– ఇందిరా మహిళాశక్తితో పేదరిక నిర్మూలన
– మహిళలు ఆర్థికంగా ఎదగాలి : సరస్ మేళా ప్రారంభంలో మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్ మాదిరిగానే హైదరాబాద్‌లో మరిన్ని స్థలాలను మహిళా సంఘాలకు కేటాయిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో సరస్ మేళను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాలల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి, మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభ, వ్యవసాయ కమిషన్ సభ్యులు భవాని రెడ్డి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, అదనపు సీఈవో కాత్యాయిని, స్త్రీనిధి ఎమ్‌డీ విద్యాసాగర్ రెడ్డి, డబ్ల్యూఈ-హబ్ సీఈవో సీతా పల్లచోళ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంగణంలో తెలంగాణ చరిత్ర, పోరాటాలకు సంబంధించిన కళారూపాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళా సంఘాలకు లోన్లు సులభంగా అందజేస్తున్న పలువురు బ్యాంకర్లను సన్మానించారు. స్టాళ్లను సీతక్క స్వయంగా సందర్శించారు. మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
ప్రారంభ సభనుద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం తమ సంకల్పమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామనీ, ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రూ. 27 వేల కోట్ల రుణాలను సమకూర్చామని వెల్లడించారు. 98 శాతం మహిళలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తుండటంతో బ్యాంకులు మరింత ఉత్సాహంతో సహకరిస్తున్నాయని చెప్పారు. నారాయణపేటలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును విజయవంతంగా నడుపుతోందని, ఆరు నెలల్లో రూ. 13.7 లక్షల ఆదాయం సంపాదించిందని ప్రశంసించారు. సోలార్ పవర్ ప్రాజెక్టులు, పలు వ్యాపారాలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నా మనీ, మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందని చెప్పారు. బ్యాంకుల రుణాల ద్వారా వడ్డీ వ్యాపారుల దోపిడీని అడ్డుకున్నామని, మహిళా సంఘాలు క్రమశిక్షణ, నమ్మకానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లో మహిళా సంఘాలకు మరిన్ని స్థలాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES