Wednesday, December 10, 2025
E-PAPER
Homeమానవిపోష‌కాల గ‌ని మోరంగడ్డ...

పోష‌కాల గ‌ని మోరంగడ్డ…

- Advertisement -

చలికాలంలో దొరికే వాటిల్లో మోరంగడ్డ ఒకటి. ఈ కాలంలో వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తియ్యటి ఈ దుపంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే మోరంగడ్డలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. తద్వారా మల బద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇది జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్‌ బి6 మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న మోరంగడ్డతో చేసే కొన్ని వంటకాల గురించి ఈరోజు తెలుసుకుందాం

జామున్లు
కావల్సిన పదార్థాలు: మోరంగడ్డ – అరకిలో, పంచదార – రెండు కప్పులు, కుంకుమ పువ్వు – కొద్దిగా, మిల్క్‌ పౌడర్‌ – అర కప్పు, యాలకుల పొడి – చెంచా, నెయ్యి – రెండు చెంచాలు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: పంచదారకు రెండు కప్పుల నీళ్లు, సగం యాలకుల పొడి, కుంకుమపువ్వు జతచేసి మరిగించి పాకం చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఈలోగా మోరంగడ్డలను ఉడికించి, పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులో మిల్క్‌ పౌడర్‌, నెయ్యి, మిగిలిన యాలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమంలో నిమ్మకాయంత ఉండలు లేదా కాస్త వెడల్పుగా డోనట్స్‌లా చేసి కాగుతున్న నూనెలో వేయించాలి. బంగారు రంగులోకి మారాక పంచదార పాకంలో వేస్తే టేస్టీ జామున్లు రెడీ.

పూరీ
కావల్సిన పదార్థాలు: మోరంగడ్డ – రెండు, గోధుమపిండి – రెండు కప్పులు, గోరువెచ్చని నీళ్లు – సరిపడా, మైదాపిండి – టేబుల్‌ స్పూను, కొత్తిమీర తురుము – రెండు టేబుల్‌ స్పూను, కారం – టీ స్పూను, పసుపు – చిటికెడు, గరం మసాలా – టీ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా.
తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకోవాలి. అందులో బాగా ఉడకబెట్టి గుజ్జు చేసుకున్న మోరంగడ్డ, గోధుమపిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, గరంమసాలా, ఉప్పు, కారం, పసుపు, అరటీ స్పూను నూనె వేయాలి. దాన్ని గోరువెచ్చని నీళ్లతో మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుని నూనె అప్లై చేసి చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తర్వాత కళాయిలో నూనె వేడి చేసి పూరీలను దోరగా వేయించుకోవాలి.

పచ్చడి
కావల్సిన పదార్థాలు: మోరంగడ్డ ముక్కలు – కప్పు (ఉడికించి తొక్క తీసినవి), మామిడి కాయ ముక్కలు – అరకప్పు, పచ్చిమిర్చి – రెండు, ఉప్పు – రుచికి సరిపడా.
తాలింపుకోసం: నూనె, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు.
తయారు చేసే విధానం: ఉడికించిన మోరంగడ్డ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పును మిక్సీ జార్‌లో వేసి మెత్తగా కాకుండా, కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న మోరంగడ్డ మిశ్రమంలో ఈ తాలింపు వేసి బాగా కలపాలి. అంతే పచ్చడి రెడీ.

హల్వా
కావల్సిన పదార్థాలు: మోరంగడ్డ – అర కిలో, నెయ్యి – టీ స్పూను, జీడిపప్పు – కొద్దిగా, బాదంపప్పులు – కొద్దిగా, కిస్మిస్‌ – కొద్దిగా, నూనె లేదా నెయ్యి – టేబుల్‌ స్పూను, కాచి చల్లార్చిన పాలు – కప్పు, పంచదార – పావుకప్పు, కుంకుమపువ్వు – చిటికెడు (అవసరమనుకుంటేనే).
తయారు చేసే విధానం: ముందుగా మోరంగడ్డను శుభ్రంగా కడిగి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసి వాటిని సన్నగా తురుముకోవాలి. ఒక పాన్‌లో టీ స్పూను నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి తురిమిన మోరంగడ్డను వేసి వేయించాలి. ఇందులోనే కాచి చల్చార్చిన పాలు పోసి బాగా కలిపి ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసి బాగా కలపాలి. తర్వాత కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలిపి చివరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ను ఇందులో వేసి బాగా కలపాలి. అంతే మోరంగడ్డ హల్వా రెడీ.

బోండాలు
కావల్సిన పదార్థాలు: మోరంగడ్డలు, ఇడ్లీ పిండి, బియ్యం పిండి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, చక్కెర, ఆయిల్‌.
తయారీ విధానం: ముందుగా మోరంగడ్డల్లో ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఉడికాక.. తొక్క తీసి గిన్నెలో వేయాలి. మోరంగడ్డలు చల్లగా అయ్యాక మెత్తగా మెదుపు కోవాలి. ఆ తర్వాత ఇందులో కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, పంచదార వేసి చేతితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరో పాత్ర తీసుకోవాలి. ఇడ్లీ పిండిని చిక్కగా కలుపుకోవాలి. అవసరం అయితే.. బియ్యం పిండి కలుపుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి.
ఆ తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్‌ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక.. మోరంగడ్డలను ఇడ్లీ పిండి లో ముంచుకుని.. ఆయిల్‌లో వేసుకో వాలి. ఒక నిమిషం ఆగాక.. వాటిని అటూ ఇటూ తిప్పాలి. అలా గోల్డెన్‌ కలర్‌లోకి మారేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మోరంగడ్డ బోండాలు సిద్ధం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -