అమ్మ అంటే ఆలనా.. అమ్మ అంటే ఆప్యాయత.. అమ్మ అంటే అనురాగం.. అమ్మ పేమ్ర అనంతం.. అమ్మ కరుణ అపారం.. అమ్మ అనే భావం అనిర్వచనీయం.. అలసిన మనసుకు స్వాంతన ఇచ్చేది అమ్మ. ఈ సృష్టి ఆవిర్భవించిందంటే దానికి కారణం అమ్మ. పుట్టెడు దు:ఖం తనని పిండేస్తున్నా గుండెల్లోనే దాచుకుని పిల్లలను పయ్రోజకులను చేసేందుకు తపిస్తుంది అమ్మ. పిల్లల భవిష్యత్తే తన కర్తవ్యంగా బతికేస్తుంది. వాళ్లు ఎదుగుతుంటే చూసి ఆనందిస్తుంది. అలాంటి తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భం చుట్టూ ఆవరించి తల్లి మాట్లాడే మాటల ద్వారా శబ్దాన్ని వినడం ప్రారంభిస్తాడు. స్త్రీ తల్లి అవ్వడానికి, వివాహ వ్యవస్థకి ఒక అవినాభావన సంబంధం ఉంది. వివాహం తర్వాత స్త్రీ ఒక పురుషుడికి భార్య అవుతుంది. భార్యస్థానం నుండి తల్లి స్థానం పొందుతుంది. నవమాసాలు బిడ్డను మోసి జన్మనిస్తుంది. బిడ్డ ఆలనాపాలన చూసుకునే క్రమంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది. నిజానికి వివాహానికి ముందు ప్రతి స్త్రీ పుట్టింట్లో ఎంతో సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర ప్రతి స్త్రీ ఓ చిన్నపిల్లే. తనకు నచ్చినట్టుగా ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర తనకు నచ్చినట్టుగా ఉండే స్త్రీ రెండు విషయాల్లో మాత్రం తనకు నచ్చినట్టుగా ఉండలేదు. అందులో ప్రధానంగా.. భవిష్యత్ ప్రణాళికను రచించుకుని ముందుకు వెళ్ళలేకపోవడం, అనుకున్న రంగంలో రాణించకముందే వివాహం చేసుకోవడం. ఇవే ఆమె భావి జీవితానికి అనేక ఆటంకాలను సృస్టిస్తున్నాయి. తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా స్త్రీ ఎన్నో కలలు కంటుంది. బాగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగం పొంది జీవితంలో స్థిరపడిన తర్వాతనే వివాహం గురించి ఆలోచన చేయడం. కానీ ఎంతమంది స్త్రీల ఆశయాలు నెరవేరుతున్నాయనేది సమాజంలో మొదలయ్యే ప్రశ్న?
పెండ్లయ్యాక బాధ్యతలు
పెండ్లయ్యాక స్త్రీకి బాధ్యతలు పెరుగుతాయి. కొందరు స్త్రీలు గృహిణిగా ఉంటే, మరికొందరు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం, ఇల్లు సమన్వయం సాధ్యం కాక ఇంటి బాధ్యతలకే పరిమితం కావాలంటే ఒకపక్క భర్తకు వచ్చే చాలీ చాలని జీతం. మరోపక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు. గతంలో వలె పది-ఇరవై వేల జీతంతో బతికే రోజులు పోయాయి. అంతకంటే ఎక్కువ సంపాదన ఉన్నా ఇల్లు గడవడం కష్టంగా మారుతోంది. దాంతో ఆమె కూడా ఉద్యోగం చేయక తప్పడం లేదు. అందుకే ఓ తల్లిగా, భార్యగా, ఉద్యోగిగా ఎన్నో బాధ్యతలను మహిళలు మోస్తున్నారు.
ఇంటికి దిక్కు తల్లే
మొదటి నుండి ఇంటికి పెద్దదిక్కుగా తల్లినే చెప్పాలి. ఎందుకంటే వివాహం జరిగి అత్తింటికి వెళ్ళాక వరకట్న వేధింపులతో ఒంటరిగా జీవించే మహిళలు, అనుకోని ప్రమాదంలో భర్తను కోల్పోయిన వారు, భర్త మద్యానికి బానిసవ్వడం, లైంగిక వేధింపులకు గురవ్వడం ఇలాంటి అనేక కారణాల వల్ల మాతృమూర్తులే పిల్లల బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇలాంటి కుటుంబాలు నేడు వేలల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాను ఎన్ని ఇబ్బందులు పడినా పిల్లలకు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకునేందుకు తపిస్తుంది. వారిని ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయిలో స్థిరపడేందుకు తన సర్వస్వాన్నీ త్యాగం చేస్తుంది. తన ఆనందాలన్నింటినీ మర్చిపోతుంది.
తల్లిని లెక్క చేయకపోవడం
అమ్మ ఎన్నో త్యాగాలు చేస్తేనే మనం ఈ స్థాయిలో ఉన్నాము. కానీ మన ఉన్నతమైన జీవితాలకు ఆధారమైన తల్లిని నేటి పిల్లలు ఎందుకు లెక్కచేయడం లేదు. తల్లి అందించిన అపురూపమైన ప్రేమను పిల్లలు తిరిగి అందిస్తున్నారా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. చాలా మంది తల్లులు పిల్లల ప్రేమను పొంద లేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరూ అని ఆలోచిస్తే.. ఈ కింది అంశమే ప్రధాన కారణమని భావించవచ్చు.
అతి గారాబం
చిన్నప్పటినుంచే పిల్లలు తల్లిదండ్రుల గారాబంలో పెరుగుతారు. అతి గారాబం పిల్లలను విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడేలా చేస్తుంది. తాను కోరుకున్నది కావాలని పిల్లలు తల్లిని అడిగినప్పుడు కాదనకుండా కొనిస్తుంది. ఆ వస్తువును కొనివ్వడానికి డబ్బు ఎలా వస్తుంది? ఆ డబ్బు రావడానికి ఎంత కష్టపడాలి? అసలు విలువలంటే ఏమిటి? ఇలాంటి విషయాలన్ని తల్లిదండ్రుల పెంపకంలో తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా నేను పడ్డ కష్టం నా పిల్లలకు రావొద్దు అని తల్లి భావిస్తుంది. పిల్లలు కష్టపడకూడదనే ఏ తల్లి అయినా భావిస్తుంది. అది నూటికి నూరు శాతం నిజం. కానీ పిల్లలకు కష్టం విలువ తెలియకుండా పెంచాలనుకుకోవడం పొరపాటు అవుతుంది. దీని వల్ల పిల్లలు సుఖాలకు అలవాటు పడి సొంతకాళ్ళ మీద నిలబడే ఆలోచనను కోల్పోతారు. తాము అనుకున్నది సాధించుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ముఖ్యంగా బాంధవ్యాలకు దూరమై తల్లిదండ్రులను వదిలిపెట్టి డబ్బునే ప్రేమిస్తారు. చెడు సహవాసాలు పట్టి చదువుకు దూరమవుతారు.
తల్లిని దూరం పెట్టడం
కొందరు పిల్లలు తల్లి పంచిన ప్రేమను మరిచిపోయి ఆమెను దూరం పెడతారు. వివాహం తరువాత భర్త మాట వినో, భార్య మాట వినో కావాలనే తల్లితో గొడవపడి చీదరించుకోవడం వంటివి చేస్తారు. తమ బంగారు జీవితానికి కారణమైన తల్లిదండ్రులను మరిచిపోతారు. కేవలం తల్లి తన ఇంట్లో చాకిరి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఆలోచించే పిల్లలూ లేకపోలేరు. బంధువుల ముందు తల్లిని పొగడుతూ, వాళ్ళు వెళ్ళాక హింసలు పెట్టే పిల్లలూ ఉన్నారు. తల్లికి వచ్చే పింఛను కోసం, తల్లికి సంబంధించిన ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం ఎన్నో కుట్రలు పన్నే కొడుకులు, కూతుళ్ళూ మన చుట్టూ ఎందరో ఉన్నారు.
అనాథాశ్రమమే ఆమె ఇల్లా?
నేటి సమాజంలో ఎక్కడ చూసినా అనాథాశ్రమాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వృద్దాప్యంలో ఉన్న తల్లిని పిల్లలు కనికరం లేకుండా హింసిస్తూనే ఉన్నారు. తన ఇంట్లోనే తనను బానిసలాగా చూస్తున్నారు. వెట్టిచాకిరి చేయిస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తిని లాక్కొని వారిని బయటకు గెంటేస్తున్నారు. తల్లిదండ్రులు అడుక్కుని బతికే పరిస్థితికి పిల్లలే కారణమవుతున్నారు. ఈ మధ్య అనాథాశ్రమాల వారికి డబ్బులిచ్చి మరీ తల్లిదండ్రులను చేర్పిస్తున్నారు. వారు చేసిన పనేదో గొప్ప పనైనట్టు, వాళ్ళకొచ్చే జీతాన్ని మొత్తం తల్లిదండ్రులకే ఖర్చు పెడుతున్నట్టు గొప్పలకు పోతున్నారు.
అసలైన మాతృదినోత్సవం
ఈ ఏడాది మే 11వ తేదీన అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అదే నిజమైన మాతృదినోత్సవమా? అమ్మ మనకు ఎంతో చేసింది. మనల్ని ఉన్నతవంతులుగా తీర్చిదిద్దింది. నేడు వృద్దాప్యంలో ఉన్నపుడు కడుపు నిండా అన్నం కూడా పెట్టని దుస్థితి నెలకొంది. డబ్బివ్వలేదనో, ఆస్తి రాసివ్వలేదనో తల్లికి తలకొరివి పెట్టలేని కొడుకులున్నారంటే అది తలదించుకోవల్సిన విషయం. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని మేడల మీద మేడలు కట్టినా, ప్రాణం పోయిన తర్వాత ఏదీ మన వెంటరాదన్న విషయం తెలిసి కూడా ఆ డబ్బును పరులపాలు చేస్తున్నారే కానీ కొందరు పిల్లలు తల్లి కోసం కనీసమైనా ఖర్చు కూడా చేయడం లేదంటే ఎంతటి హృదయ విదారకం. తల్లి పేరు మీద ఉన్న ఆస్తి మీదో, తల్లిదండ్రుల సంపాదన మీదో ఆధారపడి బతుకుతూ, ఆ డబ్బు కోసమే వారి పట్ల ప్రేమ నటించడం మాతృదినోత్సవం అనిపించుకోదు. అమ్మకూ మనసుంటుందని, తనకూ కొన్ని కోరికలు, ఆలోచనలు ఉంటాయని పిల్లలు గుర్తించాలి. మన ఎదుగుదల కోసం తమ ఆనందాలను, చిన్న చిన్న కోరికలను వదులుకున్న అమ్మల కోర్కెలను తెలుసుకొని తీర్చాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. అమ్మ విలువ తెలిసి, అమ్మ ప్రేమ తెలిసి, మనల్ని కన్న అమ్మను చివరిదశలో కడుపులో పెట్టి చూసుకున్నప్పుడే నిజమైన మాతృదినోత్సవమవుతుంది.
అమ్మ ప్రేమను మరువద్దు
బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తల్లి మురిసిపోతుంది. ఆ బిడ్డకు మాటలు వచ్చి, ఓ స్థాయికి ఎదిగి రెక్కలొచ్చిన తర్వాత ‘అమ్మా! నువ్వు నన్ను కన్నందుకు బహుమతిగా నిన్ను అనాథాశ్రమానికి పంపుతానమ్మా’ అని అన్నా కూడా ఆ బాధను బయటకు కనబడనీయకుండా కడుపులోనే దాచుకునే గొప్ప గుణం మాతృత్వానిది. అయితే తప్పని సరి పరిస్థితుల్లో పిల్లలను విడిచి ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులను కూడా నేటి తల్లులకు ఈ సమాజమే సృష్టిస్తోంది. ఒక విధంగా కన్నవారే ఈ విధంగా పిల్లలను ప్రోత్సహిస్తున్నారనిపిస్తుంది. తమ పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని, విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లులు కోరుకుంటారు. ఇది సహజం అలాంటప్పుడు పిల్లలకు మంచి అవకాశాలు వచ్చినప్పుడు కచ్చితంగా దూర ప్రాంతాలకు వెళతారు. అలాగని పిల్లలు తన తల్లిదండ్రులను మరిచి తమ సుఖం తాము చూసుకోకూడదు. నేటి పరిస్థితుల్లో ఈ రెండిటినీ సమన్వయం చేసుకోవల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. దీన్ని అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు ఇద్దరూ అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా తల్లి ప్రేమకు విలువ కట్టలేము. మనం ఎక్కడ ఉన్నా మన అమ్మ సంతోషంగా ఉండేలా చూసుకోవల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. అదే ఈ మాతృదినోత్సవం సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవల్సిన విషయం.
సాహిత్యంలో అమ్మ
మన తెలుగు సాహిత్యంలో ఎన్నో పుస్తకాల్లో, కథల్లో, సినిమాల్లో, పాటల్లో అమ్మ ప్రేమను, అమ్మ ఔన్నత్యాన్ని కొనియాడుతూ రాసిన సందర్భాలున్నాయి. మార్క్సిస్టు సూత్రాల్లో ముఖ్యమైన అంశాలైనా నాయకత్వ లక్షణాలను పెంపొందించటం, మనుగడకై నిరంతరం పోరాడటం, స్త్రీ పురుష స్వేచ్ఛా, ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించుకోవటం వంటివెన్నో ‘అమ్మ’ నవలలో మాక్సీం గోర్కీ చక్కగా వివరించారు. దీనిని క్రొవ్విడి లింగరాజు గారు తెలుగులో అద్భుతంగా అనువదించారు. కె.వి.రమణారెడ్డి రాసిన ‘మాతృక’ కథలో శాంతమ్మ కూతురు నీలమ్మ పెళ్ళి కాకుండానే తల్లవుతుంది. కడుపులో పెరుగుతున్న పసికందును తొలగించాలనుకుంటుంది తల్లి. డా.యశోదకు తన సమస్యను విన్నవించుకుంటుంది. పుట్టిన మూడేండ్లకు మూగ, చెవిటి, బుద్ధి మాంధ్యం కలిగినదిగా మారుతుంది నీలమ్మ. ఓ పాపాత్ముడి వల్ల తన కడుపులో పెరుగుతున్న అభం, శుభం తెలియని పసికందును తొలగించాలనుకున్న శాంతమ్మకు డా.యశోద నచ్చజెప్పి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తుంది. ఈ కథలో తల్లిగా ఆమె సమాజంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను గురించి స్పష్టంగా తెలియజేయబడింది.
పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ‘అనగనగా ఓ కోడిపెట్ట’ కథలో కోడిపెట్ట ఓ తల్లిగా తన కోడిపిల్లలకు సమాజంలో బతకడమెలాగో నేర్పిస్తుంది. నూకలు తినడం, నీళ్ళు తాగడం, అరుగులెక్కడం, దిగడం, ప్రమాదాలను ఎదుర్కోవడం వంటి వన్నీ దగ్గర ఉండి వివరించి చెబుతుంది.
జ్వలిత రాసిన ‘అమ్మ ఓడిపోయింది’ అనే కథలో..పెళ్ళై ఇద్దరు కూతుళ్ళు పుట్టిన తర్వాత వారిని పోషించే స్థోమత లేదని చెప్పి ఒక కూతురుని తాను పోషిస్తానని చెప్పి మరో కూతుర్ని మీరే చూసుకోండని అల్లుడు తన అత్తమామలతో అంటాడు. ఆ అత్త కూడా ఒక అమ్మే కదా.. ఏ తల్లైనా తనకు పుట్టిన ఇద్దరు కూతుళ్ళను విడదీయాలనుకోదు. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ పిల్లల్ని పెంచాలనుకుంటుంది. చివరకు అల్లుడు చేసేది తప్పని తెలిసినా తన మనవరాలి బాధ్యతలు అమ్మమ్మ, తాతయ్య తీసుకుంటారు. ఆ పసిపాపే చివరి వరకు ఆ తండ్రికి తోడుగా ఉంటుంది. తల్లి మనసు ఎంత సున్నితమైంది. ఆ మనసు ఎంతటి కష్టాన్నైనా బాధ్యతగా స్వీకరిస్తుందన్న సందేశాన్ని ఈ కథ చెబుతుంది.
పురిమళ్ళ సునంద రాసిన ‘బంధనం’ కథలో.. అనసూయమ్మ భర్త రాజయ్య ఓ రోజు కూలిపని చేస్తూ ఉండగా గోడకూలి మరణిస్తాడు. భర్త మరణించిన తర్వాత అనసూయమ్మ కొడుకును ప్రేమగా పెంచి ప్రయోజకూడిని చేస్తుంది. కొడుకు దీపిక అనే అమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకుంటాడు. ఆమె డబ్బున్న యువతి. తన తల్లిని తనతో పాటు అమెరికా తీసుకుని వెళ్తాడు. కోడలు తన స్నేహితురాలికి అత్తను ఆయాగా పరిచయం చేస్తుంది. ఆమె అవమానానికి గురై కుమిలిపోతుంది. కొడుకు తన స్వార్థం కోసం తల్లిని విదేశాలకు తీసుకెళ్ళడం ఈ కథలో చూడవచ్చు.
