ఓ విదేశీ మహిళ… అందరిలాగే ఆమే కాశ్మీర్ అందాలను చూసేందుకు కొన్నేండ్ల కిందట ఓ పర్యాటకురాలిగా వచ్చారు. చల్లటి సెలయేళ్లను, పచ్చటి ప్రకృతిని చూసి మైమరచిపోయారు. చూసిన అందాలను కేవలం ఆమె కెమెరాలో బంధించుకుపోలేదు. తన మనసునిండా నింపుకున్నారు. కాశ్మీర్‌పై అమితమైన ప్రేమను పెంచుకున్నారు. ఎంతగా అంటే తన జీవితం మొత్తం కాశ్మీర్‌లోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. ఆమే ఎల్లిస్ హుబెర్టినా స్పాండర్మాన్. ఐదేండ్లుగా దాల్ సరస్సును శుభ్రం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు, వ్యక్తిగత నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఈ 69 ఏండ్ల డచ్ మహిళ.
కాశ్మీర్‌లోనే దాల్ సరస్సుకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా శ్రీనగర్ ఐకానిక్ సరస్సుగా దీన్ని చెప్పుకుంటారు. మొఘల్ గార్డెన్స్, గుల్మార్గ్ మంచుతో నిండిన వాలుల వరకు దాని సహజ ఆకర్షణకు ఎవరైనా మంత్రముగ్ధులు కావల్సిందే. అలాంటి సరస్సు అందాలకు డచ్ దేశస్తురాలైన ఎల్లిస్ కూడా పడిపోయారు. ఈ ప్రాంతం పట్ల లోతైన అభిమానాన్ని పెంచుకున్నారు. ఆ అభిమానంతోనే ఐదేండ్ల కిందట తన నివాసాన్ని శాశ్వతంగా కాశ్మీర్‌కు మార్చుకున్నారు. ఆ సరస్సును పరిరక్షించడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. అప్పటి నుండి తన కృషి కొనసాగిస్తూనే ఉన్నారు.
వ్యర్థాలను తొలగిస్తూ…
ఎల్లిస్ దాల్ సరస్సును శుభ్రం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు విస్తృతమైన ప్రశంసలు పొందుతున్నారు. అందుకే స్థానికులు ఆమెను ‘మదర్ ఆఫ్ దాల్’ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. కాశ్మీర్ సహజ సౌందర్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఆమె గత ఐదేండ్లుగా సరస్సు నుండి వ్యర్థాలను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. పర్యాటలు సరస్సులో నిర్లక్ష్యంగా పడేస్తున్న ప్లాస్టిక్ కవర్లు, సీసాలను తీసేస్తూ కనిపించిన ఆమె వీడియో ఒకటి ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది. వీరిలో చాలామంది కాశ్మీర్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన, దేశంలోనే అత్యంత సున్నితమైన పర్యాటక ప్రదేశాలలో ఒకదాన్ని రక్షించడానికి ఆమె చేస్తున్న అచంచల ప్రయత్నాలను ప్రశంసిస్తున్నారు.
ప్రేరణగా పనిచేస్తుంది
కాశ్మీర్ హక్కుల ఫోరం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. (గతంలో ట్విట్టర్)లో వీడియోను షేర్ చేస్తూ ‘గత ఐదేండ్లుగా శ్రీనగర్‌లోని దాల్ సరస్సును శుభ్రపరిచేందుకు నిస్వార్థంగా కృషి చేస్తున్న డచ్ జాతీయురాలు ఎల్లిస్ హుబెర్టినా స్పాండర్‌మాన్‌కు అభినందనలు. ఈ అంకితభావం కాశ్మీర్ సహజ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరణగా పనిచేస్తుంది. మన భూతల స్వర్గాన్ని శుభ్రంగా, సహజంగా ఉంచడానికి చేతులు కలుపుదాం’ అంటూ పిలుపునిచ్చారు. ఎల్లిస్ తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తాను పర్యావరణం కోసం చేస్తున్న కృషిని డాక్యుమెంట్ చేయడానికి మాత్రమే కాకుండా, పర్యావరణంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అవసరమైన మార్పు కోసం కూడా ప్రచారం చేస్తున్నారు.
నాతో చేతులు కలపండి
ఈ వయసులో ఆమె చేస్తున్న కృషికి స్థానికులు, పర్యావరణ వేత్తలు ఫిదా అయిపోతున్నారు. ఎంతో ఓపికతో, ఇష్టంతో ఆమె చేస్తున్న కృషికి ఆశ్చర్యపోతున్నారు. ఆమె నుండి స్ఫూర్తి పొందుతున్నారు.తాము కూడా ఈ ఉద్యమంలో భాగం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాశ్మీర్ టుడే మొదట షేర్ చేసిన వీడియోతో పాటు ‘కాశ్మీర్‌ను శుభ్రపరచడంలో దయచేసి నాకు సహాయం చేయండి. చిన్న ప్రయత్నమైనా దానికి ఎంతో శక్తి ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రయత్నాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. అందరం చేతులు కలిపితే మనం రెండేండ్లలోపు కాశ్మీర్ మొత్తాన్ని శుభ్రం చేయవచ్చు. వేళ్లు చూపించకండి, ఇతర వ్యక్తులను (పర్యాటకులు లేదా స్థానికులు) లేదా ప్రభుత్వాలను నిందించకండి (విభజించి ఆలోచించడం మానేయండి, సహకారంతో ఆలోచించండి). మీ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, నేను చేసినట్లుగా ఇతరుల వ్యర్థాలను సేకరించకుండా మీ సొంతంగా కృషి చేయండి’ అంటూ ఎల్లిస్ పంచుకున్నారు. ఎల్లిస్ కేవలం ప్రకృతి ప్రేమికురాలు, పర్యావరణ పరిరక్షకురాలు మాత్రమే కాదు. చురుకైన సైక్లిస్ట్ కూడా. సైకిల్‌పై శ్రీనగర్ వీధుల్లో తిరుగుతూ పర్యావరణ అనుకూల జీవనం, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు.