస్టీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ వంటి లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అమెరికా ప్రభుత్వ అప్పులపై ఆందోళన నేపథ్యంలో యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో అక్కడి 30 ఏండ్ల బాండ్ రాబడులు 2023 నవంబర్ తర్వాత గరిష్ఠ స్థాయి అయిన 5.03 శాతానికి చేరాయి. బాండ్ రాబడులు పెరగడంతో భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు లిక్విడిటీ తగ్గొచ్చన్న భయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతుండడం కూడా మార్కెట్‌లపై విశ్వాసాన్ని దెబ్బతీసింది.
దలాల్ స్ట్రీట్‌కు మూడీస్ దెబ్బ
- Advertisement -
- Advertisement -