అనిసెట్టి రజిత రాసిన ‘జీవనభృతి’ అనే కథలో చంద్రమ్మ, రామన్నలు వ్యవసాయం చేసుకుంటారు. ముగ్గురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు సంతానం. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళ కోసం ఉన్న పొలం, రెండు ఎకరాల చెలక అమ్ముకోక తప్పలేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవల్సిన బాధ్యతను కొడుకులు విస్మరిస్తారు. పెద్ద మనుషులు తల్లిదండ్రులకు నెలకు ఐదువందల రూపాయలు పంపాలని తీర్మానం చేస్తారు. ఏడాదిపాటు పంపిన తర్వాత తన కర్తవ్యాన్ని మరిచిపోతారు. చిన్న కూతురు వచ్చి తల్లిదండ్రుల ఆరోగ్యం, ఆలనాపాలన చూస్తూ ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదన్న సందేశాన్నిస్తుందీ కథ.
మిడ్కో రాసిన ‘అమ్మ కోసం’ అనే కథలో.. అమ్మ కోసం ఏం చేయగలం అనే నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల మధ్య సాగే సంభాషణ ఈ కథలో కనబడుతుంది. ఆ ఏరియాకి కొత్తగా వచ్చిన ఉమ విద్యకు స్నేహితురాలవుతుంది. తన స్నేహితురాలు అమ్మకోసం మిక్సీని బహుమతిగా తీసుకొస్తుంది. వంటింటి సామ్రాజ్యంలో అమ్మ పాత్ర ఏమిటి? ఓ తల్లి తన కుటుంబం కోసం ఎలా కష్టపడుతుందో ఈ కథలో చూడొచ్చు. వంటింటి సామ్రాజ్యంలో అమ్మకు తెలియనిది ఏమీ ఉండదు. వంటింట్లో తన మానసిక, శారీరక శ్రమలను ధారపోసి అమ్మ ఇవన్నీ చేస్తుంది. ఇంటి బాధ్యతలో కేవలం అమ్మ మాత్రమే కాదు అందరం భాగం అవ్వాల్సిన బాధ్యత ఉందని ఈ కథలో తెలిపారు మిడ్కో.
రవి మంత్రి రచించిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ ఒక తల్లి ప్రయాణానికి చెందిన హృదయపూర్వక అన్వేషణ. ఇది ప్రేమ, త్యాగం, భావోద్వేగ లోతుతో నిండి ఉంటుంది. గొప్ప కథనం ఇది. మరపురాని అనుభవాన్ని అందిస్తాయి. అమ్మ తాలూకు హృదయ స్పర్శ స్పష్టంగా కనిపిస్తుంది. మాతృత్వంలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తూ సమ్మెట ఉమాదేవి రాసిన 17 కథల సంకలనమే ‘అమ్మ కథలు’. ఇందులో అమ్మ ఆలోచనలు, ఆవేదనలు, కన్నీటి వెతలు కనిపిస్తాయి.
నామని సుజనాదేవి రాసిన ‘అమ్మపోయాక’ అనే కథ డైరీ రూపంలో రాయబడిన కథ. కథానాయిక భర్త మరణిస్తాడు. ఉన్నత చదువులు చదివిస్తుంది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరికీ వివాహాలు జరుగుతాయి. ఓ రోజు కూతురు ఇల్లు సర్ధుతుండగా తన తల్లి డైరీని చూస్తుంది. తల్లికి సంబంధించిన అన్ని విషయాలు ఆ డైరీలో ఉంటాయి. భర్త మరణించిన తర్వాత ఆచారాలు, నమ్మకాల పేరుతో సమాజం బాధపెట్టిన తీరు ఆ డైరీలోని అక్షరాల రూపంలో చూడగానే ఆమెకు కన్నీళ్ళు ఆగవు. ఆ సమయంలో దగ్గరికి తీయాల్సిన కుటుంబ సభ్యులు ఆమెను దూరం పెడతారు. తల్లి మనోవేదనను అర్థం చేసుకున్న కూతుళ్ళు వారిని ప్రశ్నిస్తారు. తనకు అండగా ఉన్న రత్నాల్లాంటి కూతుళ్ళను చూసి మురిసి పోతుంది తల్లి. భర్త చనిపోయిన బాధ కన్నా సంప్రదాయం పేరుతో తన చుట్టూ జరిగిన చిత్రవధను రాసుకొచ్చిన కథ ‘అమ్మపోయాక’. ఆ డైరీ చదివిన కూతురు ‘నిన్ను లోకమే హత్య చేసిందమ్మా….’ అంటూ బావురుమన్న తీరు అక్షరాల రూపంలో కనిపిస్తాయి.
- పెద్దపల్లి తేజస్వి, 9603329474